తెలంగాణ

ప్రాజెక్టుల రీడిజైన్ విధానాలు వెల్లడించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 10: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల రీడిజైన్ విధివిధానాలను బహిర్గతం చేయాలని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. ఆదివారం నాచారంలోని హెచ్‌ఎంటి నగర్‌లో టిజెఎసి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ జిల్లాల నుంచి వచ్చిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న ఇరిగేషన్ తాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి, విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై శే్వత పత్రం విడుదల చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంతంలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో స్థానికులకు 70 శాతం ఉద్యోగావకాశాలు కల్పించాలని, రాష్ట్రంలోని అన్ని మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించి ఇతోధికంగా నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు ప్రతి ఎకరాకు పదివేల నష్టపరిహారం అందించాలని, నదులకు ఉపనదులను అనుసంధానం చేయాలని, ఓపెన్‌కాస్టు బొగ్గు తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని, బోధన్‌లోని చక్కెర కర్మాగారాన్ని, సిర్‌పూర్‌లోని పేపర్ మిల్లును తెరిపించాలని కోదండరాం డిమాండ్ చేశారు. తెలంగాణ జెఎసి ఆధ్వర్యంలో ప్రజావసరాలపై ఉద్యమం చేపడతామని, టిజెఎసిని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పిలుపునిచ్చారు. కరవుకాటకాల్లో మునిగిపోతున్న తెలంగాణను కాపాడుకోవాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన న్యాయవాదుల సంక్షేమం కోసం రూ. 100 కోట్లు కేటాయించాలని కోదండరాం డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జెఎసి నాయకులు రఘు, రాధాకృష్ణ, శ్రీ్ధర్, వివిధ జిల్లాల నుంచి ప్రతినిధులు ప్రసంగించారు.

సమావేశంలో పాల్గొన్న టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, ఇతర నాయకులు

సాంకేతిక పరిజ్ఞానంతో..
సైబర్ నేరాలకు చెక్?
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 10: రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరాల్లో చిక్కుకుంటున్న వారు అధిక శాతం విద్యావంతులే. బయట వ్యక్తులకు అకౌంట్ వివరాలు, ఓటిపి సమాచారం ఇవ్వొద్దని బ్యాంకు అధికారులు, పోలీసులు చెబుతున్నప్పటికీ డబ్బుపై అత్యాశతో తమ సూచనలు పాటించకుండా పెడచెవిన పెడుతున్నారని అంటున్నారు. తీరా మోసపోయామని గ్రహించి పోలీసు స్టేషన్లకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారని పోలీసులు వాపోతున్నారు. బ్యాంకుల్లో దాచుకున్న డబ్బును మాయగాళ్లు విత్‌డ్రా చేసుకొని దర్జాగా ఖర్చు చేసుకున్నాక బాధపడుతున్నారు. అంది వచ్చిన టెక్నాలజీతో నేరగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయడంలో సైబర్ క్రైం పోలీసులు మంచి ఫలితాలు సాధిస్తున్నారనే చెప్పవచ్చు. రాష్ట్ర సరిహద్దులు దాటి ఎన్నో ప్రయాసలకోర్చి నేరస్థులను పట్టుకుంటున్నారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో పోలీసు కమిషనర్ సివి ఆనంద్ సైబర్ నేరాల అదుపునకు సరికొత్త టెక్నాలజీని తెప్పించారు. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టు మోసగాళ్ల ఆగడాలకు అదే మోసంతో అడ్డుకట్ట వేయడమే ఈ టెక్నాలజీ ప్రత్యేకత. సైబర్ నేరాల అదుపునకు సరికొత్త ల్యాప్‌టాప్స్, సాఫ్ట్‌వేర్ సమకూర్చారు. మోసానికి మోసంతోనే సమాధానం అన్నట్టు మాయగాళ్లు ఇచ్చిన మెయిల్ ఐడి, వెబ్‌సైట్‌లను సైబర్ పోలీసులు కొత్త టెక్నాలజీతో హ్యాక్ చేస్తారు. మోసాలకు వారు వేసే ఎత్తులనే పోలీసులు తిరిగి వారిపై ప్రయోగిస్తున్నారు. నేరగాళ్లు ఎక్కడి నుంచి లావాదేవీలు నిర్వహిస్తున్నారో తెలుసుకుంటారు. వెంటనే సంబంధిత విభాగాలకు సమాచారం చేరవేసి నేరగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తారు. మహానగరంలో తొలిసారిగా ఇలాంటి టెక్నాలజీని సైబరాబాద్ పోలీసులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. 24 గంటల్లోపు బాధితులు ఫిర్యాదు చేస్తే చాలు వారి ఖాతాలోని డబ్బు దారిమళ్లకుండా తిరిగి ఖాతాల్లోకి చేరేందుకు అవకాశం ఉందని డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ రియాజుద్దీన్ తెలిపారు.
చంద్రబాబుకు కంటి పరీక్షలు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఏప్రిల్ 10: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ఉదయం తన కంటి వైద్య పరీక్షల నిమిత్తం తాడిగడపలోని ఎల్‌వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థకు విచ్చేశారు. ముఖ్యమంత్రికి సంస్థ చైర్మన్ డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావు హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య బృందం ప్రతినిధి డాక్టర్ బి చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్, పోలీసు, రెవెన్యూ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి పర్యావరణ పరిక్షణలో భాగంగా మొక్కలను నాటారు. అనంతరం ఆయన నేత్ర వైద్య పరీక్షలకు హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి విచ్చేసిన ప్రత్యేక వైద్య బృందం సిఎంకు సాధారణ నేత్ర వైద్య పరీక్షలను నిర్వహించింది. అనంతరం ఎల్‌వి ప్రసాద్ నేత్ర విజ్ఞాన సంస్థ వైద్యులను ఇతర సిబ్బందిని సిఎంకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఇక్కడ జరుగుతున్న వైద్య విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. సిఎం రాక సందర్భంగా తాడిగడప గ్రామంలో పటిష్ఠ బందోబస్తును నిర్వహించారు. ఈ కార్యక్రమం పూర్తిగా ఆయన వ్యక్తిగత కార్యక్రమంగా సాగింది.

లండన్‌లో వెల్లివిరిసిన తెలుగు సంస్కృతి
‘తాల్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 10: ఉగాది పర్వదినం సందర్భంగా లండన్‌లో తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు వెల్లివిరిశాయి. లండన్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు కుటుంబాలు లండన్‌లోని రెడ్‌బ్రిడ్జ్ టౌన్‌హాలులో శనివారం సమావేశమై సాంప్రదాయబద్ధంగా ఉగాది ఉత్సవాలను నిర్వహించాయి. తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) నేతృత్వంలో ఈ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని కాపాడుకునేందుకు గత పనె్నండు సంవత్సరాల నుండి తాల్ నేతృత్వంలో ఉగాది వేడుకలను లండన్‌లో నిర్వహిస్తున్నామని ఈ సంస్థ చైర్మన్ సత్యేంద్ర పగడాల ఈ సందర్భంగా తెలిపారు. సంగీతం నేర్చుకుంటున్న చిన్నారి విద్యార్థుల కీర్తనలతో ప్రారంభమైన ఉత్సవాల్లో ప్రదర్శించిన సాంస్కృతిక సంబరాలు మిన్నంటాయి. ప్రతి సంవత్సరం తాల్ ప్రదానం చేసే ‘లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు’ ఈ పర్యాయం ప్రముఖ వైద్యుడు, నటుడు, నాటక రచయిత అయిన డాక్టర్ కడియాల వివేకానంద మూర్తికి అందించారు. ఈ కార్యక్రమంలో తాల్ కన్వీనర్ అనిత నోముల, వైస్ చైర్మన్ బాలాజీ కల్లూరు, ట్రస్టీలు శ్రీధర్ మేడిచెట్టి, మల్లేశ్ కోట, భారతి కందుకూరి, నిర్మల ధవళ, శ్రీధర్ సోమిశెట్టి, కిరణ్ కప్పెట తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ చైర్‌పర్సన్లకు
తెరాస తీర్థం

‘చే’జారిన బొంగుల, బొడ్డుపల్లి

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 10: ఇద్దరు మున్సిపల్ చైర్ పర్సన్లు ఒకే రోజున ‘కారు’ ఎక్కడంతో కాంగ్రెస్ నేతలు అవాక్కయ్యారు. మున్సిపల్ చైర్ పర్సన్లను, ఇతర ప్రజాప్రతినిధులను కాపాడుకోవడం ఎలా? అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) ఆందోళన చెందుతోంది. మెదక్ జిల్లా సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి, నల్లగొండ జిల్లా మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి అనూహ్యంగా తమ పార్టీ అనుచరులను వెంట తీసుకుని తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. బొంగుల విజయలక్ష్మి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. ఆమెతో పాటు సంగారెడ్డి మున్సిపల్ వైస్-చైర్మన్ గోవర్ధన్ నాయక్, మరో ఏడుగురు కౌన్సిలర్లను మంత్రి హరీశ్‌రావు ముఖ్యమంత్రి కెసిఆర్ వద్దకు తీసుకెళ్ళారు. అలాగే నల్లగొండ మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఆమె భర్త శ్రీనివాస్ నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ముఖ్య అనుచరునిగా ఉన్నారు. లక్ష్మి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికవడంలో కోమటిరెడ్డి కీలక పాత్ర పోషించారు.
కాంగ్రెస్‌లో కలవరం
తెరాస ‘ఆకర్ష్’ మళ్లీ ‘తెర’పైకి రావడం కాంగ్రెస్ సీనియర్ నాయకులను కలవరపరుస్తున్నది. చైర్‌పర్సన్లు బొంగుల విజయలక్ష్మి, బొడ్డుపల్లి లక్ష్మిలు ఏ సమయంలోనైనా గులాబీ గూటికి చేరనున్నారన్న వదంతులు చాలా కాలం నుంచి ఉన్నప్పటికీ వారిని కాపాడుకోలేకపోయామన్న బాధ కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతున్నది. బొడ్డుపల్లి లక్ష్మి పార్టీ వీడకుండా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చాలా కాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నా, చివరకు ఆమె శనివారం పార్టీని వీడి ‘కారు’ ఎక్కారు. దీంతో తెరాస ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. అయితే తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ఎవరైనా తమ పార్టీలో చేరేందుకు ముందుకు వస్తే ఎందుకు కాదంటామని తెరాస నాయకులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో చేరేందుకు ఇతర పార్టీల నాయకులు ముందు వస్తే వద్దన్నారా? అని వారు ప్రశ్నిస్తున్నారు. తాము పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం లేదని వారు చెబుతున్నారు.

బిజెపి నేత లక్ష్మణ్‌కు
అభినందనల వెల్లువ
వరంగల్ నాయకుల సన్మానం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 10: బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులైన డాక్టర్ కె.లక్ష్మణ్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్ జిల్లా నాయకులు ఆదివారం ఆయనను ఘనంగా సన్మానించారు. లక్ష్మణ్‌ను సన్మానించిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు టి.రాజేశ్వర రావు, మందాడి సత్యనారాయణరెడ్డి, ఎం.్ధర్మారావు, వన్నాల శ్రీరాములు, కె.ప్రతాప్‌రెడ్డి, వి.జైపాల్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి, వరంగల్ అర్బన్ అధ్యక్షుడు సునీల్, మహిళా నాయకులు విజయలక్ష్మి, కృష్ణవేణి, పద్మ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో బిజెపిని ప్రత్యామ్నాయ పార్టీగా తీర్చిదిద్దడానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన, చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అలాగే అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆయన సూచించారు.

ఎండిన నీటి ప్రాజెక్టులు

ఫిరాయింపులతో నిండిన తెరాస : టిడిపి నేత రావుల చురక
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 10: ‘నీటి పారుదల ప్రాజెక్టులు ఎండిపోయాయి.. ఇతర పార్టీల నేతల ఫిరాయింపులతో తెరాస నిండిపోయింది’ అని తెలంగాణ టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి హరీశ్‌రావు కరవు సమస్యను పట్టించుకోకుండా, పరిపాలనను గాలికి వదిలేశారని, టిడిపి నాయకులను తెరాసలో చేర్చుకోవడానే్న వారు పనిగా పెట్టుకున్నారని ఆదివారం ఆయన విలేఖర్ల సమావేశంలో ధ్వజమెత్తారు. అధికారంలోకి రాగానే కోటి ఎకరాలకు నీరు అందిస్తామని ఎన్నికలకు ముందు తెరాస హామీ ఇచ్చిందని, అయితే భారీ, చిన్న నీటి పారుదల ప్రాజెక్టుల ద్వారా ఇప్పటికే 48 లక్షల ఎకరాలకు నీరు అందుతోందని రావుల తెలిపారు. ఇంకా రాష్ట్రంలో వివిధ దశల్లో ఉన్న 32 ప్రాజెక్టుల పనులు పూర్తి చేయడం ద్వారా అదనంగా 30 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని ఆయన పేర్కొంటూ, వీటిని కలుపుకునే కోటి ఎకరాలకు సాగు నీరు అందిస్తారా? లేక తెరాస అధికారం చేపట్టిన తర్వాత నిర్మించే నూతన ప్రాజెక్టుల ద్వారా కోటి ఎకరాలకు సాగు నీరు అందిస్తారా? అనేది స్పష్టం చేయాలన్నారు.
తెలంగాణలో కోటి 10 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి అందుబాటులో ఉండగా, ఇదివరకే పూర్తయిన ప్రాజెక్టుల ద్వారా 80 లక్షల ఎకరాలకు నీరు అందుతోందని వివరించారు. అధికారం చేపట్టిన రెండేళ్ల తర్వాత ప్రాణహిత-చేవెళ్ల బోగస్ అని ముఖ్యమంత్రి కెసిఆర్ అంటున్నారని, అప్పుడు దీనిపై అధ్యయనం చేయకుండా ఎన్నికల ప్రణాళికలో పెట్టారా? అని రావుల ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు లోగడ మహబూబ్‌నగర్ జిల్లాను దత్తత తీసుకుని ఏమి అభివృద్ధి చేయలేదని మంత్రి హరీశ్‌రావు చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ, చంద్రబాబు హయంలోనే బీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి 80 శాతం పనులు పూర్తి చేయించడం వాస్తవం కాదా? అని రావుల ప్రశ్నించారు.

తెరాస ప్రజాప్రతినిధులకు శిక్షణ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 10: తెరాస శిక్షణ శిబిరాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తారు. ఈ శిక్షణ శిబిరంలో హైదరాబాద్‌కు చెందిన కార్పొరేటర్లు, మేయర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారు. అలాగే 13వ తేదీన వరంగల్, కరీంనగర్, ఖమ్మం, రామగుండం మున్సిపల్ కార్పొరేటర్లకు శిక్షణ నిర్వహిస్తారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి తీసుకునే చర్యలను ఈ శిక్షణలో కెసిఆర్ వివరిస్తారు. విశ్వనగరంగా హైదరాబాద్ అభివృద్ధికి కార్పొరేటర్లు, శాసన సభ్యులు, మంత్రులు ఏం చేయాలో వివరిస్తారు.