రాష్ట్రీయం

అబద్ధాలకోరు బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, మార్చి 24: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అధికారం పోతోందనే భయం పట్టుకొని గంటకో అబద్ధం చెబుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి విమర్శించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా ఆయన అమలు చేయలేదన్నారు. ఎన్నికల వేళ చంద్రబాబు పిట్టలదొర మాదిరిగా అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో వైకాపాకు పూర్తి మద్దతిచ్చి చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే తాము మద్దతిస్తామని కృష్ణా జిల్లా తిరువూరులో ఆదివారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో జగన్ వెల్లడించారు.
గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయకుండా చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని తిరిగి ఓట్లు అడుగుతున్నామని జగన్ ప్రశ్నించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి చంద్రబాబు పాలనకు చరమగీతం పాడాలని కోరారు. చంద్రబాబు పాలన అంతా అవినీతిమయమని, పేదలకు సంక్షేమ పథకాల అమలుకూ లంచం తీసుకుంటున్నారని ఆరోపించారు. గ్రామాల్లో ఎన్నికైన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను పక్కనపెట్టి జన్మభూమి కమిటీల పేరుతో సంక్షేమ పథకాలను అవినీతిమయం చేశారని విమర్శించారు. పేదలకు అందజేసే సహాయంలో లంచం తీసుకోవటం టీడీపీ నేతలకే చెల్లిందన్నారు. నేడు ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్నాయని, ఇందులో నైతికత, అనైతికత మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు విజ్ఞతతో గుర్తించి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు. గతంలో బాబు వస్తే జాబు వస్తుందని విస్తృతంగా ప్రచారం చేసి ఓట్లు దండుకున్నారని, నేడు బాబు పోతే జాబు వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. రాష్ట్రంలో 2.30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేయకుండా టీడీపీ ప్రభుత్వం తాత్సారం చేసిందన్నారు. వైకాపా అధికారంలోకి రాగానే వీటిని భర్తీ చేస్తామని జగన్ ప్రకటించారు. మెట్ట ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటంతో పాటు స్థానికులకు 75శాతం ఉద్యోగాలు ఇచ్చేలా చట్టం తెస్తామని తెలిపారు. పారిశ్రామిక రంగానికి ఏమాత్రం నష్టం జరగకుండా జిల్లా కేంద్రంగా స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేసి యువతకు వృత్తినైపుణ్య శిక్షణ ఇస్తామని, వారికి పెద్దపీట వేస్తామని చెప్పారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చి ఉపాధికి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ సీట్లలో వైకాపా ఘన విజయం సాధిస్తుందని జగన్ ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో గ్రామాలకు డబ్బుల మూటలు పంపుతున్నారని, ఓటుకు 3వేల నుండి 5వేల రూపాయల వరకు ఇచ్చి కొనాలని రంగం సిద్ధం చేశారని ఆరోపించారు. ప్రతిఒక్కరూ జరుగుతున్న దుర్మార్గాన్ని గుర్తించి, నీతిమంతమైన పాలన కోసం వైకాపాను గెలిపించాలని కోరారు. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్, తిరువూరు అభ్యర్థి కొక్కిలిగడ్డ రక్షణనిధిని ప్రజలకు పరిచయం చేసి, వారి విజయానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. నూజివీడు అభ్యర్థి మేకా వెంకటప్రతాప్ అప్పారావు తదితర నాయకులు పాల్గొన్నారు.
చిత్రం.. తిరువూరు ప్రచార సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి