రాష్ట్రీయం

విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అవినీతి గురించి మాట్లాడుతోన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇంటర్మీడియట్ బోర్డులో జరిగిన అవకతవకలపై స్పందించే తీరిక లేదా? అని కాంగ్రెస్ పార్టీ నిలదీసింది. ఇంటర్మీడియట్ ఫలితాలలో జరిగిన అవకతవకలపై స్పందిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు భట్టి విక్రమార్క సంయుక్తంగా ముఖ్యమంత్రికి సోమవారం బహిరంగ లేఖ రాశారు. దాదాపు 9.45 లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించిన ఉదంతంపై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలేదని వారు ప్రశ్నించారు. పది లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన అంశమంటే పది లక్షల కుటుంబాలకు చెందిన సమస్య అని వారు గుర్తు చేశారు. ఏడాది పాటు కష్టపడి చదవి, భవిష్యత్‌లో ఉన్నత విద్య అభ్యసించడానికి కలలు కంటున్న విద్యార్థుల ఆశలపై ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బోర్డు అధికారుల విపరీత దోరణి వల్ల విద్యార్ధుల జీవితాలు నాశనమయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరగా ఫలితాలను విడుదల చేయాలన్న ప్రభుత్వ ప్రచార యావ వల్ల ఎంతో మంది విద్యార్థుల జీవితాలను బలితీసుకుందని మండిపడ్డారు. ఇంటర్ ఫలితాల తర్వాత మూడు రోజుల వ్యవధిలో 12 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఆధ్వాన్నంగా మారిన ఇంటర్ బోర్డు తప్పులు చేసి, ఎలాంటి తప్పులు జరగలేదని బుకాయించడం క్షేమించరాని నేరమన్నారు. ప్రతి రోజు ఒక్కో లెక్చరర్ 40 పేపర్లు దిద్దాల్సి ఉండగా 65 పేపర్లు అప్పగించడమే అవకతవకలకు కారణమైందని విమర్శించారు. మొదటి సంవత్సరం పరీక్షలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులు రెండో సంవత్సరంలో ఫెయిల్ కావడం ఏమిటని ప్రశ్నించారు. జాగ్రఫీలో సబ్‌జెక్ట్‌లో వచ్చిన మార్కులు మెమోల్లో కనిపించలేదని ఆరోపించారు. సబ్‌జెక్టుల వారీగా వచ్చిన మార్కులకు మొత్తం మార్కులకు మధ్య తేడాలు ఉన్నాయన్నారు. అత్యంత కీలకమైన ఇంటర్మీడియట్ ఫలితాల విషయంలో ప్రభుత్వం స్పందించే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. ఇంటర్ బోర్డులో జరిగిన తప్పులపై కనీసం అధికారులను పిలిచి సీఎం ఎందుకు మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై విద్యాశాఖ మంత్రి కనీసం సమీక్షా సమావేశం ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. అవినీతి ప్రక్షాళన చేస్తామని ప్రగల్బాలు పలుకుతున్న ముఖ్యమంత్రి ఇంటర్ బోర్డులో జరిగే అవినీతిని ఎందుకు అరికటట్టడం లేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క ప్రశ్నించారు. రాజకీయ అవినీతి ప్రోత్సహించడమే తప్ప ప్రజల సమస్యలను ఎప్పుడైనా పట్టించుకున్న పాపాన పోయిందా? అని వారు ధ్వజమెత్తారు. ఇంటర్ ఫలితాల్లో జరిగిన తప్పులకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేసి సమగ్రమైన విచారణ జరిపించి నష్టపోయిన విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ బోర్డును ప్రక్షాళన చేసి, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.