రాష్ట్రీయం

దీవిస్తే.. దేశానికి మార్గదర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మార్చి 19: తెలంగాణ ప్రజలు నిండుగా దీవెనలు అందించి పార్లమెంటు ఎన్నికల్లో 16స్థానాల్లో గెలిపిస్తే, దేశానికి మార్గదర్శనం చేస్తానని టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్, భాజపాయేతర పార్టీల పాలనతోనే దేశం ప్రగతిపథంలో పయనిస్తుందని, ఈ దిశగా ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై విరుచుకుపడ్డారు. టీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలను వివరిస్తూనే, గడిచిన 70ఏళ్లలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల పాలనలో దేశం అధోగతిపాలైందని ఆక్షేపించారు. ప్రజలకు సుపరిపాలన అందించాల్సిన బాధ్యతను విస్మరిస్తూ రెండు పార్టీలూ స్వార్ధ ప్రయోజనాల కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఆ పార్టీల అసమర్ధతను ఎండగడుతూ అభివృద్ధి గురించి ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్, బీజేపీల పీఠాలు కదులుతున్నాయని, దీనిని జీర్ణించుకోలేక తనపై ఇరుపార్టీల నాయకులు ఒంటి కాలిపై లేస్తున్నారని, తనను చంపుతామన్నా భయపడేది లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. చెప్పుకోదగ్గ వనరులు లేని సింగపూర్ వంటి దేశాలు అనతికాలంలోనే అనూహ్య రీతిలో అభివృద్ధిని సంతరించుకుంటుంటే, అన్ని వనరులు ఉన్న మన దేశం మాత్రం పాలనా వైఫల్యాల కారణంగా వెనుకంజలోనే ఉండిపోతోందని ఆవేదన వెలిబుచ్చారు. రిజర్వ్ బ్యాంక్ దగ్గర 25లక్షల కోట్ల రూపాయలు మూలనపడి మూలుగుతున్నాయని, ఇది పాలకుల వైఫల్యం కాదా? అని ప్రశ్నించారు. దేశం బాగుపడాలంటే సరికొత్త కొత్త ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కొత్త ఆర్థిక విధానం రావాలని, నూతన వ్యవసాయ పాలసీని రూపొందించాల్సిన ఆవశ్యకత ఉందని, రైతుల్లో, పేదల్లో ఆశాంతి తొలగిపోవాలని, గిట్టుబాటు ధరలు అందాల్సి ఉందని, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు దేశమంతా అమలు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశాన్ని క్రాప్ కాలనీల కింద విభజన చేయాలని, నూతన ఆర్థిక సంస్కరణలు తేవాలని, దేశ ఆర్థిక పరపతి పెరగాలని, రాజ్యాంగంలో ప్రబలమైన మార్పులు రావాలని, న్యాయ పరిపాలనలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతూ, ఇది జరగనన్ని రోజులు దేశం ఇలాగే కునారిల్లిపోతూనే ఉంటుందని అన్నారు. పై అంశాల గురించి ఎన్నడూ ఆలోచనలు చేయకుండా నరేంద్ర మోడీ, రాహుల్‌గాంధీలు పరస్పరం చిల్లర విమర్శలు చేసుకుంటూ రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. దేశ జనాభాలో యాభై శాతానికి పైగా ఉన్న బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరితే కాంగ్రెస్, బీజేపీలు పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. ఈ విషయమై తాను స్వయంగా బీసీ సంక్షేమ సంఘం నాయకుడు ఆర్.కృష్ణయ్యను వెంటబెట్టుకుని యూపీఏ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలిసి కోరానని, ప్రస్తుత ప్రధాని మోడీని కోరినప్పటికీ స్పందన కరువైందని విమర్శించారు. ఓట్ల రాజకీయం చేస్తున్న బీజేపీది ముమ్మాటికీ రాజకీయ హిందుత్వమేనని ఆయన ఆరోపిస్తూ, తమదే నిజమైన హిందుత్వమని స్పష్టం చేశారు. రామ జన్మభూమి, రావణ జన్మభూమి అంటూ పంచాయతీలు చేయాల్సింది రాజకీయ పార్టీలు కాదని, ఏ జన్మభూమి ఎవరిదో నిర్ణయించాల్సింది పీఠాధిపతులు, ధర్మ ప్రచారకర్తలు, మఠాథిపతులు, మతపెద్దలని పేర్కొన్నారు. ‘నువ్వు హిందువు అయితే రామ జన్మభూమి మీద నీ వైఖరి ఏమిటి’ అని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తనను అడిగారంటూ కేసీఆర్‌పై వ్యాఖ్యలు చేశారు. అసలు బీజేపీ ప్రజల కోసం పని చేసే పార్టీయా? లేకపోతే మత ప్రచారం కోసం పని చేసే పార్టీయా? అన్నది ముందుగా లక్ష్మణ్ తన వైఖరిని వెల్లడించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. మతపరమైన పంచాయతీల్లో తలదూర్చడం రాజకీయ పార్టీల పని ఎంతమాత్రం కాదని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం, వారికి లబ్ధి చేకూర్చే కార్యక్రమాలను అమలు చేయడమే రాజకీయ పార్టీల ప్రధాన కర్తవ్యమని హితబోధ చేశారు. పనికిమాలిన సిద్ధాంతాలు చెబుతూ, రామ జన్మభూమి పేరుతో పంచాయతీలు తెంపడం ప్రధానుల పని కాదని చురకలంటించారు. ఒకవేళ ఇరువర్గాలకు సంబంధించిన వివాదం ఏదైనా ఉంటే, ఆ అంశాలపై న్యాయ వ్యవస్థలు సముచిత తీర్పును వెలువరిస్తాయని, రాజకీయ పార్టీల జోక్యం అవసరం లేదన్నారు. ఇతర మతాలను తిట్టేవాడే హిందువు అనే పద్ధతిలో బీజేపీ వైఖరి ఉంటుందని, కానీ అందరినీ గౌరవించాలనేదే హిందు మతమని కేసీఆర్ పేర్కొన్నారు. సమస్త లోకంలో ఉండే అన్ని వర్గాల మనుషులే కాదు. సమస్త జీవరాశి కూడా బాగుండాలని యాగం, పూజల్లో చివరగా కోరుకుంటామని గుర్తు చేశారు. ప్రజలు కాంగ్రెస్, బీజేపీ పార్టీల వైఫల్యాలను గుర్తించి ఫెడరల్ ఫ్రంట్‌ను అధికారంలోకి తేవాలని కేసీఆర్ కోరారు. బహిరంగ సభలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎం.పీలు కవిత, బీబీ.పాటిల్, తెరాస నాయకులు కే.కేశవరావు, కేఆర్.సురేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. నిజామాబాద్ బహిరంగ సభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్