రాష్ట్రీయం

తిరుమల మెట్లపై రాహుల్ మారథాన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 22: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానన్న తన మహా సంకల్పాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేయడానికి తిరుపతికి విచ్చేసిన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ముందుగా అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు 1.40 గంటల వ్యవధిలో చేరుకున్నారు. గతంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంత వేగంగా తిరుమలకు కాలినడకన చేరుకున్న దాఖలాల్లేవని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. 48 సంవత్సరాల రాహుల్‌గాంధీ కాలి నడకన తిరుమలకు వెళుతుంటే భద్రతా సిబ్బంది నానాతంటాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాలి మార్గంలో వెళుతున్న శ్రీవారి భక్తులు కూడా వేగంగా నడుస్తున్న తీరును చూసి అబ్బురపడ్డారు. కాలినడకన వెళ్లే సమయంలో రాహుల్‌గాంధీ తనను చూస్తున్న భక్తులకు అభివాదం చేయడం కనిపించింది. ఇదిలావుండగా తిరుమలకు చేరుకున్న రాహుల్‌గాంధీ సామాన్య భక్తుడిలా శ్రీవారి ఆలయానికి వెళ్లి మహాలఘు దర్శనంలో స్వామివారిని దర్శించుకుని వెంకన్న పట్ల తనకున్న భక్తిని చాటుకున్నారు. రానున్న ఎన్నికల్లో దేశ ప్రధాని కావాలన్న బలీయమైన సంకల్పంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ దాదాపు 10 సంవత్సరాల తరువాత శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు. అయితే స్వామివారిని కారులో రోడ్డుమార్గన వెళ్లి దర్శించుకోవడానికి ఆయన ఆసక్తి చూపలేదు. సాధారణ భక్తుడిలా కాలినడకన తిరుమలకు వెళ్లాలని సంకల్పించారు. ఇందుకు కాంగ్రెస్ నాయకులు తమ నాయకుడు ఎక్కువ దూరం నడవకుండా తక్కువ సమయంలో తిరుమలకు వెళ్లేందుకు శ్రీవారి మెట్టు మార్గాన్ని ప్రతిపాదించారు. ఆ ప్రాంతం దట్టమైన అటవీప్రాంతం కావడంతో భద్రత అంత సులభం కాదని పోలీసు వర్గాలు కాంగ్రెస్ నేతలకు సంకేతాలిచ్చాయి. దీంతో రాహుల్‌గాంధీ కారులో రోడ్డుమార్గాన తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారని కాంగ్రెస్ వర్గాలతోపాటు అధికారులు కూడా భావించారు. అలిపిరి మార్గంలో నడిచి వెళ్లడం కష్టమని కొంతమంది కాంగ్రెస్ నాయకులు రాహుల్‌గాంధీకి సూచించినట్లు సమాచారం. దేశ ప్రధాని కావాలనే సంకల్పం ఉన్న తనకు వేంకటేశ్వర స్వామిని కాలినడకన వెళ్లి దర్శించుకోవడం కష్టం అనుకుంటే ఎలా? అనుకున్నారేమో కాని అలిపిరి మార్గాన కాలినడక వెళతానని నేతలకు స్పష్టం చేశారు. ఈనేపథ్యంలో శుక్రవారం 10.52 గంటలకు ప్రత్యేక విమానంలో తన మేనల్లుడు, ప్రియాంక గాంధీ తనయుడు రైహాన్ వాద్రాతో కలిసి 11.39 గంటలకు అలిపిరి మార్గాన తిరుమలకు బయలుదేరారు. రాహుల్‌గాంధీ కాలి మెట్లు ఎక్కే సమయంలో మందగమనంతో నడుస్తారని ఇటు కాంగ్రెస్ నాయకులు, అటు భద్రతా సిబ్బంది, పాత్రికేయులు భావించారు. రాహుల్‌గాంధీ అలిపిరి వద్ద నుంచి కాలినడకన బయలుదేరి వాయువేగంతో ముందుకెళ్లారు. ఒక దశలో ఎస్పీజీ సిబ్బంది కూడా ఆయన వెంట నడవలేక వెనకబడ్డారనే చెప్పాలి. కాలినడక సందర్భంగా భద్రతా సిబ్బంది, పోలీసులు చెమటలు కక్కారు. రాహుల్‌గాంధీ, ఆయన మేనల్లుడు రైహాన్ వాద్రాలు అతి సునాయాసంగా తిరుమలకు చేరుకున్నారు. కేవలం 1.40 గంటల్లో రాహుల్‌గాంధీ తన కాలినడకను పూర్తిచేసుకున్నారు. జీఎన్‌సీ టోల్‌గేట్ వద్ద నుంచి కారులో తనకు బస ఏర్పాటు చేసిన కృష్ణ అతిథి భవనం వద్దకు మధ్యాహ్నం 1.40 గంటలకు చేరుకున్నారు. కొంత విశ్రాంతి అనంతరం 3 గంటలకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు వెళ్లారు. రాహుల్‌గాంధీకి జడ్ కేటగిరి భద్రత ఉండటంతో టీటీడీ అధికారులు కొంత సమయం పాటు క్యూ లైన్లను ఖాళీగా ఉంచారు. వైకుంఠం కాంప్లెక్స్ గుండా శ్రీవారి ఆలయంలోకి వెళ్లిన రాహుల్‌గాంధీ సామాన్య భక్తుడిలా మహాలఘు దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఏదేమైనా రాహుల్‌గాంధీ తాను పాల్గొనే ప్రత్యేక హోదా ప్రజా భరోసా బస్సు యాత్ర కంటే ఆయన కాలినడకన తిరుమలకు వెళ్లిన వాయువేగం క్షణాల్లో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందన్నది అక్షర సత్యం.