రాష్ట్రీయం

ప్రతి కుటుంబానికి నేనున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, మార్చి 17: పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశాను. .వారి బాధలు విన్నాను...సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రతీ కుటుంబానికి ‘నేనున్నాను’ అని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో మొదటిసారిగా సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని జగన్ ఆదివారం ప్రారంభించారు. ఈసందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదేళ్ళు పూర్తయినా పేద ప్రజల సమస్యలను పట్టించుకోలేదన్నారు. ఆరోగ్యశ్రీ అమలు కాక అనారోగ్యాల బారిన పడిన వారు ఆస్తులు అమ్ముకుని వైద్యం చేయించుకుంటున్నారని అన్నారు. 108 అంబులెన్స్‌ల జాడే కనిపించడం లేదన్నారు. మద్యానికి బానిసలై ఆరోగ్యం దెబ్బతిన్న వారికి వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయలేదన్నారు. నిరుద్యోగులకు భృతి ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా ఓట్లు కోసం మూడు నెలల క్రితం నెలకు వెయ్యి రూపాయలు ఇచ్చి మోసం చేస్తోందన్నారు. తాగునీటికి ప్రజలు అల్లాడుతున్నారన్నారు. ఏ పని కావాలన్న లంచం లేనిదే జరగని పరిస్థితి చంద్రబాబు పాలనలో నెలకొందన్నారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే అవినీతికి తావులేని పరిపాలన అందిస్తామన్నారు. పేద ప్రజలు వైద్యపరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగిస్తామని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు వ్యవసాయ పెట్టుబడికి ముందుగానే ఆర్ధిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన పేదలను ఐదేళ్ల కాలంలో లక్షలాధికారులను చేస్తామని స్పష్టం చేశారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంతోపాటు ప్రైవేట్ రంగంలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం తీసుకువస్తామన్నారు. జలయజ్ఞానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రతీ ఎకరానికి నీరు అందించడమే తమ ధ్యేయమన్నారు. కుల,మత రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను పేదలకు అదించడమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. జన్మభూమి కమిటీలను రద్దు చేస్తామని ఆయన ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఆక్రమణలకు గురికాకుండా చట్టంలో మార్పులు తెస్తామని, భూ రికార్డులను సమగ్ర సర్వే చేసి అక్రమాలకు తావు లేకుండా ప్రక్షాళన చేస్తామన్నారు. కనీవినీ ఎరుగని విధంగా మీ జీవితాల్లో మార్పు తీసుకువస్తామన్నారు. ఎన్నికలు జరిగే సమయం వరకు డ్వాక్రా మహిళల రుణాలను పూర్తిగా రద్దు చేయడంతోపాటు వడ్డీ లేని రుణాలను అందిస్తామని హామీ ఇచ్చారు. జిత్తులమారి నక్క అయిన చంద్రబాబుతో పోరాటం చేస్తున్నామన్నారు. అవినీతి డబ్బుతో ప్రజలను ప్రలోభాలకు గురిచేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. ఓటు కోసం చంద్రబాబు ఇచ్చే మూడువేల రూపాయలకు మోసపోవద్దన్నారు. రాజన్న రాజ్యం వచ్చాక ప్రతీ విద్యార్థి చదువుకునేందుకు తల్లిదండ్రులకు ఏడాదికి 15 వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 45 నుండి 65 సంవత్సరాలలోపు మహిళలకు 75 వేల రూపాయలు ఇస్తామన్నారు. ప్రతీ రైతుకు పెట్టుబడి నిమిత్తం ఏడాదికి 12,500 రూపాయలు అందజేస్తామన్నారు. తాను హామీ ఇచ్చినందునే పెన్షన్‌ను రెండువేల రూపాయలకు పెంచారన్నారు. నవరత్నాలతో మన అందరి జీవితాలు బాగు పడతాయన్నారు. ధర్మానికి- అధర్మానికి, విశ్వసనీయతకు-వంచనకు మధ్య జరుగుతున్న ఎన్నికల కురుక్షేత్రంలో మీ అందరి దీవెనలు అందించాలని జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైసీపీ అభ్యర్థులైన అనకాపల్లి ఎంపీ అభ్యర్థి డాక్టర్ సత్యవతి, నర్సీపట్నం అసెంబ్లీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్‌లను గెలిపించాలని కోరారు. ఈసభలో నియోజకవర్గం సమన్వయకర్త గణేష్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్, యలమంచిలి, పాయకరావుపేట అభ్యర్థులు కన్నబాబురాజు, గొల్లబాబూరావు, మాజీ ఎమ్మెల్సీ డీవీఎస్‌రాజు పాల్గొన్నారు.

చిత్రం..నర్సీపట్నం సభకు హాజరైన అశేష జనసందోహం మధ్య వైసీపీ అధినేత జగన్