రాష్ట్రీయం

‘ ఫిరాయింపుదార్ల’కు టికెట్లు లేనట్టే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: పార్టీ మద్దతుతో గెలిచిన తరువాత ఫిరాయించి, తమ ఇష్టానుసారం తిరిగి పార్టీలోకి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వకుండా కొత్త విధానంలో అభ్యర్థుల ఎంపిక చేపట్టాలని తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఒకప్పుడు బలమైన పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం తన ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఖమ్మం జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి రెండు స్థానాల్లో గెలిచినప్పటికీ సత్తుపల్లి నుంచి విజయం సాధించిన సండ్ర వెంకటవీరయ్య పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్ గూటికి చేరారు. ఖమ్మంలో ఓడిపోయిన నామా నాగేశ్వరరావు కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో జిల్లాలో తెలుగుదేశం పార్టీకి నాయకత్వ సమస్య వచ్చింది. అయితే పార్టీ విధానాలను నమ్ముకొని పనిచేస్తున్న కొందరు నేతలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారి జాబితాను తయారు చేస్తున్నారు. అందుకోసం పార్టీ నేతలు, కార్యకర్తలకు ఒక ప్రశ్నావళి పంపించారు. రాష్ట్రంలోనే వినూత్న పద్ధతిలో చేపడుతున్న ఈ విధానం అన్ని జిల్లాల్లో అమలు చేసే దిశగా ప్రయత్నం జరుగుతున్నట్టు సమాచారం. అందులో మొదటిది ఒంటరిగా పోటీ చేసేవారి పేర్లు ఇవ్వాలని, రెండోది ఇతర పార్టీల మద్దతుతో పోటీ చేసేవారి పేర్లు ఇవ్వాలని, మూడోది పార్టీ ఇచ్చే ఆర్థిక సహాయంతో పోటీ చేసేవారి పేర్లు చెప్పాలని, నాలుగోది సొంతంగా ఖర్చుపెట్టి పోటీ చేసేవారి పేర్లు ఇవ్వాలని కోరింది. ఈ విధానంలో తమ దృష్టికి వచ్చిన పేర్ల ఆధారంగా పార్టీ అభ్యర్థులను ఎంపిక చేయనుంది. అదే క్రమంలో పార్టీ మారకూడదనే నిబంధన కూడా విధిస్తున్నారు. దీనిపై కొందరు నేతల్లో నిరసన వ్యక్తవౌతున్నప్పటికీ ఎక్కువ మంది మాత్రం ఇదే స్పష్టమైన విధానమని, ఎవరినో గెలిపించి తరువాత ఇబ్బందులు పడటం సరికాదని అంటున్నారు. ఖమ్మం జిల్లాలో బలమైన కేడర్ కలిగిన తెలుగుదేశం పార్టీకి తిరిగి పునర్వైభవం తేవాలంటే కొత్త విధానాలు తప్పవని సూచిస్తున్నారు. ఈ విధానాన్ని కొందరు టీడీపీ నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన కూడా ఆమోదించినట్లు తెలిసింది. రాష్ట్ర పార్టీ నాయకత్వం సైతం అన్ని జిల్లాల్లో ఇదే విధానం అమలు చేయాలని సూచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ విధానాన్ని అమలు చేస్తూ అభ్యర్థుల ఎంపిక చేపడుతున్నారు. తొలి దశలో ఎన్నికలు జరిగే మండలాల్లో సోమవారం నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభవౌతున్న నేపథ్యంలో ముందుగా ఆ మండలాలపై దృష్టి పెట్టి మంగళవారంలోగా అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలని నిర్ణయించారు. బుధవారం నామినేషన్లకు చివరిరోజు కావటంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులంతా నామినేషన్లు వేసేలా ప్రణాళిక రూపొందించారు.