రాష్ట్రీయం

‘అనంత’ పోరు రసవత్తరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మార్చి 26: అనంతపురం జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. రాజకీయ ఉద్దండులు, హేమాహేమీలు, వారసులు ఎన్నికల్లో తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ, బీజేపీ, కాంగ్రెస్, జనసేన, సీపీఐ, సీపీఎం అభ్యర్థులు ఎన్నికల గోదాలోకి దిగారు. జిల్లాలో బహుముఖ పోటీ తప్పకపోయినా టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలున్నాయి. టీడీపీ, వైకాపాలో పాతకొత్తల మేలు కలయికగా అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. టీడీపీలో ఏడుగురు సిట్టింగ్‌లు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, నలుగురు కొత్తవారు పోటీ చేస్తున్నారు. కొత్త ముఖాల్లో తాడిపత్రి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే జేసీ.ప్రభాకరరెడ్డి తనయుడు జేసీ.అస్మిత్‌రెడ్డి, రాప్తాడు నుంచి దివంగత నేత పరిటాల రవీంద్ర, మంత్రి పరిటాల సునీత దంపతుల తనయుడు పరిటాల శ్రీరామ్, కళ్యాణదుర్గం నుంచి ఉమామహేశ్వరనాయుడు, శింగనమల నుంచి బండారు శ్రావణి తొలిసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. శింగనమల నుంచి తొలిసారి పోటీచేస్తున్న బండారు శ్రావణి ఒక్కరే టీడీపీ తరఫున పోటీచేస్తున్న ఏకైక మహిళా అభ్యర్థిని కావడం గమనార్హం. జేసీ.అస్మిత్‌రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు కొత్త అయినా, తాడిపత్రిలో తన తండ్రి, ఎమ్మెల్యే జేసీ.ప్రభాకరరెడ్డి వారసుడిగా, పట్టణంలో చేసిన అభివృద్ధి, టీడీపీ పథకాలను నమ్ముకుని తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బండారు శ్రావణి ఉన్నత విద్యావంతురాలైనప్పటికీ రాజకీయాలకు పూర్తిగా కొత్త. తన తండ్రి బండారు రవికి పార్టీలో మంచి పట్టు ఉండడం, ఆయనకు ఉన్న పరిచయాలు తనను గట్టెక్కిస్తాయని కొండంత ఆశగా ఉన్నారు. పరిటాల శ్రీరామ్ తన తండ్రి పరిటాల రవీంద్ర, తల్లి సునీత రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. పరిటాల అభిమానులు, అనుచరులే శ్రీరామ్‌కు కొండంత అండ. మాదినేని ఉమామహేశ్వర నాయుడు పోటీచేయడం ఇదే మొదటిసారి. దుర్గంలో పార్టీ పరంగా, రియల్టర్‌గా తనకున్న విస్తృతమైన పరియాలపై ఆశలు పెట్టుకున్నారు. అనంతపురం ఎంపీగా బరిలో ఉన్న జేసీ పవన్‌కుమార్‌రెడ్డి తన తండ్రి జేసీ దివాకర్‌రెడ్డి చరిష్మా, కుటుంబ నేపధ్యం తనకు కలసివస్తాయని భావిస్తున్నారు. ఇప్పటికే నియోజవర్గం మొత్తం సుడిగాలి పర్యటన జరిపి క్యాడర్‌ను సమీకరించారు. సిట్టింగ్‌లలో హిందూపురం నుంచి సినీనటుడు బాలకృష్ణ, రాయదుర్గం నుంచి మంత్రి కాలవ శ్రీనివాసులు, పుట్టపర్తి నుంచి చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి, గుంతకల్లులో జితేంద్రగౌడ్, పెనుకొండలో జిల్లా అధ్యక్షుడు పార్థసారథి, అనంతపురం అర్బన్ నుంచి ప్రభాకర్‌చౌదరి, ధర్మవరం నుంచి సూర్యనారాయణరెడ్డి మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కదిరి నుంచి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, మడకశిర నుంచి మాజీ ఎమ్మెల్యే ఈరన్న బరిలోకి దిగుతున్నారు. ఉరవకొండ నుంచి ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఈసారి అసెంబ్లీకి పోటీచేస్తున్నారు. అనంతపురం లోక్‌సభ స్థానం నుంచి ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తనయుడు జేసీ పవన్‌కుమార్‌రెడ్డి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. హిందూపురం లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ నిమ్మల కిష్టప్ప మళ్లీ పోటీ చేస్తున్నారు. అనుచరులు, అభిమానుల అండదండలు, టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి తమను గట్టెక్కిస్తుందని అభ్యర్థులు కొండంత ధీమాతో ఉన్నారు. తమ తండ్రుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వారసులు ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా భవిష్య రాజకీయ జీవితానికి పునాది వేసుకోవాలని చూస్తున్నారు. ఇక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఇద్దరు, మిగతా చోట్ల విశ్రాంత ఉద్యోగులు, పార్టీ సమన్వయకర్తలు, కొత్తవారు పోటీ చేస్తున్నారు. ఉరవకొండ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వై.విశే్వశ్వరరెడ్డి, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి మరోమారు అదృష్టం పరీక్షించుకుంటున్నారు. అనంతపురం అర్బన్ నుంచి మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, శింగనమల నుంచి జొన్నలగడ్డ పద్మావతి, గుంతకల్లు నుంచి వెంకట్రామిరెడ్డి, రాయదుర్గం నుంచి కాపు రామచంద్రారెడ్డి, రాప్తాడు నుంచి తోపుదుర్తి ప్రకాష్, పెనుకొండ నుంచి శంకరనారాయణ, ధర్మవరం నుంచి కేతిరెడ్డి, ధర్మవరం నుంచి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, తాడిపత్రి నుంచి పెద్దారెడ్డి, పుట్టపర్తి నుంచి దుద్దుకుంట శ్రీ్ధర్‌రెడ్డి, కదిరి నుంచి సిద్ధారెడ్డి పోటీ చేస్తున్నారు. కల్యాణదుర్గం నుంచి కొత్త అభ్యర్థి ఉషశ్రీ చరణ్, హిందూపురం నుంచి విశ్రాంత ఉద్యోగి మహమ్మద్ ఇక్బాల్ తొలిసారి ఎన్నికల గోదాలోకి దిగుతున్నారు. అనంతపురం ఎంపీ స్థానం నుంచి విశ్రాంత ఉద్యోగి పీడీ రంగయ్య, హిందూపురం నుంచి మాజీ సీఐ గోరంట్ల మాధవ్ తొలిసారి ఎన్నికల గోదాలోకి దిగుతున్నారు. విశ్రాంత ఐజీ మహ్మద్ ఇక్బాల్ ముఖ్యంగా మైనారిటీ ఓట్లపై ఆశలు పెట్టుకున్నారు. ఉషశ్రీ చరణ్ రాజకీయాలకు కొత్త. వైకాపాపై ఉన్న ప్రజాభిమానం, ప్రభుత్వ వ్యతిరేకత, స్థానిక టీడీపీ నేతల మధ్య అసమ్మతి తనను గెలిపిస్తాయన్న నమ్మకంతో ఉన్నారు. పురం లోక్‌సభకు పోటీచేస్తున్న గోరంట్ల మాధవ్ గతంలో పనిచేసిన చోట్ల పొందిన ప్రజాభిమానం, సామాజిక వర్గం సానుభూతి ఓట్లు కురిపిస్తుందని భావిస్తున్నారు. అనంత ఎంపీ బరిలో ఉన్న రంగయ్య తన సామాజికవర్గం ఓట్లపై గంపెడాశలు పెట్టుకున్నారు. రెండవసారి పోటీచేస్తున్న అభ్యర్థులు జగన్ చరిష్మాపైనే కొండంత భరోసా పెట్టుకున్నారు. వైసీపీ నుంచి ఇద్దరు మహిళలు జొన్నలగడ్డ పద్మావతి, ఉషశ్రీ చరణ్ పోటీలో నిలిచారు.
జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల్లో పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి ఒక్కరే ప్రముఖుడు. గత ఎన్నికల్లో కళ్యాణదుర్గం నుంచి పోటీచేసి ఓడిపోయిన ఆయన మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మాజీమంత్రి శైలజానాథ్ శింగనమల నుంచి పోటీ చేస్తున్నారు. ఇక భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే ఎంపీ అభ్యర్థులుగా హిందూపురం నుంచి మాజీ ఎమ్మెల్యే ఎంఎస్.పార్థసారథి, అనంతపురం నుంచి దేవినేని హంస పోటీ చేస్తున్నారు. తాడిపత్రి అసెంబ్లీ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి బరిలో నిలిచారు.

చిత్రాలు.. దేవినేని హంస *అనంతపురం ఎంపీ బీజేపీ అభ్యర్థి
పరిటాల శ్రీరామ్ *రాప్తాడ్ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి
బండారు శ్రావణిశ్రీ *శింగనమల అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి
జేసీ అస్మిత్ రెడ్డి *తాడిపత్రి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి
జేసీ పవన్ కుమార్ రెడ్డి అనంతపురం ఎంపీ టీడీపీ అభ్యర్థి