రాష్ట్రీయం

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న రామకృష్ణ గురువారం గచ్చిబౌలిలోని ఏఐజి ఆస్పత్రిలో ఊపిరితిత్తుల ఇనె్ఫక్షన్‌కు వైద్యం నిమిత్తం చేరారు. అయితే, ఆరోగ్య పరిస్థితి విషమించటంతో శుక్రవారం మధ్యాహ్నం ఆయన తుది శ్వాస విడిచారు. కోడి రామకృష్ణ మరణ వార్తతో చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. తెలుగు చిత్రాలకు సరికొత్త ఒరవడినేర్పి దర్శకత్వ ప్రతిభతో ఎన్నో విజయాలందుకున్న కోడి రామకృష్ణ, అటు తమిళ, మలయాళ, హిందీ పరిశ్రమల్లోనూ ఎన్నో చిత్రాలను తెరకెక్కించి సక్సెస్‌లు అందుకున్నారు. తెలుగు పరిశ్రమలోని అగ్ర హీరోలందరితో చిత్రాలు తీసిన ఘనత దర్శకుడిగా కోడి రామకృష్ణకు దక్కింది. మధ్య తరగతి జీవితాలనే ఇతివృత్తాలు చేసుకుని సినిమా చూపించిన దర్శకుల జాబితాలో ఆయనది ప్రత్యేక స్థానం. సినీ పరిశ్రమలో 30ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో వంద చిత్రాలకు దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ, మూడేళ్ల క్రితం చివరిగా కన్నడలో ‘నాగహారవు’ చిత్రానికి దర్శకత్వం వహించారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 1949 జూలై 23న పుట్టిన కోడి రామకృష్ణకు 69ఏళ్లు. భార్య పద్మ, ఇద్దరు పిల్లలు దీప్తి, ప్రవల్లిక. పాలకొల్లు ప్రాంతం నుంచి అనేకమంది పరిశ్రమకు వచ్చినట్టే సినిమాలపై మమకారంతో కోడి రామకృష్ణ సైతం పరిశ్రమకు వచ్చారు. ఎంతోమంది వద్ద సహాయ దర్శకునిగా పని చేసి, 1979లో ‘కోరికలే గుర్రాలైతే’ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్ అయ్యారు. ఆ అనుభవంతో మెగాస్టార్ చిరంజీవి, మాధవి, గొల్లపూడి మారుతీరావు ప్రధాన పాత్రలతో 1982లో విడుదలైన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రానికి దర్శకత్వం వహించారు. దర్శకుడిగా తొలి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోడవమే కాదు, 500 రోజులు ఆడిన చిత్రంగా ఆ సినిమా రికార్డు సృష్టించింది. తరువాత ‘మంగమ్మగారి మనవడు’, ‘ఆహుతి’, ‘శత్రువు’, ‘అమ్మోరు’, ‘అంజి’, ‘అరుంధతి’లాంటి చిత్రాలతో టాలీవుడ్‌లో కోడి రామకృష్ణ హవా నడిచింది. అర్జున్, భానుచందర్, సుమన్‌లాంటి ఎంతోమంది ఆర్టిస్టులను పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడు కోడి రామకృష్ణ. తాను తీసిన చిత్రాలతో 10 నంది పురస్కారాలు, 2 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్న కోడి రామకృష్ణ 2012లో రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు. ‘దొంగాట’, ‘ఇంటిదొంగ’లాంటి చిత్రాల్లో నటుడిగానూ ఆయన ప్రతిభ చాటుకున్నారు.
కోడి రామకృష్ణ మృతిపట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె చంద్రశేఖర్ రావు, చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సినీరంగంలో తనదైన శైలితో ఎన్నో చిత్రాలను తెరకెక్కించి, 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ ప్రత్యేక గుర్తింపు సాధించారని కేసీఆర్ అన్నారు. గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగిన కోడి రామకృష్ణ, ఆ గ్రామీణ కుటంబ నేపథ్యంలోనే ఎన్నో చిత్రాలను తెరకెక్కించి విజయాలు అందుకున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటుగా ఇరువురు ముఖ్యమంత్రులు అభివర్ణించారు. కోడి రామకృష్ణ మృతిపట్ల తెలుగు నిర్మాతల మండలి, పరిశ్రమ ప్రముఖులు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మోహన్‌బాబు, మహేష్‌బాబు, జూ. ఎన్టీఆర్ తదితరులు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబీకులు తెలిపారు.