రాష్ట్రీయం

మినీ మేడారంలో కోలాహలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: మొదటి రోజు మేడారంలో భక్తుల కోలాహలం కొనసాగింది. మండమెలిగె పండుగతో జాతరకు పూజారులు శ్రీకారం చుట్టారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు వన దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ములుగు డీఎస్పీ విజయసారధి, ఆర్‌డీవో రమాదేవిలు మొదటి రోజు సమ్మక్క-సారలమ్మలకు మొక్కులు చెల్లించుకుని జాతరను విజయవంతం చేయాలని వేడుకున్నారు. అనంతరం ఎత్తు బెల్లంలను అమ్మవార్లకు సమర్పించారు. మహాజాతర జరిగిన సరిగ్గా ఏడాది సందర్భంగా గిరిజనుల ఆరాధ్య దైవాలైన సమ్మక్క-సారలమ్మ ఆలయాలను శుద్ధి చేసి పూజారులు భక్తి శ్రద్ధలతో వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. వైభవంగా సాగిన ఈ వేడుకులకు పొరుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. సమ్మక్క-సారలమ్మ నామస్మరణతో తన్మయత్వం చెందుతూ జంపన్నవాగులో స్నానాలు చేసి గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. తల్లులకు ఇష్టమైన బంగారాన్ని (బెల్లం) సమర్పించి తమను చల్లంగా చూడాలంటూ వేడుకున్నారు. బుధవారం ఉదయం నుంచే మేడారం గ్రామంలోని సమ్మక్క ఆలయంలో శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. గుడిని శుభ్రం చేశారు. పూజారుల అడపడుచులు సమ్మక్క ఆలయంలో అలికి ముగ్గులు వేస్తూ ఆలయాన్ని అలంకరించారు. సమ్మక్క పూజాసామాగ్రిని శుభ్రం చేశారు. ఆలయ ప్రధాన పూజారి కొక్కెర కిష్టయ్య, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, పూజారులు మునీందర్, జనార్ధన్, నర్సింగరావు, స్వామి, అరుణ్ తదితరులు గిరిజన సాంప్రదాయబద్ధంగా మండెమెలిగె పూజలు నిర్వహించారు. సమ్మక్క ఆలయం వద్ద పొత్తిలి చల్లి, మామిడాకులతో అలంకరించిన తోరణానికి కోడి పిల్లను కట్టారు. ఎవరూ పొత్తిలి దాడి గుడి ఆవరణంలోకి రాకుండా ఏర్పాట్లుచేశారు. అనంతరం ఊర్లోని గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో ఉన్న పోచమ్మ, మైసమ్మలతో పాటు బొడ్రాయికి కొబ్బరికాయలు, పూలు, ఫలహారాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఊరట్టం గ్రామానికి చెందిన చర్పా వంశీయులు బహుమతిగా ఇచ్చిన చలపయ్యను బలి ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. గిరిజన సాంప్రదాయ పద్ధతిలో జంతువులను బలి ఇవ్వడం, అలాగే సాయంత్రం పూజారులు సమ్మక్క గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటి రోజు మండెమెలిగె పండుగ పురస్కరించుకుని గిరిజన సాంప్రదాయ పద్దతిలో జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. అలాగే సారలమ్మ కొలువైన కనె్నపల్లిలోనూ మండెమెలిగే పండుగను ఘనంగా నిర్వహించారు. కనె్నపల్లిలోని సారలమ్మ ఆలయంలో ప్రధాన పూజారి కాక సారయ్య, కాక కిరణ్, అమృత, వెంకన్న తదితరులు మండెమెలిగే పండుగలో భాగంగా ఆలయాన్ని శుద్ధి చేశారు. సారలమ్మ పూజా సామాగ్రిని శుభ్రం చేసి గర్భగుడిని పుట్టమన్నుతో అలికి ముగ్గులు వేశారు. అనంతరం గ్రామంలో మామిడి తోరణాలు ఏర్పాటు చేసి వైభవంగా మండెమెలిగే పండుగ నిర్వహించారు. సమ్మక్క పుట్టినిల్లు బయ్యక్కపేటలోనూ మండెమెలిగే పండుగ జరిగింది. ఉదయమే సమ్మక్క గిరిజనులకు దొరికిన దేవుని గుట్ట వద్దకు చందా వంశీయులు బాబురావు, వెంకటయ్య, వెంకట్రావు, ముత్యంరావు, కిషన్‌రావు, పరమయ్య, రఘుపతిరావు, ఆదినారాయణ, నారాయణ తదితరుల నేతృత్వంలో వెళ్లి గడ్డి, పుట్టమన్ను తీసుకువచ్చి బయ్యక్కపేటలో ఉన్న సమ్మక్క ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయంలో పుట్ట మన్నుతో అలికి, ముగ్గులు వేశారు. అనంతరం మామిడి తోరణానికి సోరకాయ కట్టి పొత్తిలి చల్లారు. సాయంత్రం ప్రత్యేక మొక్కులతో పూజలు నిర్వహించారు. గురువారం సమ్మక్కను దేవునిగుట్ట నుంచి బయ్యక్కపేటలోని ఆలయానికి తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. రాత్రి ఆటపాటలతో సమ్మక్క నామస్మరణలతో బయ్యక్కపేటలోని ఆలయంలో భక్తులు వేడుకలు జరుపుకున్నారు. వేలాది సంఖ్యలో భక్తులు మేడారం జాతరకు తరలివస్తుండడంతో అదికారులు భారీ ఏర్పాట్లుచేశారు. పోలీసు శాఖ ప్రత్యేకంగా మేడారం జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఏర్పాట్లు చేపట్టారు. ఫస్రా సర్కిల్‌లోని ఎస్సైలు స్పెషల్ పార్టీ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
చిత్రం.. అమ్మవార్లకు ఎత్తు బెల్లం సమర్పిస్తున్న కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు