రాష్ట్రీయం

మనమే కింగ్‌మేకర్లం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మార్చి 9: రాబోయే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే రానుందని అందులో టీఆర్‌ఎస్ పార్టీయే కీలకంగా మారబోతుందని ప్రధానమంత్రిని నిర్ణయించేది కూడా కేసీఆరేనని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పునరుద్ఘాటించారు. శనివారం నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ కార్యకర్తల సన్నాహక సమావేశం వనపర్తిలో నిర్వహించారు. కేటీఆర్ ముఖ్యఅతిథిగా హజరై పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ నాయకులు కార్యకర్తలు అంతా సన్నద్దం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల కంటే అతి ఉత్సహంతో పనిచేసి పార్లమెంట్ స్థానాలను లక్షలాది మేజారిటీలతో గెలిపించుకోవాలని ఆయన కోరారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ రెండు పార్లమెంట్ స్థానాల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని, మెజారిటీలక్షల్లో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత ఐదేళ్లుగా చేసింది ఏమీ లేదని ప్రసంగాలు మాత్రం ఇవ్వడంలో ఆయన దిట్ట అని ఎద్దెవా చేశారు. మోదీ సారథ్యంలోని ఎన్‌డిఏ కూటమికి 150 సీట్లలోపే ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని అదేవిధంగా కాంగ్రెస్ సారథ్యంలో గల యూపీఏకు వందసీట్లు దాటే అవకాశం లేదని, ఈ రెండు కూటములు కలిసిన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వీలు లేకుండా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేయబోయే ఫెడరల్ ఫ్రంట్‌కు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 70నుండి 80 ఎంపీస్థానాలు గెలువడం ఖాయమని జోస్యం చెప్పారు. దాంతో భారతదేశ ప్రధానిగా ఎవరు ఉండాలో అనేది కేసీఆర్ నిర్ణయిస్తారని ఫెడరల్ ఫ్రంట్‌లో టీఆర్‌ఎస్ పార్టీయే కీలకపాత్ర అన్నారు. రాహుల్‌గాంధీ, మోదీ మధ్యలోనే ఎన్నికలు అంటూ రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ నాయకులు అంటున్నారని ఆసలు విషయం వాళ్లు గ్రహించడం లేదన్నారు. దక్షణాది రాష్ట్రాల్లో జాతీయ పార్టీ ఉనికే లేదని ఆ పార్టీలకు పార్లమెంట్ ఎన్నికల్లో దక్షణాది రాష్ట్రాల్లో ఘోరపరాజయం తప్పదని హెచ్చరించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అడుగంటి పోయిందని బీజేపీకి పుట్టగతులే లేవని ఆయా పార్టీల నాయకులు మాత్రం గొప్పగా మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికే భయపడుతున్నారని అన్నారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం నుండి గతంలో పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది ఉండేవరని కానీ టీఆర్‌ఎస్ దెబ్బకు మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ పోటీ చేయడానికే భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. తప్పకుండా ఢిల్లీని శాసిస్తామని 16పార్లమెంట్ స్థానాల్లో గులాబీ జెండా ఎగురడం ఖాయమని అందుకు పార్టీ ఎమ్మెల్యేలు అన్ని క్షేత్రాల ప్రజాప్రతినిధులు బూత్‌స్థాయి నుండే ప్రణాళికలు రచించుకుని పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇతర పార్టీల కార్యకర్తలను సైతం మోహమాటం లేకుండా ఓట్లు అడగాలని ఓడిపోయేవారికి ఎందుకు వేస్తారంటూ వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ఇటివల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అక్కడక్కడ కొందరు ఇతర పార్టీల సానుభూతిపరులు గెలిచి ఉంటే వారు టీఆర్‌ఎస్‌లోకి వస్తే కలుపుకుని పోవాలని అలాంటి వారందరికి గులాబీ కండువాలు కప్పాలన్నారు. స్థానికంగా కొన్నికొన్ని ఇబ్బందులు ఉంటే వాటన్నింటిని పక్కన పెట్టి బేషజలాలకు పోకుండా ప్రతి ఓటు కేసీఆర్‌కు అనే భావనతో ప్రతి ఒక్కరు నడుచుకోవాలన్నారు. గ్రామస్థాయి నాయకులు మొదలుకుని మంత్రుల వరకు ఇక పార్లమెంట్ ఎన్నికలపైనే దృష్టి సారించాలని రేపోమాపో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానం గెలిస్తే గద్వాల నుండి మాచర్ల వరకు రైలు కూతవినబడనుందని దశబ్దాల పాటు ఈ నియోజకవర్గ ప్రజలు కంటున్న కలలను టీఆర్‌ఎస్ పార్టీ నేరవేరుస్తుందన్నారు. కేంద్రంలో టీఆర్‌ఎస్ పార్టీయే కీలకంగా మారబోతున్న నేపథ్యంలో ప్రజలు కూడా టీఆర్‌ఎస్ వెంట ఉండాలని పిలుపునిచ్చారు. 2004-14 వరకు నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానంలో టీఆర్‌ఎస్ గెలువలేదని కానీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 6అసెంబ్లీ స్థానాలు గెలిచి 51శాతం ఓటుసాధించి 6.33లక్షల ఓట్లు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు పడ్డాయని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా 8.75లక్షల ఓట్లు రావాలని అందరు ఎమ్మెల్యేలకు టార్గెట్ ఇచ్చామని కాంగ్రెస్ గెలిచిన కొల్లాపూర్‌లో సైతం మేజారిటీ తీసుకురావాలని కేటీఆర్ టీఆర్‌ఎస్ నేతలకు సూచించారు. ఈ సభలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఢిల్లీలో అధికార ప్రతినిధి మంధజగన్నాథం, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.

చిత్రాలు.. . వనపర్తిలో నిర్వహించిన నాగర్‌కర్నూల్ పార్లమెంట్ టీఆర్‌ఎస్ సన్నాహాక సభలో ప్రసంగిస్తున్న పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, సభకు హజరైన టీఆర్‌ఎస్ శ్రేణులు