రాష్ట్రీయం

రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రత్యేక హోదా ఇస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 22: రానున్న ఎన్నికల్లో దేశ ప్రజలు ఆదరించి, ఆశీర్వదించి ప్రధానిని చేస్తే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తన తొలి సంతకం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంపైనే ఉంటుందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చేపట్టిన ప్రత్యేక హోదా భరోసా బస్సు యాత్ర తిరుపతికి చేరుకున్న నేపథ్యంలో బస్సు యాత్రలో పాల్గొని అనంతరం ఎస్వీయూ తారకరామ క్రీడా మైదానంలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇచ్చింది అంటే ఆ మాటను నిలబెట్టుకోవడానికి కట్టుబడి ఉంటుందన్నారు. ఇటీవల ముగిసిన ఎన్నికల సందర్భంగా మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు 10 రోజుల్లో రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చానన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మిన అక్కడి ప్రజలు అధికారం ఇచ్చారన్నారు. ఈక్రమంలో 10 రోజుల్లో రుణమాఫీ అని చెప్పినా తమ పార్టీ ముఖ్యమంత్రులు రెండు రోజుల్లోనే రైతులకు రుణమాఫీ చేసి తమ నిబద్దతను చాటుకున్నారని అన్నారు. అయితే నరేంద్ర మోదీ ఇచ్చిన మాటను తప్పే మనిషిగా చరిత్రలో నిలిచిపోయేలా వ్యవహరించారన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఐదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నిర్ణయించారన్నారు. అటు తరువాత ఎన్నికల నేపథ్యంలో ప్రధాని అభ్యర్థిగా తిరుమల వెంకన్న పాదాల చెంత సభలో పాల్గొన్న నరేంద్ర మోదీ 10 సంవత్సరాలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా స్తామంటూ వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలను వంచించారన్నారు. ఒక ప్రధాని మాట ఇవ్వడమంటే అది దేశంలోని 125 కోట్ల మంది ప్రజల మాటని అర్ధమన్నారు. అంతటి విలువైన మాటను నరేంద్ర మోదీ తుంగలో తొక్కారని నిప్పులు చెరిగారు. ఇక ప్రతి పేదవాని ఖాతాలో రూ. 15 లక్షలు జమ చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చారన్నారు. అలాగే ఏటా రెండు కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తానని హామీ ఇచ్చారన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తానని ప్రకటించారన్నారు. అయితే వీటిలో ఏ ఒక్కటీ కూడా మోదీ అమలు చేయలేదన్నారు. మోదీ చేసే ప్రతి ప్రకటన ఒక అబద్ధమన్నారు. తనకు అధికారం ఇస్తే దేశానికి కాపలాదారుడిగా ఉంటానని, అవినీతిపై పోరాడతానని మోదీ చెప్పుకున్నారని అన్నారు. అయితే అటు తరువాత అవినీతికి కాపలాదారుడిగా మారారని విమర్శించారు. రాఫిల్ యుద్ధ విమానాల కొనుగోలులో తన మిత్రుడు అనిల్ అంబానీకి మేలు చేయడం కోసం రూ.30 వేల కోట్లు ప్రజా ధనాన్ని దోచిపెట్టారని ఆయన నిప్పులు చెరిగారు. యుద్ధ విమానాలకు సంబంధించి ప్రభుత్వ సంస్థ అయిన హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్‌ను పక్కనపెట్టి అనిల్ అంబానీని గుత్తేదారుని చేసిన ఘనుడు మోదీ అన్నారు. దేశంలో ఎక్కడకు వెళ్లినా మోదీ కాపలాదారుడంటే కాదు, దొంగ... దొంగ అని ప్రజలు నినదిస్తున్నారన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ 2013లో ప్రజల భూములను సంరక్షించేందుకు సంస్కరణలకు శ్రీకారం చుడుతూ చట్టం చేసిందన్నారు. ప్రజల భూములను ప్రభుత్వాలు తీసుకోకుండా ఆ చట్టం అండగా ఉండేలా చేశామన్నారు. ఒకవేళ ఎక్కడైనా దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరి వద్దనైనా భూములు తీసుకుంటే మార్కెట్ ధర లక్ష రూపాయలు ఉంటే నాలుగు లక్షలు చెల్లించాలని చట్టంలో పొందుపరచామన్నారు. ఒకవేళ భూములు తీసుకుని ఐదు సంవత్సరాల్లోపు ఏ సంకల్పంతో భూసేకరణ చేశారో ఆ పనులు ప్రారంభించకపోతే ఆ భూములను తిరిగి సంబంధిత రైతులకు ఇవ్వాలని కూడా చట్టంలో పొందుపరిచామన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి ప్రజలు, రైతులు పట్ల ఉన్న చిత్తశుద్ధి అన్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలోకి వచ్చిన తరువాత రూ. 70వేల కోట్ల మేర రుణమాఫీ చేశామన్నారు. ఈనేపథ్యంలో బీజేపీ ఎంపీలు రూ. 70 వేల కోట్లు రుణమాఫీ ఎలా చేశారంటూ పార్లమెంట్‌లో ప్రశ్నించినప్పుడు ఆ విధానాన్ని వివరించి వారి నోళ్లు మూయించామన్నారు. రైతులకు రుణమాఫీ చేయడానికి నిధులు లేవన్న మోదీ ప్రభుత్వం మూడున్నర లక్షల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన బడా పారిశ్రామికవేత్తలకు రుణమాఫీ చేసిన ఘనుడు మోదీ అన్నారు. ఇక జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా వద్ద జరిగిన ఉగ్ర దాడిలో 49 మంది వీర జవాన్లు మరణించినా కనికరం లేని ప్రధాని మోదీ అన్నారు. ఒకవైపు తమకు అండగా ఉన్న వారిని ఉగ్రవాద దాడిలో పోగొట్టుకున్న కుటుంబ సభ్యులు అల్లాడుతుంటే తమ సహచర సైనికులను హతమార్చేందుకు సాటి సైనికుల రక్తం మరుగుతున్నా మోదీలో మాత్రం చలనం రాలేదన్నారు. ఉగ్రవాద దాడి జరిగిన సమయంలో నేషనల్ పార్కులో మోదీ ఎన్నికల ప్రచారం కోసం తనపై తీస్తున్న లఘు చిత్రీకరణలో తలమునకలై ఉన్నారన్నారు. మరో దారుణం ఏమిటంటే ఉగ్రవాద దాడి జరిగిన మూడున్నర గంటల తరువాత మోదీ మీడియా ముందు తన ప్రచార లఘు చిత్రానికి సంబంధించి వివరిస్తూ, నవ్వుతూ సమాధానాలు చెప్పారన్నారు. ఇది తన ఆరోపణలు కావని ఇప్పుడు ఎక్కడైనా ఈ దృశ్యాలు చూడవచ్చన్నారు. సైనికులు చనిపోయారన్న బాధ మోదీలో ఏ కోశాన కనిపించకపోవడం దుర్మార్గమన్నారు. ఇలాంటి వారు జాతీయవాదులమని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. తన తీరుపట్ల మోదీ కూడా సిగ్గు పడాలన్నారు. తిరుపతి ఆంధ్ర రాష్ట్రంలో ఒక గొప్ప పుణ్యక్షేత్రమన్నారు. ఈ వేదిక నుంచి ప్రత్యేక హోదా ఇస్తానని మోదీ మాట ఇచ్చి తప్పారని అన్నారు. తాను మరో వంద రోజుల్లో అధికారంలోకి వచ్చి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతానని మరోసారి భరోసా ఇస్తున్నానని రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు.