రాష్ట్రీయం

ఆదివాసీ రాజ్యంలో ‘మార్పు’ వచ్చేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 28: తూర్పు కనుమల్లోని రంపచోడవరం ఆదివాసీ రిజర్వుడు నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల్లో విలీన మండలాలు కీలకం కానున్నాయి. గత ఎన్నికలకు ఈ మండలాలు ఖమ్మం జిల్లాలో వున్నాయి. విభజన అనంతరం పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలు తూర్పు గోదావరి జిల్లాలో విలీనమయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో భౌగోళికంగా రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చిన విలీన మండలాలు మొదటిసారిగా ఎన్నికలను ఎదుర్కొంటున్నాయి. అరకు పార్లమెంట్ పరిధిలోని రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు తీవ్ర ప్రభావం చూపనున్నట్టు తెలుస్తోంది. విలీనమై ఐదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ మండలాలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యలపై సీపీఎం మాత్రమే పోరాటాలు సాగిస్తోంది. అలాగే పోలవరం నిర్వాసితుల సమస్యలు చెప్పనలవిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిర్వాసితుల ప్రభావం ఎన్నికలపై స్పష్టంగా పడనుంది. ఆదివాసీ కోటలో పాగావేసిన సీపీఎం జనసేన, వామపక్షాల పొత్తులో భాగంగా దక్కించుకుని ఈసారి ఎలాగైనా మార్పు తేవాలని విస్తృత ప్రయత్నాలు చేపట్టింది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన్యం రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్ర విభజన తర్వాత నాలుగు ముంపు మండలాలు రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో కలవడంతో ఒటర్ల సంఖ్య 2 లక్షల 55వేల 313కు చేరింది. ఈ నియోజకవర్గంలో బహుముఖ పోటీవున్నప్పటికీ ప్రధాన పోటీ సీపీఎం, వైసీపీ, టీడీపీల మధ్యే నెలకొంది. ఖమ్మం జిల్లా భద్రాచలం ఎమ్మెల్యేగా మూడుసార్లు పనిచేసిన సున్నం రాజయ్య తొలిసారిగా తూర్పు గోదావరి జిల్లా నుంచి పోటీచేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు ఎమ్మెల్యేగా ఉన్న సున్నం రాజయ్య సీపీఎం, జనసేన, సీపీఐ, బీఎస్పీ కూటమి అభ్యర్థిగా ప్రస్తుతం బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి ఆ తర్వాత టీడీపీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి తిరిగి టీడీపీ నుంచి పోటీలోకి దిగారు. ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామాచేసి వైసీపీ తరపున నాగులపల్లి ధనలక్ష్మి పోటీనిస్తున్నారు. తొలిసారిగా రంపచోడవరం అసెంబ్లీ నుంచి సీపీఎం పోటీ చేస్తుండటంతో ప్రధాన పార్టీలు కలవరపడుతున్నాయి.
సీపీఎం అభ్యర్ధిగా పోటీలో వున్న సున్నం రాజయ్య భద్రాచలం నియోజకవర్గం పరిధిలోని అనేక గ్రామాల్లో పలు సమస్యలపై అలుపెరగని పోరాటం సాగించారు. 1979లో సీపీఎం పార్టీలో చేరిన రాజయ్య అప్పట్లో బలమైన పార్టీగా వున్న కాంగ్రెస్ పార్టీకి ఎదురు నిలిచి తొలిసారిగా చిన్నచట్టపల్లి సర్పంచ్‌గా విజయం సాధించారు. రాజయ్యలోని కృషిని గుర్తించిన సీపీఎం నాయకత్వం 1999లో భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నిలబెట్టింది. 1999లో తొలిసారి ఎమ్మెల్యే అయిన రాజయ్య, 2004, 2014లో ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. విలీన మండలాలతోపాటు రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని ఏడు మండలాల్లోనూ రాజయ్య ఇప్పటికే విస్తృతంగా పర్యటించారు. 1958 మార్చి 25న జన్మించిన రాజయ్య విఆర్ పురంలోనే విద్యాభ్యాసం పూర్తిచేశారు.
వైసీపీ అభ్యర్ధి నాగులపల్లి ధనలక్ష్మి తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగారు. అడ్డతీగల మండలం గొండోలు పంచాయతీ రాజానగరం గ్రామంలో 1984లో జన్మించిన ధనలక్ష్మి ఉపాధ్యాయినిగా పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణచేసి వైసీపీ తరపున ఎన్నికల బరిలోకి దిగారు. కొండదొర సామాజిక వర్గానికి చెందిన ధనలక్ష్మి కుల ధ్రువీకరణపై గతంలో చర్చ జరిగింది. ఈమె తల్లి రాఘవ రెండుసార్లు గొండోలు సర్పంచ్‌గా పనిచేశారు. ఏడు నెలలుగా ఆమె వైసీపీలో చురుకుగా తిరుగుతున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ విజయం సాధించడంతో తన గెలుపు ఖాయమనే ధీమాతో వున్నారు.
తెలుగుదేశం అభ్యర్థి వంతల రాజేశ్వరి 1981లో అడ్డతీగల మండలం దాకోడు గ్రామంలో జన్మించారు. కొండరెడ్డి సామాజిక వర్గానికి చెందిన వంతల గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఏడాది క్రితం టీడీపీ గూటికి చేరి మళ్ళీ రెండోసారి బరిలోకి దిగారు. 2001లో దాకోడు ఎంపీటీసీ సభ్యురాలిగా ఎన్నికై ఎంపీపీగా ఐదేళ్లు పనిచేశారు. వంతల రాజేశ్వరి తండ్రి కొండబాబు గతంలో కాంగ్రెస్ పార్టీ అడ్డతీగల మండల బ్లాక్ అధ్యక్షుడుగా పనిచేశారు. తన సామాజికవర్గం ఓట్లతోపాటు టీడీపీ ఓట్లు తనను గెలిపిస్తాయనే ధీమాతో వున్నారు. రంపచోడవరం నియోజకవర్గంలో 2,55,313 మంది ఓటర్లలో 1,32,638 మంది మహిళా ఓటర్లు, 1,22,664 మంది పురుష ఓటర్లు వున్నారు. ఏదేమైనప్పటికీ పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత సమస్యలు, ముంపు మండలాల సమస్యలతో పాటు ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లు కీలకంగా మారనున్నట్టు తెలుస్తోంది.
చిత్రాలు.. సీపీఎం అభ్యర్థి సున్నం రాజయ్య *టీడీపీ అభ్యర్థి వంతల రాజేశ్వరి *వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి