రాష్ట్రీయం

గండికోటలో బయల్పడిన రేఖాచిత్రాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఫిబ్రవరి 20: దక్షిణాది రాష్ట్రాల్లో ప్రసిద్ధమైన కోటల్లో ఒకటైన కడప జిల్లా గండికోట ప్రాంతంలో ఆది మానవులు రాతిపై గీసిన రేఖాచిత్రాలు బయటపడ్డాయి. రాక్ ఆర్ట్స్ సొసైటీ సభ్యులు రెండురోజులుగా ఇక్కడ జరుపుతున్న పరిశోధనల్లో ఈ రేఖాచిత్రాలు వెలుగుచూశాయి. గత రెండురోజులుగా రాక్ ఆర్ట్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (రాశి) సభ్యులు కట్టా శ్రీనివాసరావు, కొండ్రెడ్డి భాస్కర్‌తో కూడిన బృందం గండికోటలో పరిశోధనలు జరుపుతోంది. ప్రొద్దుటూరుకు చెందిన కవి, కాలమిస్టు సి.వి.సురేష్ సహకారంతో వారు ఈ పరిశోధనలు జరుపుతున్నారు. గండికోటకు పడమర వైపు నుంచి ఒంపుతిరిగి ఉత్తర దిక్కుకు కొండను చీల్చుకుంటూ పెన్నానది ప్రవహిస్తున్న విషయం చూసిన వారందరికీ తెలిసిందే. ఎర్రమల కొండల నడుమ ఎనిమిది కిలోమీటర్లు వ్యాపించిన ఈ సహజ పెన్నా రాతిలోయ గండికోటకు పెట్టని కందకం. ఈలోయ దిగువన ‘లంజల పడవ’గా పిలువబడే ఒక గుహలో వారు ఈ రేఖాచిత్రాలను కనుగొన్నారు. ఈప్రాంతాల్లో ఆది మానవులు నివసించిన ఆనవాళ్లు ఇంతకుముందే బయటపడ్డాయి. అక్కడి రాతి ఆయుధాల ఆనవాళ్లు వాటిని సానబెట్టిన తావులు (గ్రూవ్స్) వంటివి ఇంతకుముందే బయటపడటంతో, ఈ చుట్టుపక్కల పరిసరాల్లో ఆది మానవులు గీసిన రేఖాచిత్రాలు ఉండవచ్చన్న ఆశతో పరిశోధించారు. ఈ పరిశోధనలో ఈ రేఖాచిత్రాలు బయటపడ్డాయి. రేఖాచిత్రాలు బయటపడిన లంజల పడవ గుహలోకి వెళ్లాలంటే దాదాపు పాకుతూ లోపలికి వెళ్లాలి. ఈ గుహలో ఉన్నవారు బయటివారికి కనిపించరు. గుహలోపల ఉన్నవారికి మాత్రం బయట ఉన్నవారు కనిపిస్తుంటారు. కిందపడుకుని గుహ పైభాగాన ఈరాతి చిత్రాలను గీసినట్లు అర్థవౌతోంది. పుడక చిత్రాలను పోలిన మానవాకృతులు కొన్ని తెల్లని వర్ణంలో ఉన్నాయి. అక్షరాలు రాని పిల్లలు గీతలతో మనిషి బొమ్మను గీసినట్లుగా, మనుషుల బొమ్మను గుంపులుగా ఏదో క్రతువు కోసం నిలబడినట్లుగా ఆకారాలు ఉన్నాయి. నిండు చంద్రుడిని పోలిన బొమ్మ ఒకటి కనిపించింది. ఎటువంటి జంతువులు, పక్షుల బొమ్మలు లేవు. మూడేళ్ల క్రితం ఎరుపురంగులోని రాతి చిత్రాలను పరిశోధకులైన ఏనుగుల రామకృష్ణారెడ్డి వెలుగులోకి తెచ్చారు.

చిత్రం.. గుహలో బయల్పడిన రేఖాచిత్రాలు