రాష్ట్రీయం

పవర్ పాలిటిక్స్‌కు దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మార్చి 17: ‘‘అధికార రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా.. ఇక ఏ రాజకీయమైనా కేవలం గ్రేటర్ రాయలసీమ కోసమే’’ అని మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయవేత్త డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి సంచలన ప్రకటన చేశారు. గ్రేటర్ రాయలసీమ ప్రాంతానికి చెందిన 6 జిల్లాల నేతలు, ప్రజలతో త్వరలో ఒక మహాసభ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు. కడప నగరంలోని ఓ ఫంక్షన్ హాలులో ఆదివారం రాయలసీమలోని 4 జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి వచ్చిన ప్రజాసంఘాలు, నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత మైసూరా పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. తాను అధికార క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయకుండా, అభివృద్ధినంతటినీ అమరావతిలోనే కేంద్రీకరిస్తూ ఈ 6 జిల్లాలకు ప్రభుత్వం, ప్రతిపక్షం అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో కొంత సాధించినా, రాష్ట్ర విభజన తర్వాత తిరిగి ఈప్రాంతం పరిస్థితి మళ్లీ మొదటికొచ్చిందన్నారు. ఈ వేదన ఈ 6 జిల్లాల్లోనూ ఉందని, ఈక్రమంలో కొందరు సంఘాలుగా ఏర్పడి ప్రభుత్వానికి, ప్రతిపక్ష నేతకు పలుమార్లు విజ్ఞప్తులు కూడా చేశారని గుర్తు చేశారు. తాము కూడా రాయలసీమ సమస్యలపై ఒక సమగ్ర నివేదికతో అధికార, ప్రతిపక్ష పార్టీలకు లేఖలు రాశామని, ఈ సమస్యలను వారి వారి మేనిఫెస్టోల్లో పెట్టి ఈ ప్రాంతానికి ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేసినా ఇంతవరకూ ఆ పార్టీలు స్పందించలేదన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఇక రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల సమస్యలపై ఉద్యమం ఆగదని మైసూరా స్పష్టం చేశారు. ఎన్నికల అనంతరం గ్రేటర్ రాయలసీమ ప్రాంత సమస్యలపై ఆసక్తి, ఆత్రుత, అనుబంధం ఉన్న నాయకులను సమన్వయపరిచి, ప్రజల భాగస్వామ్యంతో ఒక మహాసభ నిర్వహిస్తామని, అందుకు సంబంధించిన కసరత్తు కూడా జరుగుతోందన్నారు. అధికారమే ధ్యేయంగా పని చేస్తున్న రాజకీయ పార్టీలకు అతీతంగా ఉద్యమం నిర్మించాలనే దృఢమైన సంకల్పంతోనే తాను క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే శివరామకృష్ణారావు, రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు దశరథరామిరెడ్డి మాట్లాడుతూ తాము నిర్వహించబోయే మహాసభలో ప్రజలు కోరుకుంటే రాయలసీమ సమస్యలపై పోరాడే పార్టీని ప్రకటిస్తామన్నారు. సమావేశంలో విశ్రాంత డీజీపీ సి.ఆంజనేయరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మదన్‌మోహన్‌రెడ్డి, జగదీష్, మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నాగార్జునరెడ్డి కుమారుడు డా. గౌతమ్‌రెడ్డి, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్‌రెడ్డి, జేఎన్‌టీయూ ప్రొఫెసర్ మాధవి, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..కడప రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న ఎంవీ మైసూరారెడ్డి