రాష్ట్రీయం

త్వరలో పరిషత్ షెడ్యూల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 18: జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్ ఎన్నికలకు త్వరలోనే షెడ్యూల్ విడుదల చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీ. నాగిరెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్‌పీలు, జిల్లాపరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారులతో గురువారం ఆయన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని మ్యారియెట్ హోటల్‌లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ, ఎన్నికలు విజయవంతంగా, సమర్థంగా పూర్తయ్యేందుకు జిల్లాల యంత్రాంగాలు పూర్తిగా సహకరించాలని కోరారు. 2019 మే 20 లోగా జడ్‌పీపీ, ఎంపీపీ ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తున్నామని, ఇందుకోసం త్వరలోనే షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే ముందు అన్నికోణాల్లో ఆలోచించాల్సిన, పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలపై మొదట అవగాహనకోసం జిల్లా యంత్రాంగాలతో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్‌పీలు ఇటీవలే రెండు ప్రధానమైన ఎన్నికలను (గ్రామ పంచాయతీ, అసెంబ్లీ) నిర్వహించారని ఈ అనుభవం పరిషత్ ఎన్నికలకు ఉపయోగపడుతుందన్నారు. పరిషత్ ఎన్నికలను ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్లు అవసరమైన చర్యలను తీసుకోవాలని సూచించారు. కలెక్టర్లు తొలుత పోలీసు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, వైద్య ఆరోగ్య శాఖ, రవాణా, విద్యుత్, కమ్యూనికేషన్లు, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించాలని సూచించారు. పరిషత్ ఎన్నికలకు బ్యాలెట్ పేపర్లనే వాడాలని నిర్ణయించామని గుర్తు చేశారు. అందువల్ల బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్, బ్యాలెట్ బాక్సుల సేకరణ సకాలంలో నిర్ణీత సమయంలో పూర్తి చేసుకోవాలన్నారు. బాధ్యత కలిగిన వారికి, విషయ పరిజ్ఞానం ఉన్న వారినే ఎన్నికల నిర్వహణ కోసం ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఎన్నికల సిబ్బందికి అవసరమైన సరైన శిక్షణ ఇవ్వాలని సూచించారు. శిక్షణ నామమాత్రంగా ఉంటే తప్పులు జరిగే అవకాశం ఉంటుందని, దాంతో విమర్శలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అందుకే ఎన్నికల్లో భాగస్వామ్యం అయ్యే సిబ్బందికి మంచి శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఏర్పాట్లకు సమయం ఉండదని, అందుకే ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని నాగిరెడ్డి సూచించారు. రాష్టస్థ్రాయిలో ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, కమిషనర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించామని గుర్తు చేశారు. రాష్టస్థ్రాయిలో ఉన్నతాధికారుల నుండి పూర్తిగా సహాయ సహకారాలు అందుతున్నాయని తెలిపారు. ఎన్నికలకు అవసరమై నిధులు జిల్లా కలెక్టర్లకే నేరుగా అందించే ఏర్పాట్లు జరిగాయన్నారు. ఈ నిధులను కలెక్టర్లు పూర్తిగా వినియోగించుకుని యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని, పోలింగ్‌లో ఓటర్లు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉందన్నారు. పైగా పరిషత్ ఎన్నికలకోసం నిర్ణయించబోయే తేదీలు వేసవి మధ్యకాలంలో ఉంటాయని, అందువల్ల శుద్ధమైన, తాగునీటిని ఓటర్లకు అందించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని కేంద్రాల్లోనూ మరుగుదొడ్లు సరిగ్గా ఉండేలా చూడాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలింగ్ వ్యవహారాన్ని క్షుణ్ణంగా రికార్డు చేయాలని సూచించారు.
ఘర్షణలకు అవకాశం
జడ్‌పీపీ, ఎంపీపీ ఎన్నికల్లో పోటీ తీవ్రస్థాయిలో ఉంటుందని, ప్రతి గ్రామంలోని ప్రజల భాగస్వామ్యం ఉంటుందని నాగిరెడ్డి గుర్తు చేశారు. ఈ ఎన్నికల సమయంలో ఘర్షణలకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అందువల్ల పోలీస్ సిబ్బంది ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు రెండుమూడు రోజుల లోపల ఎన్నికల ఏర్పాట్లపై నివేదిక పంపించాలని నాగిరెడ్డి సూచించారు. రిజర్వేషన్లకు సంబంధించిన నివేదిక ప్రభుత్వం నుండి ఒకటి రెండురోజుల్లో తమకు అందుతుందని ఆశిస్తున్నామన్నారు. ఈ అంశాలన్నీ అధ్యయనం చేసి షెడ్యూల్‌ను ప్రకటిస్తామన్నారు. ఈ సమావేశంలో రాష్టస్థ్రాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
చిత్రం..హైదరాబాద్‌లో గురువారం ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్‌పీలు, జిల్లాపరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీ. నాగిరెడ్డి, చిత్రంలో డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎస్ ఎస్‌కే జోషి