రాష్ట్రీయం

వారొస్తే అరాచకమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాలూరు, మార్చి 21: వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అరాచక పాలనతో పాటు అంధకారమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. గురువారం విజయనగరం జిల్లా సాలూరులో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ జగన్, కేసీఆర్, మోదీని తూర్పారబట్టారు. హైదరాబాద్‌ను ఎంతో ఘనంగా అభివృద్ధి చేశానని, వందలాది కంపెనీలను తీసుకొచ్చానన్నారు. విభజన తరువాత కట్టుబట్టలతో ఏపీకి వచ్చామన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతో శ్రమించానన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఒక్క టీడీపీకే ఉందన్నారు. 200 రూపాయల పింఛన్‌ను వెయ్యి రూపాయలకు, తరువాత 2వేల రూపాయలకు పెంచానన్నారు. పేద వృద్ధులకు పెద్ద కొడుకుగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేశానన్నారు. 98లక్షల మంది ఆడ పడుచులకు పసుపుకుంకుమ నిధులు అందించానన్నారు. మరుగుదొడ్లు, వంట గ్యాస్ మంజూరు చేశామన్నారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా తక్కువ ఖర్చుతో కేబుల్ సౌకర్యం కల్పించామన్నారు. ఇంటికో స్మార్ట్ ఫోన్ అందించామన్నారు. తాను రైతు అయినందున వారికోసం అన్నదాత సుఖీభవ అందించానన్నారు. కేంద్రం ఆరు వేల రూపాయలు ఇస్తే తాను తొమ్మిది వేల రూపాయలు పంపిణీ చేశానన్నారు. కౌలురైతులకు సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్నానన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి తానే అంబాసిడర్‌ని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూములను తీసుకువచ్చానని అన్నారు. మధ్యాహ్న భోజన పథకం, నిరుద్యోగ యువతకు ఏప్రిల్ 1 నుంచి 2వేల రూపాయల భృతి పంపిణీ చేస్తున్నానన్నారు. తనను చూస్తే పారిశ్రామికవేత్తలు పరిగెత్తివస్తారని, జగన్‌ను చూస్తే పారిపోతారన్నారు. జగన్ జైలుకెళ్తాడన్న భయం పారిశ్రామికవేత్తలకు ఏర్పడిందన్నారు. గిరిజనుల కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నానన్నారు. ఏజెన్సీలో ఫీడర్ అంబులెన్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నామన్నారు. ఎస్టీలకు మేలు చేసే పార్టీ టీడీపీ ఒక్కటేనన్నారు.
తమ 60 ఏళ్ల కష్టార్జితాన్ని కేసీఆర్ తీసుకున్నారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఇస్తానన్న మోదీ మోసం చేశారన్నారు. విభజన హామీలను అమలుచేయాలని పోరాడుతుంటే సీబీఐ, ఐటీ దాడులు చేయిస్తున్నారన్నారు. కేసీఆర్ ఆంధ్ర ఆస్తులను కొట్టేసి ఆనందంగా కులుకుతున్నాడని ధ్వజమెత్తారు. వైసీపీతో కలిసి తనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటున్నాడు. కోడికత్తి పార్టీతో కలిసి కేసీఆర్, మోదీ డ్రామాలాడుతున్నారన్నారు. జగన్ సొంత చిన్నాన్న ఇంట్లో ఆయన హత్య జరిగితే డ్రామాగా మార్చారన్నారు. సొంత చిన్నాన్ననే అన్యాయంగా చంపివేసి ఎవరో చంపివేశారని నాటకాలాడుతున్నారన్నారు. జగన్ జీవితమంతా కేసులేనన్నారు. జగన్‌కు కేసీఆర్ వెయ్యి కోట్లు ఇచ్చారన్నారు. అధికారంలో ఉన్నా టీడీపీ దగ్గర డబ్బులు లేవన్నారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులను ఆ డబ్బులతో కొనుగోలు చేస్తున్నారన్నారు. హైదరాబాద్‌లో ఆస్తులున్న నాయకులను కేసీఆర్ బెదిరిస్తున్నారన్నారు. కేసీఆర్‌కు బానిసగా బతకాల్సిన అవసరం లేదన్నారు. పరిపాలన అంటే తెలియని జగన్ అధికారానికి అనర్హుడన్నారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ మీటింగ్ పెట్టి రాష్ట్రానికి 75వేల కోట్లు కేంద్రం ఇవ్వాలని తేల్చారన్నారు. ఈ మధ్య కాలంలో ఆయన కూడా నోరు మెదపడం లేదన్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరారన్నారు. దొంగ ఒక పార్టీ నాయకుడైతే ఆ దొంగను పట్టుకున్న పోలీస్ అధికారి ఇంకో పార్టీలో చేరారన్నారు. జగన్‌పై కేసు ఎందుకు పెట్టారో లక్ష్మీనారాయణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్‌కు ఓటు వేస్తే ఢిల్లీలో కేసీఆర్ పెత్తనం చేయాలని చూస్తున్నారన్నారన్నారు. ఏపీని అణగదొక్కాలని కేసీఆర్ చూస్తున్నారన్నారు. మోడీ, కేసీఆర్‌లపై పోరాటానికి యువకులు సిద్ధం కావాలన్నారు.
ఈ సమావేశానికి నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. అంతకు ముందు ఇక్కడి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో హెలికాప్టర్‌లో దిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు రోడ్డు మార్గాన బహిరంగ సభ జరిగే తహశీల్దార్ కార్యాలయం కూడలి వద్దకు వచ్చారు. అరకులోయ లోక్‌సభ అభ్యర్థి కిషోర్ చంద్రదేవ్, స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్పీ భంజ్‌దేవ్, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి సీఎంకు ఘన స్వాగతం పలికారు.
చిత్రాలు.. విజయనగరం జిల్లా సాలూరులో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు