రాష్ట్రీయం

కొలువుదీరిన కొత్త మంత్రివర్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు మంత్రివర్గంలో కొత్తగా 10 మందికి స్థానం దక్కింది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌లో కన్నుల పండువగా ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ 10మంది ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు. వరుసగా అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జి. జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్, సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వీ. శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, చామకూర మల్లారెడ్డితో గవర్నర్ ప్రమాణం చేయించారు. అందరూ తెలుగులోనే ప్రమాణం చేశారు. ఉ. 10.30 గంటల నుంచే రాజ్‌భవన్‌కు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర వీఐపీలు రావడం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉ. 11.20 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. జాతీయ గీతాలాపన అనంతరం ఉ.11.33 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ప్రమాణం చేసే ఎమ్మెల్యేలలో అక్షర క్రమంలో ఒక్కొక్కరి పేరు పిలిచారు. తొలుత అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి ప్రమాణం చేసిన అనంతరం గవర్నర్ వద్దకు, ఆ తర్వాత ముఖ్యమంత్రి వద్దకు వెళ్ళి పాదాభివందనం చేశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రమాణం చేసిన తర్వాత గవర్నర్‌కు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శిరసు వంచి నమస్కరించారు. జి. జగదీశ్‌గౌడ్ పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నానని చెప్పగా, మిగతా ఎమ్మెల్యేలు దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ఈటల రాజేందర్ కూడా గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి నమస్కరించారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి పాదాభివందనం చేశారు. వీ. శ్రీనివాస్ గౌడ్ ముఖ్యమంత్రికి పాదాభివందనం చేయబోతుండగా, కేసీఆర్ వద్దని వారించారు. వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్యమంత్రికి పాదాభివందనం చేశారు. చామకూర మల్లారెడ్డి ప్రమాణం చేసిన అనంతరం గవర్నర్‌కు పాదాభివందనం చేశారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా మల్లారెడ్డి పాదాభివందనం చేసేందుకు యత్నించగా, ముఖ్యమంత్రి వద్దని వారించారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు, పార్టీ రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు, శాసనమండలి చైర్మన్ కే. స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, మాజీ స్పీకర్లు మధుసూదనాచారి, కేఆర్ సురేశ్‌రెడ్డి, పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టీ. హరీశ్‌రావు, మజ్లిస్ పార్టీ ఎమ్మెల్సీ సయ్యద్ అమీన్ జాఫ్రీ, ఎంపీ సంతోష్ కుమార్, రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ డాక్టర్ ఎస్. రాజాసదారాం, మాజీ మంత్రులు టీ.హరీశ్ రావు, కడియం శ్రీహరి, సి. లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ కార్యదర్శి వీ. నరసింహాచార్యులు, డీజీపీ వి. మహేందర్ రెడ్డి, తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ సభ్యురాలు డాక్టర్ బి. చంద్రావతి, పలు కార్పొరేషన్ల చైర్మన్లు కోలేటి దామోదర్, రాజేశం గౌడ్, జెడ్‌పీ చైర్‌పర్సన్ తుల ఉమ పాల్గొన్నారు.
ప్రతిపక్షాలు గైర్హాజర్
టీఆర్‌ఎస్‌కు మిత్రపక్షమైన మజ్లిస్ పార్టీ ఎమ్మెల్సీ జాఫ్రీ మినహా మిగతా ప్రతిపక్షాల నాయకులు, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకాలేదు.

మంత్రులు-శాఖలు

ఈటల రాజేందర్: వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం; జీ జగదీశ్‌రెడ్డి: విద్యాశాఖ; ఏ.ఇంద్రకరణ్‌రెడ్డి: అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖలు; తలసాని శ్రీనివాస్ యాదవ్: పశు సంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమ, సినిమోటోగ్రఫీ శాఖలు; వేముల ప్రశాంత్‌రెడ్డి: ట్రాన్స్‌పోర్టు, రోడ్లు-్భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖలు; సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి: వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, ఆహారం, పౌర సరఫరాల శాఖలు; ఎర్రబెల్లి దయాకర్‌రావు: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాల శాఖలు; కొప్పుల ఈశ్వర్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖలు; వీ..శ్రీనివాస్‌గౌడ్: ఆబ్కారీ, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖలు; చామకూర మల్లారెడ్డి: కార్మిక, ఉపాధి కల్పన, ఫ్యాక్టరీస్, మహిళా, శిశు సంక్షేమం, స్కిల్ డవలప్‌మెంట్.
చిత్రం.. రాజ్‌భవన్‌లో మంగళవారం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావుతో కొత్త మంత్రివర్గ సభ్యులు