రాష్ట్రీయం

అద్వీతీయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయ నాయకుడికి ప్రధానంగా కావల్సింది పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని సాధించుకోగలికే సహనశీలత. ఆంధ్రప్రదేశ్‌లో అద్వితీయమైన విజయాన్ని ఇటు లోక్‌సభ ఎన్నికల్లోనూ అటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్‌రెడ్డి సాధించగలిగారంటే అందుకు కారణం గత పదేళ్లుగా ఆయన తన రాజకీయ బాటను పటిష్టమైన రీతిలో వ్యూహాత్మకంగా తీర్చిదిద్దుకోవడమే. ఒకదాని తరువాత ఒకటిగా కేసులు వెంటాడుతున్నా మొక్కవోని దక్షతతో ఆయన పదేళ్లూ శ్రమించారు. దాని ఫలితమే ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్‌కు అందించిన అసాధారణ విజయం. రాష్ట్ర రాజకీయాల్లో అతిచిన్న వయసులోనే ముఖ్యమంత్రి పదవిని అధిష్టించనున్న వ్యక్తిగా జగన్ మరో చరిత్రను సృష్టించబోతున్నారు. రాష్ట్రంలో దాదాపుగా అన్ని లోక్‌సభ స్థానాలను గెలుచుకోగలగడం అంటే మామూలు విషయం కాదు. అలాగే 175 స్థానాలున్న అసెంబ్లీని తిరుగులేని మెజారిటీ సాధించడం అంత సులువూ కాదు. తన పట్టుదల, అనుకున్నది సాధించాలన్న నిబద్ధత, మాటమీద నిలబడ గలిగే నిలకడతనమే ఆయుధాలుగా జగన్ జనంలోకి వెళ్లారు. దాదాపుగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను స్పృశిస్తూ అన్ని వర్గాలను ఆత్మీయతాయుత రీతిలో పలకరిస్తూ వేలాది కిలోమీటర్లు తన పాదయాత్రను జనరంజకంగా జగన్ మార్చుకోగలిగారు. ప్రజాస్వామ్యంలో జనం మెచ్చేనాయకుడే ప్రజానాయకుడు. తన నాయకత్వ పటిమ ఏమిటో జగన్మోహన్‌రెడ్డి అడుగడుగునా తన పాదయాత్రలు రుజువుచేసుకున్నారు. దేశ చరిత్రలో ఇంత సుదీర్ఘమైన పాదయాత్ర చేసిన నాయకుడు మరొకరు లేరంటే అతిశయోక్తి ఏమీ కాదు. ఎందుకంటే మన లక్ష్యం ఎంత ఉన్నతంగా ఉంటే అంత విస్తృతంగానూ దాన్ని సాకారం చేసుకునే ప్రయత్నాలు ఉండాలి. ముఖ్యంగా రాజకీయ నాయకులకు పట్టుదలతోపాటు అవకాశం వచ్చేవరకూ ఎదురుచూడగలిగే సహన శక్తి ఉండి తీరాలి. గత దశాబ్దకాలంగా ఈ రెంటినీ విడిచిపెట్టకుండా తగిన తరుణం కోసం పట్టుదలతో ఎదురుచూసిన జగన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అద్వితీయమైన విజయాన్ని సాధించి తన చిరకాల వాంఛ అయిన ముఖ్యమంత్రి పదవిని అందిపుచ్చుకోబోతున్నారు. 2014లోనే వైఎస్‌ఆర్‌సీపీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తుందన్న అంచనాలు వెలువడినప్పటికీ అధికారాన్ని అందుకోలేకపోయిన జగన్ 2019 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని తదేక దీక్షతో విజయం కోసం శ్రమించారు. ఏపీకి ప్రత్యేక హోదాయే అంతిమ లక్ష్యం అన్న మాట తప్పకుండా దానే్న బలంగా జనంలోకి తీసుకెళ్లి అఖిలాంధ్ర ప్రజల ఆత్మీయ నాయకుడిగా మారారు. ఒక నాయకుడు అధినేతగా మారాలంటే అందుకు ప్రధానంగా కావల్సింది విధానపరమైన నిబద్ధత. అది తన ఆరో ప్రాణమన్న విషయాన్ని మడమ తిప్పకుండా జగన్ రుజువు చేసుకుంటునే వచ్చారు. రాష్ట్రంలో ఏ పార్టీతోనూ పొత్తులేకుండా ఒంటరిగా వైఎస్‌ఆర్‌సీపీని అధికార తీరాలు చేర్చిన నాయకత్వ పటిమ జగన్‌దేనని చెప్పవచ్చు. ముఖ్యంగా ఓ పక్క తనపై మోపిన కేసులు మానసికంగా కుంగదీస్తున్నా రాజకీయ లక్ష్యాల సాధన విషయంలో జగన్ ఎంతమాత్రం వెరవలేదని చెప్పడానికి ఆయన నిరుపమాన రీతిలో సాగించిన కృషే నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల చరిత్రలో వైఎస్ జగన్ విజయం తలమానికం. ఇటు అసెంబ్లీ అటు లోక్‌సభ ఎన్నికల్లోనూ పదేళ్లు కూడా నిండని పార్టీని నిరుపమాన రీతిలో విజయపథంలో నడిపించడం ఒక్క వైఎస్ జగన్‌కే చెల్లింది. ఇది మాటల్లో వర్ణించలేని రీతిలో ఆయనకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందించిన విజయవరమాల!