రాష్ట్రీయం

మట్టికరచిన టీడీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నలభై సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై చెరగని ముద్రవేసి చంద్రగిరి నుంచి ఢిల్లీ దాకా అపరచాణక్యనీతితో ఉన్నత స్థాయికి ఎదిగిన మహానేత చంద్రబాబునాయుడు. రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదు. ఎన్నికల్లో గెలుపు, ఓటములు సమానంగా తీసుకోవాలి. 1982లో కాంగ్రెస్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడేందుకు సినిమా రంగాన్ని వదిలి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చిన ధీరుడు ఎన్టీరామారావు. సరిగ్గా 37 ఏళ్ల తర్వాత ఇప్పుడు టీడీపీ తీవ్రమైన రాజకీయ ఆటుపోటులకు లోనైంది. ఎవరూ ఊహించని విధంగా ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల్లో చిత్తుగా ఓటమి పాలైంది. దీనికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అనుసరించిన విధానాలే కారణమని చెప్పవచ్చు.
టీడీపీ చరిత్రను విశే్లషిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1983 అసెంబ్లీ ఎన్నికల్లో విజయబావుటా ఎగురువేసింది. కాంగ్రెస్ తుత్తునియలైంది. 1984లో టీడీపీ నేత నాదెండ్ల భాస్కరరావుతిరుగుబాటు చేశారు. కాగా పార్టీ కలుషితమైందని భావించిన ఎన్టీఆర్ అసెంబ్లీనిరద్దు చేసి 1985లో తాజా ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో టీడీపీ మంచి మెజార్టీతో గెలిచింది. ఆ తర్వాత 1989 ఎన్నికల్లో ఎన్టీఆర్ నేతృత్వంలో టీడీపీ కాంగ్రెస్ చేతిలో ఓటమి చెందింది. 1994-95 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఎన్టీఆర్ నాయకత్వంలో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచింది. 1995లో చంద్రబాబు ఎమ్మెల్యేలను కూడగట్టుకుని తిరుగుబావుటా ఎగురవేశారు. ఆగస్టు సంక్షోభంలో ఎన్టీఆర్‌ను పదవీచ్యుతిడిని చేశారు. ఇక అప్పటి నుంచి చంద్రబాబుకు అడ్డు లేదు. 1999 ఎన్నికల్లో బీజేపీతో జతకట్టి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రెండవసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 1999లో బీజేపీతో జతకట్టారు. కాని 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ వరుస పరాజయాలను చవి చూసింది. పదేళ్లలో అధికారానికి దూరమైనా చంద్రబాబునాయుడు పార్టీని ఏకతాటితో నడిపించాడు. ఎంతో మంది పార్టీని వీడినా మనోధైర్యాన్ని కోల్పోకుండా పార్టీ శ్రేణులతో నిరంతరం సంబంధాలు కలిగి ఉండే అతి తక్కువ మంది నేతల్లో చంద్రబాబు ఒకరు. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నవ్యాంధ్ర ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. అప్పటికే హైదరాబాద్‌లో 1995 నుంచి 2004 మధ్య ముఖ్యమంత్రిగా చంద్రబాబు హైటెక్ సిటీ నిర్మాణం, హైదరాబాద్ అభివృద్ధి చేసిన విషయం విదితమే. దీంతో ఆంధ్ర ప్రజలు చంద్రబాబు మీద అభిమానంతో 2014 ఎన్నికల్లో గెలిపించారు.
చంద్రబాబు విలక్షణమైన వ్యక్తి. పోరాటాల్లో అలిసిపోరు. 24 గంటల రాజకీయవేత్త. మరో వ్యాపకం ఉండదు. 1996లో యునైటెడ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసిన కన్వీనర్‌గా ఉండి ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పారు. అప్పటి నుంచి చంద్రబాబు పేరు దేశ వ్యాప్తంగా మార్మోగింది. చంద్రబాబును ప్రత్యర్థి పార్టీల్లోని నేతలు కూడా అభిమానిస్తారు. రాజకీయంగా ప్రత్యర్థులను చిత్తు చేయడంలో దిట్ట. చంద్రబాబు మంచి వక్త కాదు. కాని వ్యూహకర్త. హిందీ, ఇంగ్లీషు భాషలు వచ్చి ఉంటే నిజంగా జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు రాణించి ఉండేవారని ప్రతీతి. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీరామారావు కూడా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు. 1989 ఎన్నికల్లో టీడీపీకి ఉమ్మడి ఆంధ్రాలో 30 సీట్లు వస్తే ప్రతిపక్ష పార్టీగా లోక్‌సభలో ఆవిర్భవించిన విషయం విదితమే.
తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా కేంద్రానికి లేఖను ఇచ్చిన చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం పేరుతో జనంలో గందరగోళం సృషించారు. ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కచ్చితంగా కట్టుబడి ఉండకపోవడం చంద్రబాబు బలహీనత. దీనివల్లనే టీడీపీ తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందింది.
కాంగ్రెస్ వ్యతిరేకత పునాదిగా ఉన్న టీడీపీ చివరకు కాంగ్రెస్‌తో జట్టుకట్టి చట్టాపట్టాలేసుకుని తిరగడం కూడా టీడీపీ ఆంధ్రా ఎన్నికల్లో ఓటమికి కారణమని చెప్పవచ్చు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. హైటెక్ సిటీ నిర్మాణంతో పాటు తనకు ఉన్న రాజకీయానుభవంతో కొత్త రాజధాని నిర్మాణం చేసి ఆంధ్ర రాష్ట్రానికి వైభవం తెస్తారని ప్రజలు ఆశించారు. దానికి తగ్గట్టుగానే అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేశారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేన అధ్యక్షుడు పవన్ గాలితో అధికారంలోకి చంద్రబాబు వచ్చినా తమ ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించలేకపోయారని ప్రజలు భావించారు. నిధుల కొరత, కేంద్ర సహాయం అంతంతమాత్రమే ఉండడం, దీనికితోడు ప్రజల ఆకాంక్షలు విపరీతంగా ఉండడం కూడా చంద్రబాబు ఓటర్ల అభిమానాన్ని చూరుకోలేకపోయారని చెప్పవచ్చు. కేంద్రంతో అనవసరంగా ఘర్షణ పడడం, ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం కూడా టీడీపీ ఓటమికి కారణమని చెప్పవచ్చును.
ప్రధాని మోదీతో, బీజేపీతో పెరిగిన అగాధంతో చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిశారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి టీడీపీ పోటీ చేసింది. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ కారణమని ఆంధ్ర ప్రజలు నమ్మారు. వారికి ఆ పార్టీ అంటే తీవ్రవ్యతిరేకత ఉంది. దీంతో చంద్రబాబు ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌తో కరచాలనం చేయడం, వేదికలను పంచుకోవడం, సోనియాగాంధీతో మంతనాలు, చర్చలను ఆంధ్ర ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఇవన్నీ కూడా టీడీపీకి ఓటమికి కారణమని చెప్పవచ్చు. చంద్రబాబు తర్వాత పార్టీలో రెండవ ప్లేస్ ఎవరికీ లేకపోవడం, అన్నీ తానై పార్టీని నడిపించడం కూడా చంద్రబాబుకు కత్తిమీదసాముగా పరిణమించింది.
2019 ఎన్నికల్లో లోక్‌సభ స్థానాల్లో భారీగా నష్టపోయంది. అసెంబ్లీ ఎన్నికల్లో పాతిక సీట్లు రావడమే గగనమైపోయంది. పార్టీ సిద్ధాంతాలను గాలికి వదిలేసి అధికారమే పరమావధిగా రాజకీయాలు చేస్తే కొంతకాలం పదవులు వరించవచ్చు. కాని దీర్ఘకాలంలో ఆ పార్టీ పతనమవుతుందని చెప్పేందుకు టీడీపీకి ఎన్నికల్లో ఎదురైన ఓటమినే ఉదాహరణ. తెలుగుదేశం పార్టీకి పటిష్టమైన కేడర్‌ను చంద్రబాబు నిర్మించారు. ఈ తరహా యంత్రాంగం దేశంలో ఏ పార్టీకి లేదు.
చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌ను మంగళగిరి నుంచి పోటీకి నిలబెట్టి రాజకీయంగా వ్యూహాత్మకంగా తప్పిదం చేశారని చెప్పవచ్చును. అన్ని ఇజాలకు నిలమయైన మంగళగిరిలో లోకేష్ గెలుస్తారని భావించడం తప్పు. తమ సామాజికవర్గం బలంగా ఉన్న నియోజకవర్గమో, లేక మరో సురక్షిత నియోజకవర్గమో ఎంపిక చేసుకుని ఉంటేబాగుండేది. ఊరందరికీ జాతకం చెప్పే బల్లి కుడితలో పడినట్లుగా చంద్రబాబు పరిస్థితి తయారైంది. 1983 నుంచి 2019 ఎన్నికల వరకు అనేక ఓటములను, గెలుపులను ఎదుర్కొన్న టీడీపీ ఈ రోజు సిద్ధాంతపరంగా దివాళాకోరు విధానాలను అవలంభించి చిత్తుగా ఓడిపోయింది. ఈ ఓటమి నుంచి టీడీపీ గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు అనుసరించిన విధానాలు వాంచనీయం కాదు. ఎన్నికల సంఘంతో కూడా సంఘర్షణకు దిగారు. ఈ విమర్శలు ఎన్ని ఉన్నా చంద్రబాబు రాజకీయంగా తన జీవితాన్ని కొనసాగించేందుకు అవసరమైన స్పేస్ చాలా ఉంది. చంద్రబాబు అధికారం కోల్పోవచ్చు. కాని రాజకీయంగా తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాలి. టీడీపీలో అంతర్మథనం జరగాల్సిన తరుణం ఆసన్నమైంది.