రాష్ట్రీయం

పోలవరం అవినీతిమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, మార్చి 19: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అవినీతిమయంగా మారిందని, కేంద్రం ప్రాజెక్టు నిర్మిస్తామంటే రాష్ట్రం పరిధిలోకి తెచ్చుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్మాణాన్ని అవినీతి మయం చేశారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రాజెక్టు పూర్తికాక ముందే బీటలు వారుతోందని, ఇంతకన్నా దారుణమైన నాణ్యత చంద్రబాబు పాలనలో మినహా ప్రపంచంలో ఎక్కడా ఉండదని ఎద్దేవాచేశారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలోని కొయ్యలగూడెంలో మంగళవారం జరిగిన వైసీపీ ఎన్నికల ప్రచార భేరి బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో దోపిడీ మితిమీరిపోయిందని, రేట్లు ఇష్టానుసారం పెంచేసుకుని, నామినేషన్ల పద్ధతిలో పనులు కట్టబెట్టారన్నారు. చంద్రబాబు క్యాబినెట్‌లో ఉన్న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సబ్-కాంట్రాక్టర్ కావడాన్ని అందరూ గమనించాలన్నారు. 2017 నాటికి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నప్పటికీ లంచాలమయం చేసి నత్తనడకన పనులు సాగిస్తోందని విమర్శించారు. ఒక రోజు డయాఫ్రమ్ వాల్ అని, ఇంకోరోజు స్పిల్‌వే గ్యాలరీ పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు రిబ్బన్ కట్ చేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్ట్ పునాది గోడల వద్ద పెట్టే గేట్లకు సంబంధించి 48 గేట్లకు మూడు గేట్లను పెట్టి టెంకాయ కొట్టేశారని ఎద్దేవా చేశారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం అమలుచేస్తామని జగన్ హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు కోసం 2006, 2007 ప్రాంతంలో ఎకరా రూ.లక్ష నుండి రూ.1.5 లక్షలకు భూములు త్యాగం చేసిన ప్రతి రైతన్నకు అదనంగా ఎకరానికి మరో రూ.ఐదు లక్షలు ఇస్తామని హామీయిచ్చారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజిలో ఇచ్చిన రూ.6.5 లక్షలు సరిపోవడం లేదని నిర్వాసితులు బాధ పడుతున్నారని, వారికి రూ.10 లక్షలు పరిహారం ఇప్పిస్తానని హామీయిచ్చారు. ప్రజలకు లంచాలు లేని సంక్షేమ పాలన అందిస్తానని జగన్ హామీయిచ్చారు. గ్రామాల్లో ఎన్నికైన సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులను పక్కనపెట్టి జన్మభూమి కమిటీల పేరుతో సంక్షేమ పథకాలను అవినీతిమయం చేశారని విమర్శించారు. మరుగుదొడ్లకు రూ.18వేలు, ఇంటి మంజూరుకు రూ.15వేలు, చంద్రన్న బీమాకు రూ.20 వేలు, ప్రమాద బీమాకు రూ.ఐదు వేలు, కొత్త పింఛను కావాలంటే లంచం, డెత్ సర్ట్ఫికెట్‌కు లంచం, బర్త్ సర్ట్ఫికెట్‌కు లంచం, ప్రతి నెల పెన్షన్ తీసుకోవాలంటే లంచం, రేషన్ కార్డు దరఖాస్తుకు లంచం ఇలా లంచాల పాలనలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో విన్నానని జగన్ చెప్పారు. ప్రజలకు లంచాలు లేని సంక్షేమ పాలన అందిస్తానని హామీ ఇచ్చారు.
డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, అధికారంలోకి రాగానే 2014లో ఇదే కొయ్యలగూడెం వచ్చి మహిళలతో శాలువాలు కప్పించుకున్నారని, తరువాత మాఫీ చేయక పోవడంతో 14,200 కోట్లు ఉన్న డ్వాక్రా అక్కచెల్లెళ్ళ రుణాలు తడిసి మోపెడై నేడు 25,500 కోట్లకు చేరాయని జగన్ అన్నారు. ఇప్పుడు ఎన్నికలు రావడంతో చివరి మూడునెలల్లో ఓట్ల కొనుగోలుకు లంచంగా చంద్రబాబు రూ.10వేలు చెక్కులు ఇచ్చారని విమర్శించారు. చెక్కులు ఇచ్చిన సొమ్మంతా చూస్తే రూ.ఆరు వేల కోట్లు దాటలేదన్నారు.
సకాలంలో పెట్టుబడులు దొరక్క నష్టపోతున్న రైతులకు మే నెల వచ్చేసరికి రూ.12,500 పెట్టుబడి సాయం అందిస్తానని జగన్ హామీ ఇచ్చారు. నాలుగేళ్ళలో రైతులకు రూ.50 వేలు పెట్టుబడి సాయం అందిస్తానని చెప్పారు. రైతన్నలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని, బీమా ప్రీమియం కూడా తామే చెల్లిస్తామని, ఉచితంగా బోర్లు వేయిస్తామని, వ్యవసాయానికి పగడిపూటే 9 గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని, వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. రూ.3వేల కోట్లతో రైతన్నకు తోడుగా ఉండేందుకు ధరల స్థిరీకరణ నిధిని తీసుకువస్తామన్నారు. పామాయిల్‌కు రాష్ట్రంలో ఒక ధర, తెలంగాణలో మరొక ధర లేకుండా చూస్తామన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామన్నారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి రూ.4వేల కోట్ల సహాయ నిధి ఏర్పాటుచేస్తామన్నారు. రైతులు ప్రమాదవశాత్తు మరణించినా, ఆత్మహత్య చేసుకున్నా కుటుంబానికి రూ.7 లక్షలు ఇస్తామని, మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ మేరకు చట్టాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు ఎన్నికల్లో చేయని జిమ్మిక్కులు ఉండవని, చేయని డ్రామాలు ఉండవని, ఆడని అబద్ధం ఉండదని, చేయని మోసం ఉండదని జగన్ అన్నారు. అక్కచెల్లెళ్ళు చేతిలో పెట్టే రూ.3వేలకు మోసపోవద్దని చెప్పాలని వైసీపీ కార్యకర్తలను కోరారు. ఫ్యాన్‌గుర్తుకు ఓటు వేసి పోలవరం అసెంబ్లీ అభ్యర్థి తెల్లం బాలరాజు, ఏలూరు లోక్‌సభ అభ్యర్థి కోటగిరి శ్రీ్ధర్‌ను గెలిపించాలని జగన్ కోరారు. ఈ సభలో లోక్‌సభ అభ్యర్థులు కోటగిరి శ్రీ్ధర్ (ఏలూరు), రఘురామకృష్ణంరాజు(నరసాపురం), చింతలపూడి అభ్యర్థి విఆర్ ఎలీజా, గూడెం అభ్యర్థి కొట్టు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మండవల్లి విజయసారథి, స్థానిక నేతలు పాల్గొన్నారు.

చిత్రం.. కొయ్యలగూడెంలో మంగళవారం ఎన్నికల ప్రచార సభలో సమరశంఖం పూరిస్తున్న జగన్