రాష్ట్రీయం

జగన్ సీఎం కావడం ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: మాజీ ఎంపీ, సినీ నటుడు ఎం.మోహన్ బాబు మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. గతంలో టీడీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన మోహన్ బాబు కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. జగన్ తనకు ఏ పని అప్పగించినా నిర్వహిస్తానని ఆయన తెలిపారు. టీడీపీ మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా జగన్‌ను కలిసి పార్టీలో చేరారు. అనంతరం మోహన్‌బాబు మీడియాతో మాట్లాడుతూ తన మద్దతు కావాలని జగన్ కోరడంతో వైకాపాలో చేరానని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తనను పార్టీలోకి ఆహ్వానించినా వెళ్ళలేదని అన్నారు. తనకు పదవి కావాలనో లేదా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీటు కావాలనో జగన్‌ను అడగలేదని ఆయన తెలిపారు. జగన్ ముఖ్యమంత్రి కావాలనేది తన అభిలాష అని ఆయన చెప్పారు. వైకాపాలో చేరేందుకు ఎవరికి భయపడాలి? ఎందుకు భయపడాలి? అని ఆయన అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు జగన్ పాదయాత్ర చేయడం గొప్ప విషయమని, ప్రజల్లో జగన్‌కు లభిస్తున్న ఆదరణ, ఆకర్షణ చూస్తుంటే కచ్చితంగా సీఎం అవుతారన్న నమ్మకం కలుగుతున్నదని మోహన్‌బాబు అన్నారు. లోగడ ఎన్టీఆర్ తరహాలో జగన్ కూడా స్వీప్ చేస్తారని ఆయన తెలిపారు.
ఆస్తులు వెల్లడిద్దామా?
మట్టి, ఇసుక, భూమి దోచి భూస్వామి అయ్యాడని ఆయన చంద్రబాబుపై ధ్వజమెత్తారు. 1975 నుంచి తన సంపాదన, ఆస్తుల వివరాలు వెల్లడిస్తానని, చంద్రబాబు కూడా ఆ విధంగా ఇవ్వగలరా? అని ఆయన ప్రశ్నించారు. తనపై అనుమానం ఉంటే ఐటీ దాడులు చేయించుకోవచ్చని అన్నారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తనకు దేవుడని.. 20 ఏళ్ళ క్రితం చంద్రబాబు పక్కన వెళ్ళి తప్పు చేశానని ఆయన తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి
వైఎస్ రాజశేఖరరెడ్డి లోగడ తనను కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసేందుకు ఆహ్వానించారని, అయితే తనకు వీలుకాలేదని, అయినా వైఎస్ తప్పుగా అర్థం చేసుకోలేదని అన్నారు. లోగడ బీజేపీకి మద్దతిచ్చానని, ఉప రాష్టప్రతి ఎం. వెంకయ్య నాయుడు, గవర్నర్ విద్యాసాగర్ తనకు ఆత్మీయులని ఆయన తెలిపారు. బీజేపీకి మద్దతు ఇచ్చిన తర్వాత 18 శాతం ఓటింగ్ వచ్చిందన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఫీజు రీయంబర్స్‌మెంట్ ఇస్తానని ఇవ్వలేదని, బకాయిల కోసం తిరుపతి వద్ద విద్యార్థులతో కలిసి ఆందోళన చేశానని అన్నారు. తమ విద్యా సంస్థలకు ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు రూ.19కోట్లు రావాల్సి ఉందన్నారు. చంద్రబాబు మనుషులు తనను రెచ్చగొడితే అసలు బండారాన్ని బయట పెడతానని ఆయన ఇదివరకే హెచ్చరించారు. చంద్రబాబు చంపించగలడేమో కానీ ఇంకేమీ చేయలేరని అన్నారు. అలిపిరిలో దాడి జరిగితే ఏడ్చాను.. అది తప్పా? అని ఆయన ప్రశ్నించారు.
నవరత్నాలకు జగన్ తుది మెరుగులు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్యులతో మంతనాలు జరుపుతున్నారు. మంగళవారం లోటస్ పాండ్‌లోని తన నివాసంలో ఆయన పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై చర్చలు జరిపారు. చాంతాడంత మేనిఫెస్టో కాకుండా ఆచరణ సాధ్యమయ్యే హామీలనే ఇవ్వాలని జగన్ ఈ సమావేశంలో అన్నారు. మేనిఫెస్టోను పుస్తకంలా ముద్రించకుండా నాలుగు పేజీల్లోనే తీసుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్ లోగడ పలు పర్యాయాలు బహిరంగ సభల్లో ‘నవరత్నాలు’ (హామీలు) గురించి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవే కాకుండా ఇంకా ఏవైనా కీలకమైన హామీలు ఇవ్వాలా? అనే కోణంలో వారు పరిశీలించారు. ఒకటి, రెండు రోజుల్లో మేనిఫెస్తో విడుదల చేసే అవకాశం ఉంది.

చిత్రం.. కండువా కప్పి మోహన్‌బాబును పార్టీలోకి ఆహ్వానిస్తున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి