రాష్ట్రీయం

రాష్ట్రంలో హింస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 11: రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు గురువారం జరిగిన ఎన్నికల్లో పలు హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్నికలను రెండు పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎలా గెలిచి తీరాలన్న కాంక్షతో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పలు చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అంతకు ముందు ఎన్నికల అధికారులు అన్ని పోలింగ్ కేంద్రాల్లో మాక్‌పోలింగ్ నిర్వహించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 15 వందలకు పైగా ఈవీఎంలు మొరాయించటంతో ఆ ప్రాంతాల్లో మూడు గంటల వరకు పోలింగ్‌ను నిలిపివేశారు. ఈవీఎంల పనితీరుతో విసుగెత్తిన ఓటర్లు వాటిని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. రాయలసీమతో పాటు గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఫ్యాక్షన్ రాజకీయ కక్షలు పురివిప్పాయి. ఎన్నికల సందర్భంగా అనంతపురం జిల్లాలో ఇరువర్గాల ఘర్షణలో ఇద్దరు మృతిచెందారు. జిల్లాలోని తాడిపత్రి శాసనసభ నియోజకవర్గం పరిధిలోని మీరాపురంలో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ వర్గీయులు వేటకొడవళ్లతో పరస్పర దాడులకు దిగారు. ఈ దాడిలో టీడీపీ నేత సిద్ధా భాస్కర్ రెడ్డి, వైసీపీ నేత పుల్లారెడ్డి హతమయ్యారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో నియోజకవర్గం పరిధిలోని ఓ పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరుగుతోందని సమాచారం తెలుసుకుని అక్కడికి వెళ్లిన టీడీపీ అభ్యర్థి, శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై ప్రత్యర్థులు దాడి చేయటంతో సొమ్మసిల్లి కింద పడ్డారు. ఆయన గన్‌మెన్లపై కూడా రాళ్లతో దాడి చేశారు. అయితే కోడెలపై దాడి జరగలేదని ఆయన ఉద్దేశపూర్వకంగానే పోలింగ్‌ను నిలిపివేసేందుకు డ్రామాలాడారని వైసీపీ నేతలు ఆరోపించారు. కాగా నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న డాక్టర్ అరవిందరావుపై వైసీపీ కార్యకర్తలు దాడిచేసి కారు అద్దాలు ధ్వంసం చేశారు. అందుకు ప్రతిగా వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకుని దాడికి దిగటంతో ఆయన చేతికి గాయమైంది.
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలో జరిగిన రాళ్ల దాడిలో మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌తో పాటు సోదరి వౌనికకు గాయాలయ్యాయి. ఘర్షణ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి బ్రిజేంద్రనాథ్‌రెడ్డి కారులో తమ కార్యకర్తలిద్దరిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని ఆయన వాహనంలో కర్రలు, కట్టెలు ఉన్నాయని పోలీసులకు, ఎన్నికల సంఘానికి భూమా వౌనిక ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ చేసిన కార్యకర్తలను తమకు అప్పగించాలని వౌనిక, ఆమె సోదరుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి, టీడీపీ కార్యకర్తలతో కలసి రోడ్డుపై బైఠాయించారు. కార్యకర్తలను అప్పగించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం పరిధిలోని శ్రీనివాసపురం, నరసరావుపేట నియోజకవర్గం పరిధిలోని యలమంద, కడప జిల్లా జమ్మలమడుగు తదితర ప్రాంతాల్లో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. అనంతపురం జిల్లా గుత్తి నియోజకవర్గం పరిధిలోని ఓ పోలింగ్ కేంద్రంలో జనసేన అభ్యర్థి మధుసూదనగుప్తా ఈవీఎంను నేలకేసికొట్టారు. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్టుచేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో టీడీపీ అభ్యర్థి బడేటి బుజ్జి, వైసీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. చిత్తూరులో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో వైసీపీ కార్యకర్తకు బలమైన గాయాలయ్యాయి. ఇదిలా ఉండగా విశాఖపట్నం జిల్లా పెదబయలు మండలం సీకుపనస అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర్లను పోలీసులు నిర్వీర్యం చేశారు. మావోయిస్టు ప్రభావిత అరకు, పాడేరు నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగించారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాలో ఇటీవల మావోయిస్టులు ఓ బీజేపీ ఎమ్మెల్యేతో సహా ఐదుగుర్ని హతమార్చటంతో ఏఒబీలో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలో టీడీపీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ కారులో కర్రలు, ఇనుప రాడ్లు ఉండటంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్‌చేశారు. వైసీపీ కార్యకర్తలు ఆయన కారు అద్దాలు ధ్వంసం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సందర్భంగా జరిగిన దాడులపై కేసులు నమోదు చేసినట్లు ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.
చిత్రాలు.. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో రాళ్లురువ్వుకుంటున్న టీడీపీ, వైకాపా వర్గీయులు
*అనంతపురంలో మృతిచెందిన టీడీపీ కార్యకర్త భాస్కర్‌రెడ్డి