రాష్ట్రీయం

2024 నాటికి రాష్ట్రంలో అధికారమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: ఈ ఎన్నికల్లో అసెంబ్లీలో బలంతో సంబంధం లేకుండా రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా నిలబడి, 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారలోకి రావడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరు చూస్తుంటే ఓటమిని అంగీకరించినట్టే ఉందని, ఈవీఎంలపై దోషాన్ని నెట్టేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ఈవీఎంలు పూర్తిగా ట్యాంపరింగ్ ఫ్రీ అని, వాటిని ఎక్కడో కూర్చుని మార్చేందుకు అందులో చిప్‌లవంటివేమీ ఉండవన్నారు. ఎక్కడో కూర్చుని రిమోట్‌లతో నిర్వహించడానికి ఈవీఎంల లోపల ఎలక్ట్రానిక్ చిప్‌లు వుండవని, అవి స్వయంత్రంగా పనిచేసే మెషిన్లని రామ్‌మాధవ్ పేర్కొన్నారు. ఇవన్నీ తెలిసి కూడా వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారంటే, ఓటమి ఖాయంగా భావించి, ఈవీఎంలపై వంకను నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఏపీలో బీజేపీ ఒక బలమైన ప్రతిపక్షంగా ప్రజా బాహుళ్యంలో బలోపేతమవుతోందన్నారు. తాజా ఎన్నికల్లో రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకంగా బీజేపీ ఒంటరిగా పోటీ చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కేవలం ప్రాంతీయ పార్టీల రాజకీయాలే నడుస్తున్నాయని, జాతీయ రాజకీయాల్లో రాష్ట్రానికి ప్రాధాన్యం పెరగాలంటే రాష్ట్రంలో జాతీయ పార్టీల ప్రాబల్యం పెరగాల్సిన అవసరం ఉందని రామ్‌మాధవ్ అభిప్రాయపడ్డారు. ఈదృష్ట్యా అసెంబ్లీ తమ బలం ఎంత ఉన్నా, రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా నిలబడాలనే సంకల్పంతో బీజేపీ ఉందన్నారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా మోదీపైనే నెట్టేయడం చూస్తుంటే ఈ నాయకుల మానసిక స్థితిపై సందేహం కలుగుతోందన్నారు. బీజేపీ కేంద్రంలో ఎన్డీయే మిత్ర పక్షాలతో బలమైన ప్రభుత్వాన్ని స్వయంగా ఏర్పాటు చేయనుందన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి, ఇతర పార్టీల నాయకులంతా ఏడాదికి పైగా బీజేపీకి వ్యతిరేకంగా, మోదీకి వ్యతిరేకంగా పెద్దఎత్తున దుష్ప్రచారం చేశారని రామ్‌మాధవ్ ఆరోపించారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి వుందని, మోదీ ప్రభుత్వం ఏపీకీ చాలా మేలు చేసిందన్నారు. ప్రత్యేక హోదా కంటే ఎక్కువ ప్రయోజనాలు కల్పించే విధంగా ప్రయత్నించామన్నారు. టీడీపీ, వైఎస్సార్‌సీపీ అసత్యప్రచారాలను ప్రజలు నమ్మలేదన్నారు. బీజేపీ, మోదీ పట్ల అపరిమితమైన అభిమానాన్ని రాష్ట్ర ప్రజలు చూపించారని ఈ ఎన్నికల ద్వారా తెలుస్తోందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులెవర్నీ ప్రజలు తప్పుపట్టకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. అందుకే ఈ రాష్ట్ర ప్రజలకు బీజేపీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఏపీలో కనిపించిన అనుకూలత అన్ని రాష్ట్రాల్లోనూ కన్పిస్తోందన్నారు. ఎన్నికల కమిషన్ ఎన్నికలను చాలా నిష్పక్షపాతంగా నిర్వహించిందన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారంపై మూడు రోజులు నిషేధం విధించడమే ఇందుకు నిదర్శనమన్నారు. సమావేశంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, నాయకులు యెనిమిరెడ్డి మాలకొండయ్య, మానేపల్లి అయ్యాజీ వేమా, వేటుకూరి సూర్యనారాయణరాజు, అమలాపురం నాయుడు, సింగిలినేని సత్యనారాయణ తదితరులు వున్నారు.

చిత్రం... రాజమహేంద్రవరంలో ఆదివారం విలేఖర్లతో మాట్లాడుతున్న రామ్‌మాధవ్