రాష్ట్రీయం

నిజామాబాద్ @ 245

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్: నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ స్థానానికి బ్యాలెట్ పద్ధతిన ఎన్నికలు అనివార్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో యావత్ దేశం దృష్టిని ఆకర్షించేలా ఈ లోక్‌సభ స్థానం నుండి 245 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటి వరకు కూడా వీరంతా బరిలో మిగిలితే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు బదులుగా బ్యాలెట్ విధానం ద్వారా ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. 96మంది అభ్యర్థుల కంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే బ్యాలెట్ పద్ధతిన ఎన్నికలు జరుపుతామని ఇప్పటికే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్ స్పష్టం చేశారు. ఈ పరిణామం ప్రధాన పార్టీల అభ్యర్థులను ఒకింత కలవరపాటుకు గురి చేస్తోంది. మరోవైపు బ్యాలెట్ విధానం ద్వారా ఎన్నికల ఏర్పాట్లను చక్కబెట్టడం అధికార యంత్రాంగానికి కూడా సవాల్‌గా మారనుంది. బ్యాలెట్ బాక్సులు, ఇతరత్రా సరంజామాను సిద్ధం చేస్తూ, ఎన్నికల నిర్వహణకు పెద్ద సంఖ్యలో సిబ్బందిని సమాయత్తం చేయడం తలకుమించిన భారంగా పరిణమించనుంది.
రికార్డు స్థాయి మెజార్టీని సాధించాలని ఉవ్విళ్లూరుతున్న అధికార టీఆర్‌ఎస్ పార్టీ నేతలకూ రైతుల నిర్ణయం శరాఘాతంగా నిలుస్తోంది. దీంతో మూకుమ్మడిగా నామినేషన్లు దాఖలు చేసిన పసుపు, ఎర్రజొన్న రైతులను బరి నుండి తప్పించేందుకు అధికార టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు శక్తివంచన లేకుండా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే ఎన్నికల ప్రచార సభకు ఇటీవలే హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం స్వయంగా ప్రస్తావిస్తూ, ఎర్రజొన్న, పసుపు రైతుల సమస్యలను తప్పనిసరిగా పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.
అయినప్పటికీ రైతులు నామినేషన్లు దాఖలు చేయడంతో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ స్పీకర్ కేఆర్.సురేష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, విద్యాసాగర్‌రావు, సంజయ్ తదితరులంతా రైతులను, రైతు సంఘాల బాధ్యులకు నచ్చజెప్పే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. ఇదివరకు ఎర్రజొన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే 10.50 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించిందని, ఎర్రజొన్న పంటను మార్క్‌ఫెడ్ ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేసిందని గుర్తు చేస్తున్నారు. పసుపు బోర్డు కోసం పార్లమెంటు వేదికగా టీఆర్‌ఎస్ ఎంపీలంతా అలుపెరుగని పోరాటం చేస్తున్నారని రైతులను సముదాయించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ రైతులు మాత్రం నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు ససేమిరా అంటున్నారు. గ్రామాభివృద్ధి కమిటీలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో చేసిన తీర్మానాలకు కట్టుబడి ఉంటామని, ఈ విషయంలో తమ వ్యక్తిగత నిర్ణయాలేవీ ఉండవని తేల్చి చెబుతున్నారు. మద్దతు ధర కోరుతూ తాము గడిచిన రెండుమూడు మాసాల నుంచి రోడ్డెక్కి ఆందోళనలు చేసినప్పటికీ పట్టించుకోని ప్రభుత్వం, ప్రస్తుతం ఎన్నికలు ముగిసిన వెంటనే న్యాయం చేస్తామని చెబితే ఎలా విశ్వసించాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. వారి ఆక్రోశాన్ని గమనిస్తే, ఎన్నికల బరిలో నిలువాలనే పట్టుదలనే ప్రదర్శిస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. ఇదే జరిగితే బ్యాలెట్ పోరు ద్వారా కొనసాగే నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం ఎన్నిక ప్రక్రియ దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించనుంది. కనీసం ఇలాగైనా తమ సమస్యల తీవ్రత గురించి దేశ ప్రజలందరికీ తెలుస్తుందని, అప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వాటి పరిష్కారానికి చర్యలు చేపడతాయేమోనని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
చిత్రం.. నామినేషన్ల వేసేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చిన రైతులు