రాష్ట్రీయం

‘మహా’ సంస్కరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 12: సంచలనాత్మక నిర్ణయాలతో పరిపాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సరికొత్త మున్సిపల్, రెవెన్యూ చట్టాల రూపకల్పనపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే! బల్దియా అంటేనే ఖాయా, పీయా చల్దియా అంటూ జనంలో ఓ అప్రతిష్ట నెలకొంది. ఈ అభిప్రాయాన్ని దూరం చేసి మున్సిపల్ సేవలు, పరిపాలనను పారదర్శకంగా కొనసాగించేందుకు జీహెచ్‌ఎంసీలోని మహా సంస్కరణలతో సరికొత్త చట్టాన్ని రూపకల్పన చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు హుకూం జారీ చేశారు. రాష్ట్రంలోనే అతి పెద్ద కార్పొరేషన్‌గా పేరుగాంచిన జీహెచ్‌ఎంసీలో ఎలాంటి మున్సిపల్ చట్టం అందుబాటులోకి వస్తోంది. ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రజలకు మరింత మెరుగైన సేవలందించే దిశగా ఈ చట్టాలను రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ప్రస్తుతం అమలు చేస్తున్న హైదరాబాద్ మున్సిపల్ యాక్టు 1955లో ఎలాంటి మార్పులు చేస్తారు? ఈ చట్టాన్ని మొత్తానికి తొలగించి, మరో కొత్త చట్టాన్ని అమల్లోకి తెస్తారా? తెస్తే ఏ ఏ విభాగాలపై ఎలాంటి ప్రభావం పడుతుందన్న విషయంపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. లేక ప్రస్తుతమున్న చట్టంలో ఎలాంటి మార్పులు చేస్తారన్న విషయం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా లే అవుట్ల అనుమతులు, ఆస్తుల అంచనాలను నిర్ణయించేందుకు కలెక్టర్ నేతృత్వంలో అధికారులు బృందం పని చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. ఇప్పటి వరకు లే అవుట్లకు అనుమతుల జారీ విషయం జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్, జీహెచ్‌ఎంసీ పరిధిలోకి రాని ప్రాంతాల్లో హెచ్‌ఎండీఏ జారీ చేస్తోంది.
ఇపుడు ముఖ్యమంత్రి జారీ చేసిన సరికొత్త ఆదేశాల నేపథ్యంలో ఇకపై ఈ అనుమతులను కలెక్టర్ జారీ చేసే అవకాశాలున్నాయి. అంటే లే అవుట్ల అనుమతుల జారీ అధికారానికి సంబంధించి జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏల అధికారానికి పూర్తిగా కత్తెర పడే అవకాశముందని చెప్పవచ్చు. ఇప్పటికే అక్రమ ఆదాయం కోసం అడ్డదారిలో జీహెచ్‌ఎంసీలో తిష్టవేసిన కొందరు అక్రమార్కులైన అధికారులకు ఎలాంటి సంస్కరణలొస్తాయోనన్న భయం పట్టుకుంది. డిప్యూటీషన్ల గడువు ముగిసినా, ఏళ్ల నుంచి ఇక్కడే తిష్టవేసిన మరికొందరు అధికారులకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటి వరకు కూడా నగరంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సంబంధించి రెవెన్యూ, మున్సిపల్ శాఖల మధ్య సమన్వయలోపం స్పష్టంగా కన్పిస్తోంది. సీఎం ఆదేశించిన విధంగా సరికొత్త చట్టం అమల్లోకి వచ్చి పలు అంశాలకు సంబంధించి మున్ముందు కలెక్టరేట్ నేతృత్వంలో అధికారుల బృందం పనిచేసే అవకాశముండటంతో ఈ రెండు శాఖల మధ్య సమన్వయం కూడా పెరుగుతోంది.
లే అవుట్ల అనుమతులు సరళీకృతం
లే అవుట్లలో ప్లాట్లను చేసి విక్రయించేందుకు ప్రస్తుతం అనుమతుల కోసం బల్దియా, హెచ్‌ఎండీఏ ఆఫీసుల ముందు చక్కర్లు కొడుతున్న దరఖాస్తుదారులకు కొంత వరకు కష్టాలు తగ్గే అవకాశాలున్నాయి. లే అవుట్ల అనుమతుల కోసం బల్దియాలోని టౌన్‌ప్లానింగ్‌కు దరఖాస్తు చేసుకుంటే సవాలక్ష కొర్రీలు పెట్టి, టైటిల్ క్లియరెన్స్, టీఎస్‌ఎల్‌ఆర్ అంటూ, రెవెన్యూ ఎన్‌ఓసీ అంటూ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ, దరఖాస్తుదారుడ్ని ఆఫీసు చుట్టూ తిప్పుకుంటారు. ఇక బేరం కుదిరితే ఎదీ సక్రమంగా లేకపోయినా అడ్డదారిలో అనుమతులు జారీ చేస్తారు.
కానీ ముఖ్యమంత్రి ఆదేశించిన విధంగా లే అవుట్ల అనుమతుల కోసం కలెక్టర్ నేతృత్వంలో అధికారుల బృందం పనిచేస్తే రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలకు సంబంధించి అధికారులే ఆ బృందంలో ఉన్నందున, ప్రస్తుతం అనుమతులిచ్చేందుకు పడుతున్న సమయం కన్నా తక్కువ సమయంలోనే లే అవుట్లకు అనుమతులొచ్చే అవకాశాలున్నాయి.

ఐదు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ?

ప్రస్తుతం నగరంలోని కోటి జనాభాకు పౌరసేవలు, అత్యవసర సర్వీసులను అందిస్తున్న జీహెచ్‌ఎంసీలో కొత్త చట్టం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఐదు ముక్కలయ్యే అవకాశాలున్నట్లు చర్చ జరుగుతోంది. ప్రస్తుతం దేశంలో 20లక్షల మంది జనాభా కల్గిన మున్సిపల్ కార్పొరేషన్లకు కేంద్రం ఏటా రూ. 200 కోట్లను గ్రాంటుకు అందిస్తోంది. అయితే కోటి మంది జనాభా ఉన్న జీహెచ్‌ఎంసీకి నేటికీ ఏటా రూ. 200 కోట్లు మాత్రమే అందుతున్నాయి. జనాభా కోటి దాటిన్నందున ప్రతి 20 లక్షలతో ముంబై తరహాలో ఐదు కార్పొరేషన్లను చేస్తే మరింత మెరుగైన సేవలు అందటంతో పాటు పాలనలో పారదర్శకత చోటుచేసుకుంటుదని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. శేరిలింగంపల్లి, సికిందరాబాద్, చార్మినార్, ఖైరతాబాద్, ఎల్‌బీనగర్ మున్సిపల్ కార్పొరేషన్లగా విభజిస్తే ప్రభావం ఎలా ఉంటుందన్న విషయంపై అధికారులు అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది.