తెలంగాణ

మరుగునపడిన మహాచరిత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఏప్రిల్ 10: రాజుల కాలం నాటి చరిత్రను ఇముడ్చుకున్న మెదక్ జిల్లా ఝరాసంగం మండలంలోని కుప్పానగర్ గ్రామానికి మహా చరిత్ర ఉన్నట్లు అక్కడ లభిస్తున్న వివిధ రకాల అద్భుతమైన దేవతా విగ్రహాలు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. పురావస్తు శాఖ అధికారులు రెండు దశాబ్దాల క్రితమే గ్రామంలో లభించిన వివిధ దేవ తామూర్తుల విగ్రహాలను, శిలాశాసనాలను పరిశీలించినా పూర్తి వివరాలను ఇప్పటి వరకు వెల్లడించలేకపోతున్నారు. గ్రామస్థులు మాత్రం ఈ గ్రామాన్ని కుపేంద్రభూపతి రాజు పరిపాలించిన కుబేర పట్టణంగా భావిస్తున్నారు. కుపేంద్ర భూపతిరాజుకు రఘువంశంతో సంబంధం ఉన్నట్లుగా కొంతమంది నిపుణులు పేర్కొంటున్నా పూర్తి స్థాయిలో నిర్ధారించడం లేదు. ప్రస్తుతం ఉన్న కుప్పానగర్ గ్రామానికి తూర్పు దిక్కున సుమారు 20 నుంచి 30 ఎకరాల విస్తీర్ణంలో ఎక్కడ తవ్వినా గునపం, పార అవసరం లేకుండా చేతితో మట్టిని తీసుకోవచ్చు. గుట్టగా ఉన్న ప్రాంతంలో మట్టి తేలికగా ఇళ్ల నిర్మాణాలకు అనువుగా ఉండడంతో దాదాపు పది మీటర్ల లోతు వరకు మట్టి తవ్వకాలు నిర్వహించారు. ఈ తవ్వకాల్లో శివలింగాలు, అమ్మవారి విగ్రహాలు, కమలం పువ్వు ఆకారంలో మందిరాలకు ఏర్పాటు చేసే కం డాలు బయటపడ్డాయి. స్పష్టంగా కనిపించే విధంగా బయటపడిన రాశి చక్రాన్ని గ్రామానికి ఓ దిక్కున ఉన్న హనుమాన్ మందిరంలో ప్రతిష్ఠించి గ్రామస్థులు భద్రపర్చారు. ఇదే మందిరం లోపల ఒక లింగం, వరండాలో నందితో పాటు మరో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. తవ్వకాలు నిర్వహించిన ప్రాంతంలో పూర్వీకులు ఉపయోగించిన మట్టి పాత్రలు, మట్టి గాజులు, బోకులు లభిస్తున్నాయని గ్రామస్థులు పేర్కొంటున్నారు. గతంలో ఇక్కడ ఒక గ్రామం ఉండవచ్చని భూకం పం రావడం వల్ల గ్రామం మొత్తం భూమిలోకి కృంగిపోయి ఉండవచ్చని పురావస్తు శాఖ అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. ఒకేచోట మనుషులకు సంబంధించిన పుర్రెలు, ఎముకలు నలుగురైదుగురివి బయటపడినట్లు గ్రామస్థులు పేర్కొంటున్నారు. దీంతో భూకంపం వల్ల గ్రామం కనుమరుగైనట్లు అనుమానిస్తున్నారు. రాజుల కాలంలో జరిగే యుద్ధాల్లో మరణించిన వారిని ఒకేచోట కననం చేయడం లేదా దహనం కూడా చేసేవారన్న వాదనలు ఉన్నాయి. వైద్య శాస్త్రం అంతంతగా ఉన్న నాటి రోజుల్లో ప్రబలే అంటురోగాల వల్ల గ్రామాలకు గ్రామాలు ఖాళీ చేసి వెళ్లిపోయేవారని ఇది ఒక కారణం కావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక్కడ జరిపిన తవ్వకాల్లో ఒక విచిత్రమైన ఇటుకలు లభించాయి. ఒక ఇటుక సైజు రెండు ఫీట్ల పొడవు, ఒక ఫీటు వెడల్పు, తొమ్మిది అంగుళాల ఎత్తులో ఉన్నాయి. వీటి బరువు కేవలం మూడు కిలోలకు మించి ఉండదు. అక్కడ లభించిన