రాష్ట్రీయం

ఒంటిమిట్టలో వేడుకగా సీతారాముల కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, ఏప్రిల్ 18: నిండుపున్నమి నాటి రాత్రి ఒంటిమిట్టలో శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవం కన్నులపండువగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తుల జయజయధ్వనాల మధ్య గురువారం రాత్రి శ్రీరామచంద్రుడు సీతమ్మ మెడలో మంగళసూత్ర ధారణ గావించారు. ఏకశిలానగరం కడప జిల్లా ఒంటిమిట్టలో గురువారం రాత్రి ‘నభూతో.. నభవిష్యతి’ అన్న రీతిలో సీతారాముల కల్యాణం జరిగింది. గవర్నర్ నరసింహన్ దంపతులు, సీఎం చంద్రబాబు దంపతులు కల్యాణోత్సవాన్ని తిలకించారు. తొలుత మూలవరులకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతా లక్ష్మణుడితో కూడిన శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, నూతన వస్త్రాలు, ఆభరణాలతో అలంకార శోభితులను చేశారు. సాయంత్రం ఊరేగింపుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం నుంచి కల్యాణ మండపం వేదిక వద్దకు తోడ్కొని వచ్చారు. కాంతకోరిక, ఎదుర్కోలు ఉత్సవాలు వేడుకగా జరిగాయి. విశ్వక్సేన పూజతో కల్యాణోత్సవం ప్రారంభమైంది. దోష నివారణ పూజలు, పరిచయ కార్యక్రమాల అనంతరం తొలి మంగళహారతి సీతారామ ఉత్సవర్లకు ఇచ్చారు. మంత్రపూరితంగా ఆవాహన చేసి వేద మంత్రోచ్ఛారణతో పుణ్యాహవాచనం చేసి కల్యాణవేదికపై ఉన్న పూజావస్తువులను శుద్ధి చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నదీజలాలను కలశాల్లో తీసుకువచ్చారు. అనంతరం సీతారాముల ఉత్సవర్లకు రక్షాబంధనం గావించారు. స్వామి, అమ్మవార్ల గోత్రనామాలతో అర్చకస్వాములు మహాసంకల్పం జరిపించారు. అలాగే కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ మహాసంకల్పం జరిపారు. మధుపర్కంతో పట్టువస్త్రాలను జనకుడు రామభద్రునికి, సీతమ్మ తల్లికి దశరధ మహారాజు అందజేసే తంతు వేదమంత్రోచ్ఛారణతో గావించారు. రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం, అహోబిలం మఠం తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణఘట్టం జరుగుతున్నంతసేపు భక్తులు మర్యాదా పురుషోత్తముడైన శ్రీరామునికి నీరాజనాలు పలికారు. ‘శ్రీరామ రామ రామేతి.. రమే రామే మనోరమే.. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే’ అంటూ భక్తులు శ్రీరామున్ని కీర్తిస్తూ తరించారు. కల్యాణోత్సవంలో సీతారాములకు ఇచ్చిన మంగళహారతిని గవర్నర్, ముఖ్యమంత్రివర్యులకు అందజేశారు. మహాసంకల్పంతో కన్యాదానం తంతు నిర్వహించారు. అష్టదిక్పాలకుల సాక్షిగా మంగళ లగ్నాష్టకం పఠించి సీతారాముల ఉత్సవర్లకు తెర అడ్డుగా ఉంచి జీలకర్ర, బెల్లం తంతు జరిపారు. సీతమ్మతల్లికి శ్రీరామభద్రుడు కట్టే మాంగల్యాన్ని నారికేళంపై ఉంచి శ్రీసూక్తం పఠించారు. పండితులు మంత్రోచ్చారణ గావిస్తుండగా మంగళవాయిద్యాల ఘోష నడుమ మాంగల్యాన్ని భక్తులందరికీ చూపుతూ మాంగల్యధారణ మహోత్సవాన్ని గావించారు. అనంతరం సీతమ్మ, శ్రీరామభద్రుల పూలదండలు ఒకరివి ఒకరు మార్చుకునే తంతును రమణీయంగా జరిపారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు అర్చకులు తలంబ్రాలు పోయించారు. సీతాదేవి శ్రీరామునిపై ముత్యాల తలంబ్రాలు పోయగా, ఆ ముత్యాలు సీత యొక్క స్వచ్ఛమైన దోసిట ఉన్నప్పుడు పద్మరాగమణుల వలె భాసించగా, శ్రీరాముని తలపై పోసినప్పుడు మల్లెపూలవలె విలసిల్లి, కిందికి జారుతూ శ్రీరాముని నల్లని శరీరకాంతితో కూడి ఇంద్రనీలమణుల్లా విరాజిల్లాయని వ్యాఖ్యాతలు అభివర్ణించారు. అందువల్లే సీతారాముల కల్యాణంలో ముత్యాల తలంబ్రాలకు ఆధ్యాత్మిక విశిష్టత చేకూరింది. అనంతరం టెంకాయలు దొర్లించే కార్యక్రమం ఉత్సవర్ల ముందు అర్చకులు నిర్వహించారు. కల్యాణ మహోత్సవం తంతును వివరిస్తూ వేద పండితులు చేసిన ప్రవచనాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కల్యాణోత్సవాన్ని దీవి హయగ్రీవాచార్యులు, చక్రవర్తుల రంగనాధం, పి.గౌరిశంకర్ ప్రత్యక్ష వ్యాఖ్యానం ద్వారా భక్తులకు వినిపించారు. చూడముచ్చటగా సాగిన ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణ వేడుకలకు జిల్లా నలుమూలల నుంచే గాకుండా పొరుగున ఉన్న తమిళనాడు, తెలంగాణ నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కల్యాణ వేదికవద్ద భక్తులకోసం ఏర్పాటుచేసిన గ్యాలరీలు భక్తజనంతో నిండిపోయాయి. దీంతో బయట ఏర్పాటుచేసిన ఎల్‌ఈడీ స్క్రీన్స్ వద్ద వేలాది మంది భక్తులు స్వామివారి కల్యాణాన్ని తిలకించి పునీతులయ్యారు. కోదండరామాలయం నుంచి కళ్యాణ వేదిక వరకు అర కిలోమీటరు దూరం భక్తజనంతో కిక్కిరిసిపోయింది.
సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా ఉదయం నుండి ఒంటిమిట్టకు తండోపతండాలుగా భక్తులు తరలివచ్చారు. ముందుగా ఆలయంలో శ్రీ కోదండరామున్ని దర్శించుకుని పూజలు నిర్వహించిన భక్తులు నేరుగా కల్యాణ వేదిక వద్దకు చేరుకున్నారు. దీంతో ఒంటిమిట్ట భక్తజనంతో నిండిపోయింది. భక్తులకు మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లను శ్రీరామ సేవకులు అందజేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామభక్తులు ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కల్యాణాన్ని వీక్షించేందుకు వీలుగా శ్రీ వెంకటేశ్వర భక్త్ఛినల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు.

చిత్రాలు.. ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం (ఇన్‌సెట్‌లో )
*వేలాదిగా తరలివచ్చిన భక్తులు * పున్నమి వెనె్నలలో తిలకించి పులకించిన జనం