రాష్ట్రీయం

సంక్షేమాన్ని గాలికొదిలేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, ఫిబ్రవరి 19: గత సార్వత్రిక ఎన్నికల్లో భారతదేశాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెడుతామని లేనిపోని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన ప్రధాని నరేంద్రమోదీ తన పాలనలో సంపన్నులకు వత్తాసు పలుకుతూ పేదల సంక్షేమాన్ని గాలికి వదిలేశారని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్ చాందీ విమర్శించారు. మోదీని కలసికట్టుగా గద్దె దింపుతామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి చేపట్టిన ప్రత్యేక హోదా భరోసా బస్సు యాత్ర అనంతపురం జిల్లామడకశిరలో మంగళవారం ప్రారంభమైంది. మడకశిర, హిందూపురం, పెనుకొండ ప్రాంతాల్లో భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు బస్సు యాత్రకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బహిరంగ సమావేశాల్లో ఊమెన్ చాందీ మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధాని కావడం తథ్యమన్నారు. ప్రధాని అయిన వెంటనే తొలి సంతకం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఫైలుపైనే ఉంటుందని హర్షధ్వానాల నడుమ పేర్కొన్నారు. కర్నూలులో జరిగిన బహిరంగ సభలో రాహుల్‌గాంధీ ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చారని, అందుకు అనుగుణంగానే ప్రధాని అయిన వెంటనే తొలి సంతకం చేసి తీరుతారన్నారు. విభజన సందర్భంగా పదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పగా ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పదిహేనేళ్లు ఇవ్వాలని డిమాండ్ చేయడం తెలిసిందేనన్నారు. అయితే రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రత్యేక హోదా సంగతి అలాఉంటే కనీనం విభజన హామీలను కూడా అమలు చేయకుండా నిర్లక్ష్యం చేయడం
దారుణమన్నారు. దేశంలో సోదరభావంతో మెలుగుతున్న ప్రజల నడుమ నరేంద్రమోదీ చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు. దళిత, గిరిజన, ముస్లిం మైనార్టీలకు బీజేపీ పాలనలో భద్రత కరవయిందన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయంగా బీజేపీ పేర్కొంటుండగా ఆ పార్టీ ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు పలికిన ప్రాంతీయ పార్టీలు ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ అంశంపై డిమాండ్ చేస్తుండటం తగదన్నారు. వచ్చే ఎన్నికల్లో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని, ప్రాంతీయ పార్టీలకు ఓట్లు వేస్తే వృథా అంటూ పరోక్షంగా టీడీపీ, వైకాపాలను ఉద్దేశించి పేర్కొన్నారు.
పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మద్దతు లేకుండా వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. నిండు మనసుతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలన్నారు. మీ భవిష్యత్తు కోసం మీరు ఓట్లు వేసుకోవాలని సూచించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే రాహుల్‌గాంధీ పీఎం కావాలంటూ రఘువీరా సభికులతో నినాదాలు చేయించారు. పోలవరం ప్రాజెక్టుకు కూడా తగు రీతిలో నిధులు కేటాయించకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డు పడుతోందన్నారు. బీజేపీని ఓడించడమే ధ్యేయంగా ప్రజలు కంకణం కట్టుకోవాలని కోరారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎపీకి ప్రత్యేక హోదాపై తొలి సంతకం పెట్టకపోతే తాను రాష్ట్రంలోనే అడుగు పెట్టనని రాహుల్‌గాంధీ మగధీరుడిలా భరోసా ఇచ్చారని రఘువీరా తెలిపారు. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం పట్ల ఉన్న చిత్తశుద్ధి స్పష్టమవుతోందన్నారు. కాగా ఊహించని రీతిలో అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ భరోసా బస్సు యాత్రకు అటు పార్టీ శ్రేణుల నుండి ఇటు ప్రజల నుండి మంచి స్పందన లభించడంతో నేతల్లో ఉత్సాహం కలిగింది. ఈ బస్సు యాత్రలో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, కర్నాటక ఉప ముఖ్యమంత్రి పరమేశ్వరప్ప, మంత్రి డీకే శివకుమార్, కేంద్ర మాజీ మంత్రులు పళ్ళంరాజు, కనుమూరి బాపిరాజు, కాంగ్రెస్ నేతలు తులసిరెడ్డి, డాక్టర్ శైలజానాథ్, సుధాకర్, మస్తాన్‌రావు, ఎఐసీసీ సభ్యులు కేటీ శ్రీ్ధర్, కోటా సత్యం, బాలాజీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం.. అనంతపురం జిల్లా మడకశిరలో మంగళవారం ప్రారంభమైన కాంగ్రెస్ భరోసా యాత్రలో ప్రసంగిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్ చాందీ. చిత్రంలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరా తదితరులు