రాష్ట్రీయం

ఏ గట్టున టీఆర్‌ఎస్ ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 19: పార్లమెంట్ ఎన్నికల్లోనూ అధికార టీఆర్‌ఎస్ పార్టీ తిరుగులేని అధిపత్యాన్ని చాటుకోనున్నట్టు దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్‌లో వ్యక్తమైనప్పటికీ, ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్‌కు అనుకూల పరిస్థితి లేదని తేలిపోయింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారే తిరిగి అధికారంలోకి వస్తుందని వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. దీంతో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశాలు లేనట్టేనని తేలిపోవడం వల్ల ఫెడరల్ ఫ్రంట్‌పై కేసీఆర్ పెట్టుకున్న ఆశలు, అంచనాలు ఆవిరైనట్టే పరిశీలకులు అంచనా వేస్తున్నారు. జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలకు దూరంగా ఉంటున్న ప్రాంతీయ పార్టీలు మేజారిటీ పార్లమెంట్ స్థానాలను గెలుచుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయులు కీలక భూమిక పోషించనున్నాయని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అంచనా వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రంలో ప్రాంతీయ పార్టీల మద్దతు ప్రభుత్వం ఏర్పాటుకు అనివార్యం అవుతుందని కేసీఆర్ అంచనా. బీజేపీ, కాంగ్రెసేతర కూటమిలతో జతకట్టకుండా స్వతంత్రంగా వ్యవహరించే ప్రాంతీయ పార్టీలన్నింటినీ తన నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంట్ వేదికపైకి తీసుకవచ్చి కేంద్రంలో చక్రం తిప్పాలని కేసీఆర్ భావించారు. ఈ రెండు జాతీయ పార్టీలకు సమదూరం పాటిస్తున్న ఒడిశాలోని బీజు జనతాదళ్ అధినేత, సీఎం నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీల కంటే ఆ రాష్ట్రాలో బీజేపీనే అత్యధిక స్థానాలు గెలుచుకోనున్నట్టు ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. అలాగే కర్నాటకలో కాంగ్రెస్‌తో జతకట్టిన జెడిఎస్ కంటే బీజేపీకే ఎక్కువ సీట్లు రానున్నట్టు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అయితే తమిళనాడులో మాత్రం ఫెడరల్ ఫ్రంట్‌తో కలిసి వస్తుందనుకున్న డిఎంకె పార్టీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. కేసీఆర్ ఆశలు పెట్టుకున్న ప్రాంతీయ పార్టీలలో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ నేతృత్వంలోని సమాజ్ వాది పార్టీ పరిస్థితి ఒక్కటే కాస్త ఆశాజనకంగా ఉన్నప్పటికీ అక్కడా బీజేపీకి సీట్లు తగ్గినా దానికే అధిపత్యం దక్కునున్నట్టు ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభంజనం అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా పార్లమెంట్ ఎన్నికల్లోనూ పునరావృత్తం కానున్నప్పటికీ, కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడం ఆయనకు చేదు వార్తే కానుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన ఫలితాలు పరోక్షంగా చాటి చెప్పాయి.