రాష్ట్రీయం

అబద్ధం, మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు/కావలి, మార్చి 20: రోజుకో అబద్ధం, పూటకో మోసం చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నైజమని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. నెల్లూరు జిల్లా కావలిలో బుధవారం ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారసభలో ఆయన ప్రసంగించారు. గత 2014 ఎన్నికల సమయంలో 50 పేజీల మేనిఫెస్టో, 350 హామీలను చంద్రబాబు ఇచ్చారని, వాటిల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆరోపించారు. వాటిని అమలు చేసేవాడిలా తన ఫొటో వేసి, సంతకాలు పెట్టిన కరపత్రాలను ఇంటింటికీ అప్పట్లో పంచారని గుర్తు చేశారు. గెలిచిన తర్వాత వాటి అమలు ఊసేలేదని మండిపడ్డారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను ఈ సందర్భంగా జగన్ ప్రస్తావించారు. ఎన్నికల్లో మేనిఫెస్టో విడుదల చేశాక గెలిచిన తర్వాత వాటిని అమలు చేస్తే ప్రజల్లో మంచి పేరు వస్తుందని, అమలు చేశాం కాబట్టి ఓట్లేయండి అని ప్రజలను అడిగే అర్హత వస్తుందన్నారు. ‘చేతకాని వాడికి కోపమెక్కువ, పనిచేయలేని వాడికి ఆకలెక్కువ’ అన్నట్టుగా ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. అభ్యర్థులు దొరకక, విడతల వారీగా జాబితాలు విడుదల చేస్తున్నారని, ఎవరో అభ్యర్థులను బెదిరిస్తున్నారంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ పరిపాలన చూసి ఓట్లేయండి అని ఎందుకు ప్రజలను చంద్రబాబు అడగలేకపోతున్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. తండ్రీ కొడుకులిద్దరూ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఆరోపించారు. ధర్మం, అధర్మం మధ్య యుద్ధం జరుగుతోందని జగన్ విశే్లషించారు. ఈ అన్యాయపు పాలన చూసి ఆ పార్టీలో చేరేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఏం చెప్పాడు.. ఈ ఐదేళ్లు ప్రజలకు ఏమిచేశాడో అందరికీ తెలుసునని, అందుకే ఈ ఎన్నికల్లో ఆయన పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. చంద్రబాబు అధికారం చేపట్టే నాటికి వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్లు ఉన్నాయని, అవి ఇపుడు అక్షరాలా రూ.1.30 లక్షల కోట్లకు చేరుకున్నాయని వివరించారు. వ్యవసాయానికి పగలు 9 గంటల విద్యుత్ సరఫరా ఎక్కడా జరగడం లేదన్నారు. జాబు కావాలంటే బాబు రావాలని ప్రచారం చేశారని, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. పేదవారికి పక్కా ఇల్లు, మూడు సెంట్లు స్థలం ఇస్తానన్నారని, ఎక్కడైనా ఇచ్చారా అని ప్రజలను ఉద్దేశించి అడిగారు. మళ్లీ మరోసారి మేనిఫెస్టో పేరుతో ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం యత్నించిన చంద్రబాబు, అందుకు వారు ఒప్పుకోకపోవడంతో ఇపుడు ఆ పార్టీతో తాము కలిసిపోయామని, టీడీపీ మాత్రమే
పోరాడుతోందంటూ మోసపు మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఒక్కో ఓటును రూ.3వేలు పెట్టి కొనుక్కునేందుకు టీడీపీ సిద్ధమవుతోందని, ఈ విషయం గ్రామాల్లో ప్రతిఒక్కరికీ వివరించాలని కార్యకర్తలకు సూచించారు. చంద్రబాబు ఇచ్చే రూ.3వేలకు మోసపోవద్దని, 20 రోజులు గడిస్తే తాను సీఎం అవుతానన్న విషయం కార్యకర్తలే ప్రజలకు తెలియచెప్పాలని కోరారు. పింఛన్‌దారులు, డ్వాక్రా మహిళలకు వైసీపీ గెలిస్తే చేపట్టే సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించాలని పిలుపునిచ్చారు. సాగు సహాయం కింద ప్రతి ఏటా రైతులకు మే నెలలో రూ.12,500 వంతున నాలుగేళ్ల పాటు అందిస్తామని స్పష్టం చేశారు. పింఛన్ మొత్తాన్ని రూ.2వేల నుండి రూ.3వేల వరకూ పెంచుకుంటూ వెళ్తామని హామీనిచ్చారు. వైఎస్‌ఆర్ కంటే కూడా ఇంకా మంచి పాలన అందిస్తామని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా కావలి అసెంబ్లీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డిలను గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
చిత్రం.. నెల్లూరు జిల్లా కావలి సభలో ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యాలని అభ్యర్ధిస్తున్న వైకాపా అధినేత జగన్