రాష్ట్రీయం

కేసీఆర్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యే వనమా భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు ఆదివారం గజ్వేల్ సమీపంలోని ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. టీఆర్‌ఎస్ పార్టీలో చేరడానికి వనమా సంసిద్ధతను వ్యక్తం చేశారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మళ్లీ పోటీ చేయడానికి కూడా సిద్ధమేనని ఆయన ప్రకటించారు. వనమా చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. మూడు రోజుల కిందట హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుతో వనమా భేటీ అయిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్‌లో చేరికకు ఆ రోజుననే వనమా ఆసక్తి కనబర్చారు. ఇదే విషయాన్ని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను స్వయంగా కలిసి వెల్లడించనున్నట్టు వనమా అప్పట్లోనే ప్రకటించారు. ఈ మేరకు ఫామ్‌హౌస్‌లో ఉన్న సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లి వనమా తన అభిమతాన్ని వ్యక్తం చేశారు. సీఎంతో భేటీ అనంతరం వనమా మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం, అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రణాళికాబద్ధంగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా జిల్లాను సస్యశ్యామలం చేయడానికి సీతారామా ఎత్తిపోతల ప్రాజెక్టును శరవేగంగా నిర్మిస్తున్నారు. దీంతో ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లోని పది లక్షల ఎకరాలకు పుష్కలంగా సాగునీరు అందుతుంది. ఎంతోకాలంగా ఉన్న కొత్తగూడెం జిల్లా ఏర్పాటు డిమాండ్‌ను సీఎం కేసీఆర్ సాకారం చేశారు. మంచినీటి సమస్య, కొత్త రహదారుల నిర్మాణం కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. కేసీఆర్ నాయకత్వాన్ని ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజలు ముక్తకంఠంగా బలపరిచారు. అత్యధిక మెజారిటీతో గెలిపించి రెండోసారి కూడా అధికారం అప్పగించారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవడం నా విధిగా భావిస్తున్నాను. కొత్తగూడెం నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధి నాకు ముఖ్యం. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కేసీఆర్‌పై ఉన్న విశ్వాసంతో, ఆయన నాయకత్వానికి మద్దతు పలుకుతున్నాను. నియోజకవర్గ ప్రజలను, కార్యకర్తలను, అభిమానులను, శ్రేయోభిలాషులను సంప్రదించిన తర్వాత, టీఆర్‌ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాను. అవసరమైతే కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, త్వరలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతాను’ అని వనమా తన ప్రకటనలో పేర్కొన్నారు.