రాష్ట్రీయం

పనులు పరుగెత్తాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మే 19: కాళేశ్వరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి ఖరీఫ్ నాటికి సాగు నీటిని అందిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆదివారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలంలో చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. హెలికాప్టర్ ద్వారా కాళేశ్వరం చేరుకున్న సీఎం కేసీఆర్ రోడ్డు మార్గం ద్వారా కనె్నపల్లి పంప్ హౌస్ వరకు ప్రయాణించారు. కనె్నపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించిన ఆయన ఇంజనీరింగ్ అధికారులను ప్రశంసించారు. వీలైనంత త్వరగా ట్రయల్ రన్ మొదలుపెట్టాలని అధికారులకు సూచించారు. వెట్
రన్ ప్రారంభించడానికి సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. వర్షాకాలం ప్రారంభం కాకముందే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతాంగానికి సాగు నీరు అందించి తీరాలని సీఎం ఖరాఖండిగా తేల్చిచెప్పారు. 45 లక్షల ఎకరాలకు సాగు నీరందించే బృహత్తరమైన ప్రాజెక్టు విషయంలో అధికారులు మరింత జాగురుకతతో వ్యవహరించాలని సూచించారు. గోదావరి నది నుంచి రోజుకు మూడు టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ఆధికారులను ఆదేశించారు. ముందు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు వినియోగించాలని అన్నారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా మేడిగడ్డ ప్రాజెక్టుకు ఉదయం 11:30కు చేరుకున్నారు. అనుకున్న సమాయాని కంటే మూడు గంటలు ఆలస్యంగా మేడిగడ్డకు చేరుకున్నారు. మేడిగడ్డ వద్ద వ్యూ పాయింట్ వద్ద గోదావరి నది నీటిని ఆయన పరిశీలించారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజీ కమ్ రోడ్ బ్రిడ్జి మీదుగా కారులో మహారాష్ట్ర సరిహద్దు వరకు ప్రయాణించారు. తిరిగి మేడిగడ్డ ప్రాజెక్టు కార్యాలయ సమావేశ మందిరంలో ఇంజనీరింగ్ అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. పంప్ హౌస్‌ల నిర్మాణం, బ్యారేజీల నిర్మాణం ఎంత ముఖ్యమో వాటిని నడిపించడంలో అంతే శ్రద్ధ తీసుకోవాలని, అందుకు ముందస్తుగా ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద గేట్ల బిగింపు నత్తనడకన కొనసాగుతున్నదని ఎల్‌అండ్‌టీ గుత్త్తేదారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మహరాష్ట్ర సరిహద్దున భూ సేకరణ చేపట్టి కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పనకు మరింత బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను సకాలంలో పూర్తి చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు సమయానుకూలంగా చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ అవసరాలకు సాగు నీటిని అందించడం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని అన్నారు. వేసవి కాలంలో సైతం తీవ్రమైన ఎండలకు ప్రాజెక్టు పనులు చేస్తున్న కూలీలకు, ఇంజనీరింగ్ అధికారులకు సీఎం కృతఙ్ఞతలు తెలిపారు.
సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, కొరుకంటి చందర్, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్, కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ ఇన్ ఛీఫ్ నల్లా వెంకటేశ్వర్లు, ముఖ్యమంత్రి కార్యాలయం ఆదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు వాసం వెంకటేశ్వర్లు, దేవసేన, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్ చంద్, ఎస్పీ ఆర్ భాస్కరన్, ఎల్ అండ్ టీ సంస్థ ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

చిత్రాలు..కనె్నపల్లి పంప్‌హౌస్‌కు కాలినడకన కేసీఆర్
*మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ పనులపై వివరాలు అడిగి తెలుసుకుంటున్న కేసీఆర్