ఒక ఇటుకతో ఇప్పుడు తయారఅవుతున్న ఇటుకలు 8తో సరిపోల్చవచ్చు. అప్పటి ఇటుకను గడ్డపారను దింపినా ఇసుమంతైనా చెదరిడం లేదంటే దాని పటిష్టత ఏమిటో స్పష్టమవుతోంది. తవ్వకాల్లో దొరికిన ఇటుకలతో గ్రామస్థులు తిరిగి ఇళ్లు నిర్మించుకున్నారు. శివలింగంపై విచిత్రమైన గీతలు ఉండడంతో నాటి రాజులకు సంబంధించిన రాజముద్రలుగా భావిస్తున్నారు. పొరుగున ఉన్న గ్రామస్థులు మట్టిని తవ్వుకుని వెళ్తుండగా అమ్మవారి విగ్రహం కనిపించింది. కుప్పానగర్ గ్రామానికి చెందిన మహిళలంతా ఏకమై భవానిమాత విగ్రహంగా భావించి తీసుకువచ్చి కేవలం మహిళలే మందిరాన్ని నిర్మించి అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. గ్రామానికి వెలుపల ఉన్న ఓ శివాలయం వద్ద మరికొన్ని విగ్రహాలను ఆరుబయట వదిలిపెట్టారు. కాగా లింగాకారంలో ఉన్న ఓ ఖండానికి దిగువన అక్షరాలు, పైన కూడా అక్షరాలు, రాజముద్రికలు ఉన్నా యి. గ్రామస్థులు లింగంగా భావిస్తున్నా పాణవట్టం లేకుండా ఎక్కడ కూడా లింగాన్ని నిర్మించిన దాఖలాలు అంతంత మాత్రమే. లింగానికి దిగువున ఎలాంటి అక్షరాలు ఉండకపోగా ఈ లింగాకారానికి మాత్రం అక్షరాలు కనిపిస్తున్నాయి. ఇదే ప్రాంతంలో ఒక తలకు రెండు ప్రక్కల స్ర్తిల విగ్రహాలు, కాళ్ల వద్ద ముగ్గురు నిలబడి, ఇద్దరు కూర్చుని ఉన్న విగ్రహాలు ఉన్నాయి. మహిళగా భావిస్తున్నా విశాలమైన నేత్రాలు కలిగివుండడంతో బుద్ధుడి విగ్రహంగా భావిస్తున్నా అది నమ్మశక్యం కాని విషయం. కాలభైరవుడి విగ్రహాన్ని తలపించే మరో దేవతా ప్రతిమ కూడా నిరాదరణకు గురవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఉన్న గ్రామానికి కూడా చుట్ట్టూ కోట, మధ్యలో బురుజు, కోటగోడపై పోతుల బండి తిరిగేంత విశాలంగా ఉండడం గమనార్హం. ఇక్కడ లభించిన దేవతా ప్రతిమలు, ఇతర పాత్రలు క్రీస్తుపూర్వమా, క్రీస్తుశకమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విశేషమైన చరిత్రను సంతరించుకున్న కుప్పానగర్ గ్రామంపై పురావస్తు శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కుప్పానగర్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వరస్వామి ఆలయాన్ని కుపేంద్ర భూపతి రాజు నిర్మింపజేసినట్లు స్కంధపురాణం వెల్లడిస్తోంది. పురాణాల్లో ఉన్న ఝరాసంగం ఆలయ చరిత్ర ఉం దంటే కుపేంద్ర భూపతి రాజు కుప్పానగర్ గ్రామాన్ని పాలించి ఉండవచ్చన్న నమ్మకం కలుగుతోంది. పురావస్తు శాఖలో సరియైన నిపుణులు లేకపోవడం, శాసనాలపై ఉన్న భాషలను పరిశోధించేవారు తగ్గిపోతుండటం, శాఖ నిర్వీర్య దశలో ఉండడంతో భావితరాలకు తెలియాల్సిన అనేక గాథలు మరుగున పడుతున్నాయని చెప్పవచ్చు. రకరకాల కథలు వినిపిస్తున్న కుప్పానగర్ గ్రామ చరిత్ర ఏమిటో వెలుగులోకి తీసుకువచ్చి భవిషత్ తరాలకు అందించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఎంతైనా ఉంది.