రాష్ట్రీయం

మళ్లీ రామనారాయణ వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, ఫిబ్రవరి 20: దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం క్షేత్రంలో రామనారాయణపై చర్చను కొందరు మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. సీతారామచంద్రస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న తరుణంలో మళ్లీ ఈ వివాదం మొదలైంది. ‘భద్రాద్రిలో జరిగేది శ్రీ రామ కల్యాణమా, లేక లక్ష్మీనారాయణ కల్యాణమా’ అంటూ కొంతమంది ఏకంగా పుస్తకం ముద్రించి ప్రశ్నిస్తుండటం తీవ్ర వివాదానికి దారితీసింది. దశాబ్ద కాలంగా పలుమార్లు ఈ విషయం నవమికి ముందు తెరపైకి రావడం, అనంతరం తెరమరుగు కావడం పరిపాటిగా మారింది. కానీ ఈసారి ఏకంగా భద్రాచలంలో సీతారాములకు కల్యాణం జరగడం లేదని, ఆలయ సంప్రదాయాలను అర్చకులు మంటగలుపుతున్నారని ఆ పుస్తకంలో పేర్కొనడంతో వివాదం దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టికి వెళ్లింది. రెండు రోజుల క్రితం భద్రాద్రికి చెందిన కొందరు ఆ పుస్తకాన్ని ఆలయ అధికారులకు అందజేసి, పట్టణంలో పలువురికి పంపిణీ చేయడంతో ఆలయ అర్చక స్వాములు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ సంప్రదాయాలను దెబ్బతీసేందుకే కొందరు ఇలా కుట్రలు చేస్తున్నారని అర్చకులు అంటున్నారు. తాజాగా ఈ వివాదంపై ఆలయ ఈవో కూడా స్పందించారు. భద్రాచలంలో రాముడు ఉన్నాడా.. రామ నారాయణుడు ఉన్నాడా.. అనే విషయమై చాలా కాలంగా సాగుతున్న వివాదం పరిష్కారం కాకపోవడంతో ఏకంగా పుస్తకాలు ముద్రించి పంపిణీ చేసే పరిస్థితికి దారితీసింది. భద్రాద్రి రాముడికి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహా నిత్యం కల్యాణం నిర్వహిస్తుంటారు. ఏటా శ్రీరామనవమి రోజు వైభవంగా కల్యాణ క్రతువు జరిపిస్తుంటారు. ఈ క్రతువులో భాగంగా ప్రవర పఠించేటప్పుడు రాముడిని అర్చకులు రామనారాయణుడు అని సంబోధిస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. ఆలయంలో ఇలా ఒక్కొక్కటిగా విధానాలన్నీ మార్చేస్తున్నారని గతంలో శివస్వామి ఆరోపించగా ప్రస్తుతం అన్నదానం చిదంబరశాస్ర్తీ ముద్రించిన పుస్తకంలోనూ ఇదే ఉంది. హిందువులు ఆరాధ్య దైవంగా భావించే శ్రీరాముడిని నారాయణుడితో పోల్చడం సరికాదనేది వారి వాదన. కాగా ఆలయంలో కొందరు అర్చకులు వైష్ణవ సంప్రదాయాన్ని కాలరాస్తున్నారని విమర్శిస్తున్నారు. గతంలో కల్యాణ సమయాల్లో రాముడిని రామనారాయణుడు అనే వారు కాదని, ఆలయంలో సంప్రదాయాలను, ఆచారాలను మార్చే కుట్రలో కొందరు ఒక దశాబ్ద కాలంగా రామనారాయణుడు అనే పేరును ఉటంకిస్తున్నారని పేర్కొంటున్నారు.
భద్రాద్రి వైదిక కమిటీ ఏమంటోందంటే..
భద్రాద్రి దేవస్థానం వైదిక కమిటీ మాత్రం ఆరోపణలన్నీ అవాస్తవాలని, రామనారాయణ పదం ఏనాటి నుంచో ఉందని వాదిస్తోంది. భద్రాచలం ఆలయం శ్రీ రామ క్షేత్రాలన్నింటిలో గొప్ప వైశిష్ట్యాన్ని, అత్యంత విలక్షణతను పొంది ఉందని, ఇక్కడ స్వయంభు అయిన శ్రీరాముడు తన అవతరణ బట్టి శ్రీ వైకుంఠ రామునిగాను, ఓంకార రామునిగాను, శ్రీరామనారాయణుడిగాను ఉంటాడని వైదిక కమిటీ పేర్కొంటోంది. పాంచరాత్ర దివ్యాగమనశాస్త్ర విధానం, శ్రీవైష్ణవ సంప్రదాయ విధానాలతో ఆరాధనలు అందుకుంటూ కొలువుదీరి ఉన్న క్షేత్రం భద్రాచలం రామాలయం అని వారు బదులిస్తున్నారు. ఆలయ సంప్రదాయాలపై కొందరు కావాలనే కుట్ర చేస్తున్నారని, ఏ క్షేత్ర చరిత్రలకైనా వేద, పురాణ, ఇతిహాసాల ప్రామాణికాల కంటే స్థానిక చరిత్రలనే ఆధారంగా తీసుకుంటారని చెబుతున్నారు. ఇందులో భాగంగా వైదిక కమిటీ కొన్ని సాక్ష్యాలను చూపిస్తోంది. 1961లో భద్రాచల శ్రీ సీతారాముల ఉద్ధరణ సంఘం, హైదరాబాద్ పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించిన భద్రాచలం క్షేత్ర పుస్తక పరిచయంలో శ్రీరామనారాయణుడి శబ్దం గురించి వివరించారని, 1961లో భద్రాచలం దేవస్థానం సౌజన్యంతో కంచి కామకోటి పరమాచార్యుల శిష్యుడు కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు భద్రాద్రి రామప్రభువు పేరిట వెలువరించిన శతకంలో సైతం శ్రీరామనారాయణ గురించి ప్రస్తావించారని పేర్కొంటున్నారు. .
రామనారాయణ వివాదం, ఆలయంలో జరుగుతున్న అపచారాలపై ముద్రించిన పుస్తకాల పంపిణీపై దేవస్థానం ఈవో తాళ్ళూరి రమేష్‌బాబు స్పందించారు. బుధవారం ఆయన అర్చకులు, వేద పండితులతో కలిసి మాట్లాడుతూ ఇరువర్గాల వాదనలను దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. ఆలయ సంప్రదాయాల్లో ఏమైనా లోపాలుంటే తన దృష్టికి తీసుకురావాలని, అలా కాకుండా పుస్తకం ముద్రించి పంచడం సరికాదన్నారు. ఇది పూర్తిగా వైదికాంశమని, ఈ విషయం తేల్చాల్సింది దేవాదాయ శాఖ కమిషనర్ అని పేర్కొన్నారు. ఇదే సందర్భంగా ఆలయ విశ్రాంత ప్రధానార్చకుడు కోటి కృష్ణమాచార్యులు వివాదాస్పదంగా మారిన ‘్భద్రాద్రీశునికి జరుగుతున్న ఘోరాపచారాలు’ పుస్తకాన్ని చించివేసి ‘ఈ పుస్తకంలో పేర్కొన్న అంశాలు ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా ఉన్నాయని, భద్రాద్రి ఆలయ ప్రతిష్టను అగౌరవపరిచేలా ఇందులో రాశారని, ఇందులో పేర్కొన్న ఏ ఒక్క అంశం కూడా వాస్తవానికి దగ్గరగా లేదని’ నిరసన తెలిపారు.

చిత్రం.. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం