ఆంధ్రప్రదేశ్‌

ఇక కేంద్రాన్ని ప్రశ్నిద్దాం: మంత్రులతో చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 3: రాష్ట్ర రెవెన్యూ లోటు రూ.13,787 కోట్లను భర్తీ చేస్తామని ఊరించి నిరాశపరిచిన కేంద్రం గత ఆర్ధిక సంవత్సరం చివరి మూడు రోజుల్లో కేవలం రూ. 3272 కోట్లు ఇచ్చింది.
ఇందులోనే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీల అమలుకు రూ.900 కోట్లు ఉన్నాయి. కేంద్రం తమ పట్ల అనుసరిస్తున్న వైఖరితో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. మంత్రిమండలి సమావేశంలో కూడా చంద్రబాబు తనకు సన్నిహితంగా ఉన్న ఇద్దరు సీనియర్ మంత్రులతో ఇదే విషయమై చాలాసేపు ప్రస్తావించినట్టు తెలిసింది. ‘బిజెపి తీరు ఇలాగే ఉంటే మాత్రం చాలా కష్టాలు ఎదుర్కొంటాం. ఇక బతిమలాడే పరిస్ధితి పోయింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇక కేంద్రంపై వత్తిడిని పెంచే బదులు, ప్రశ్నించే వైఖరిని అవలంబిస్తామ’ని చంద్రబాబు అన్నట్లు సమాచారం.
2015-16 ఆర్ధిక సంవత్సరానికి చివరి మూడు రోజుల్లో కేంద్రం విదిల్చిన నిధులు కేవలం రూ. 3272 కోట్లు. ఇందులో విభజన చట్టంలో హామీల కింద రూ.900 కోట్లు ఉన్నాయి. కేంద్ర పన్నుల వాటా కింద రూ.1369 కోట్లు, సిఎస్‌టి వాటా కింద రూ. 643 కోట్లు, డిజాస్టర్ రిలీఫ్ కింద రూ. 360 కోట్లు వచ్చాయి. ఈ నిధులు గత నెల 28 నుంచి 31 మధ్య కేంద్రం విడుదల చేసింది. ఈ నిధులు అన్ని రాష్ట్రాలతో సమానంగా వచ్చే కేటగిరీలో ఉన్నాయి.
ఇవి కాకుండా అదనంగా విభజన చట్టంలోని హామీల అమలు కింద లోటు పూడ్చుకునేందుకు రూ. 500 కోట్లు, పోలవరంకు రూ. 200 కోట్లు, రాజధాని నిర్మాణంకు రూ. 200 కోట్లు ఇచ్చారు.
కేంద్రం గత ఏడాది ఇచ్చిన రూ.2300 కోట్లకు సంబంధించి వినియోగ పత్రాలను కూడా సమర్పించినట్లు ఆర్ధిక శాఖ పేర్కొంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి సన్నాహక పనులు, వౌలిక సదుపాయాలు, పోలవరం ప్రాజెక్టు, వెనకబడిన జిల్లాల అభివృద్ధికి సంబంధించి ఇచ్చిన నిధులు ఖర్చుపెట్టామని ఆర్ధిక శాఖ వర్గాలు తెలిపాయి.
విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రాకు రూ. 13787 కోట్లు రావాలని అకౌంటెంట్ జనరల్ ఇప్పటికే కేంద్రానికి సిఫార్సు చేశారు. నీతి అయోగ్ అడిగిన సందేహాలను నివృత్తి చేశామని ఆర్ధిక శాఖ పేర్కొంది.
వేలానికి అగ్రిగోల్డ్ ఆస్తుల ఖరారు
మూడో వారంలో వేలం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 3: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అగ్రి గోల్డ్ బాధితులకు అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ప్రకటన కాస్త ఊపిరిపోసింది. ఈ నెల 20, 21 తేదీల్లో అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి ప్రణాళిక సిద్ధమవుతోంది. ఇప్పటివరకు జుడిషియరీ కమిటీ గుర్తించిన ఆరు ఆస్తులు బెంగుళూరులోని మహదేవపూర్‌లో గల సర్వే నంబర్ 74/3లో 25 రెసిడెన్షియల్ ప్లాట్లు, కర్నాటకలోని కొలార్, నాదుపల్లిలోని 24 రెసిడెన్షియల్ ప్లాట్లు, మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ సమీపంలోని శేరిగూడలోని 30 రెసిడెన్షియల్ ప్లాట్లు, విజయవాడలోని పాయకపురంలోని కొన్ని ప్లాట్లను వేలం వేయనుంది. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలోని హోసర్ జిల్లాలోని బగలూరులోగల 11 ప్లాట్లు, విశాఖపట్నం రేగులపాలెంలోని 150 రెసిడెన్షియల్ ప్లాట్లను జుడిషియరీ కమిటీ గుర్తించింది. ఈ ప్లాట్లను వేలం వేసేందుకు ఏర్పాట్లను కమిటీ పూర్తి చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా 32 లక్షల డిపాజిటర్లు ఉండగా ఆంధ్రప్రదేశలోనే 19.52 లక్షల డిపాజిట్ దారులున్నారు. వీరికి అగ్రీగోల్డ్ సంస్థ సుమారు రూ. 6,380 కోట్లు చెల్లించాల్సి ఉంది. సిఐడి నివేదిక మేరకు అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
ప్రశాంతంగా జెఇఇ మెయిన్స్ పరీక్ష
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 3: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జెఇఇ మెయిన్స్ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే ఈ పరీక్షకు విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరవుతారు. ఆఫ్‌లైన్ పద్ధతిలో జరిగిన ఈ పరీక్షను సిబిఎస్‌ఇ బోర్డు నిర్వహించింది. ఉదయం 9.30 నుంచి ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 12.30 వరకు జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు బిఆర్క్, బి-ప్లానింగ్ పరీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షను 12 లక్షల మంది రాస్తుండగా, తెలుగు రాష్ట్రాల నుంచి 1,17,121 మంది హాజరయ్యారు. ఈ నెల 9, 10 తేదీల్లో ఆన్‌లైన్ ద్వారా ఇదే పరీక్ష జరుగుతుంది. పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించమని నిబంధనలు విధించడంతో విద్యార్థులు హైరానాపడుతూ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాలను పరీక్షా కేంద్రాలుగా అనుమతించారు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు ఈ ప్రవేశపరీక్షను రాశారు.