రాష్ట్రీయం

జోలాపుట్టు వంతెన కింద బాంబులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, ఏప్రిల్ 10: ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతమైన జోలాపుట్టు సమీపాన వంతెన కింద ఏర్పాటు చేసిన రెండు బాంబులను బీఎస్‌ఎఫ్ బలగాలు బుధవారం కనుగొన్నాయి. పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులే వీటిని అమర్చినట్టు భావిస్తున్నారు. బీఎస్‌ఎఫ్ క్యాంపు బేసిన్‌కు దాదాపు కిలోమీటరు దూరంలో వంతెన కింద బాంబులను అమర్చడం పోలీసులను నివ్వెరపరిచింది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనున్న తరుణంలో వంతెన కింద బాంబులు అమర్చడంతో ఏవోబీలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ఈ వంతెనకు కిలోమీటరు దూరాన ఉన్న బీఎస్‌ఎఫ్ క్యాంపు బేసిన్‌కు నీటి సరఫరా చేసే పంపు హౌస్ గత ఐదు రోజులుగా మరమ్మతులకు గురికావడంతో దీనికి మరమ్మతులు చేపట్టేందుకు నీటి సరఫరా అధికారులు, బీఎస్‌ఎఫ్ బలగాలు బుధవారం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో పంపు హౌస్ వద్దకు వెళ్లగా అప్పటికే అమర్చిన రెండు బాంబులను గుర్తించారు. దీంతో అప్రమత్తమైన బీఎస్‌ఎఫ్ బలగాలు నీటి సరఫరా అధికారులను ఆ ప్రాంతం నుంచి పంపించేసి జోలాపుట్టు నుంచి ఒడిశావైపు వెళ్లే రహదారి మార్గాన్ని పూర్తిగా నిలిపివేసారు. ఈ వంతెనపై నుంచి ఎటువంటి వాహనాలను అనుమతించకుండా చర్యలు తీసుకోవడమే కాకుండా బాంబులు అమర్చిన వంతెనకు ఇరువైపులా ఐదు కిలోమీటర్ల పరిధిలోని రహదారిని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. దీంతో జోలాపుట్టు, ఒడిశా మార్గంలోని రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో అనేక మంది ఇక్కట్లు ఎదుర్కోనాల్సి వచ్చింది. ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఈ వంతెనపై నుంచే పెట్రోలింగ్ నిర్వహిస్తుండడంతో వారిని లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు మంగళవారం రాత్రి వీటిని అమర్చి, పోలీసులు రాగానే వీటిని పేల్చివేసేందుకు వ్యూహ రచన చేసినట్టు తెలుస్తోంది. పోలీసులు ఏమాత్రం ఏమరపాటుగా వ్యవహరించినా భారీ ప్రమాదం చోటుచేసుకుని ఉండేదని చెబుతున్నారు. పంప్ హౌస్ వద్ద ఉన్న విద్యుత్ స్విచ్‌లను ఆన్‌చేసి ఉంటే వంతెన కింద ఉన్న బాంబులు పేలి పెను విధ్వంసం సృష్టించి ఉండేదని భావిస్తున్నారు. కాగా ఈ వంతెన కింద భాగాన అమర్చిన బాంబులను నిర్వీర్యం చేసేందుకు ఒడిశాలోని కొరాపుట్ నుంచి బాంబు స్క్వాడ్‌ను రప్పిస్తున్నట్టు సమాచారం. బుధవారం ఉదయం పదకొండు గంటలకు బాంబులను గుర్తించిన బీఎస్‌ఎఫ్ బలగాలు రాత్రి ఎనిమిది గంటల వరకు బాంబు స్క్వాడ్ రాకపోవడం పట్ల ఆందోళన చెందుతున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈ సంఘటన చోటుచేసుకోవడంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. జోలాపుట్టు వంతెన వద్ద అమర్చిన బాంబులతో మరిన్ని ప్రాంతాలలో మావోయిస్టులు బాంబులు అమర్చి ఉంటారని అనుమానిస్తున్న పోలీసులు అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ అప్రమత్తతంగా ఉంటున్నారు.