రాష్ట్రీయం

ఇంజనీరింగ్‌లో 74.39% ఉత్తీర్ణత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 4: ఎట్టకేలకు ఏపీ ఎంసెట్ ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి కే. దమయంతి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ విజయరాజు, ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు, కమిటీ చైర్మన్, జేఎన్‌టీయు(కె) వైస్ చాన్సలర్ రామలింగరాజు ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 20 నుంచి 24 వరకూ జేఎన్‌టీయు(కె) ఆధ్వర్యంలో ఎంసెట్-2019ను నిర్వహించడం తెలిసిందే. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడిలో చోటు చేసుకున్న గందరగోళం కారణంగా ఏపీ ఎంసెట్ ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం జరిగింది. ఫలితాల వెల్లడిలో జాప్యంపై విమర్శలు చోటు చేసుకుంటన్న నేపథ్యంలో హడావుడిగా మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఫలితాలకు సంబంధించిన వివరాల గురించి మీడియాకు విజయరాజు వివరించారు. వరుసగా మూడోసారి పూర్తిగా ఆన్‌లైన్‌లో పరీక్ష విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. 40 మార్కులను కనీస అర్హత మార్కులుగా పరిగణించామన్నారు. ర్యాంక్ నిర్ధారించేందుకు ఎంసెట్ మార్కులను 75 శాతం వెయిటేజీగా, ఇంటర్ మార్కులను 25 శాతం వెయిటేజీగా తీసుకున్నామని వెల్లడించారు. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 1.95 లక్షల మంది దరఖాస్తు చేయగా, 1.85 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారన్నారు. 1,38,160 మంది అర్హత సాధించారని, 74.39 శాతం మేర అర్హత సాధించినా, 1,22,188 మందికి మాత్రమే ర్యాంక్‌లను కేటాయించారు. ఎంసెట్‌లో ఉత్తీర్ణులైనప్పటికీ, ఇంటర్‌లో ఉత్తీర్ణులు
కాని వారు 12,874 మంది ఉన్నారు. ఇంజనీరింగ్‌లో 82,088 మంది బాలురు, 56,072 మంది బాలికలు అర్హత సాధించారు.
అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ విభాగానికి సంబంధించి 86,986 మంది దరఖాస్తు చేయగా 81,916 మంది పరీక్ష రాశారు. వీరిలో 68,512 మంది అర్హత సాధించారు. 83.64 శాతం మేర అర్హత సాధించారు. ఎంసెట్‌లో అర్హత సాధించినప్పటికీ, ఇంటర్‌లో ఉత్తీర్ణులు కాని వారు 3152 మంది ఉన్నారు. ఈ విభాగంలో 22,946 మంది బాలురు, 45,566 మంది బాలికలు అర్హత సాధించారు. ఇతర బోర్డుల నుంచి ఎంసెట్ ఇంజనీరింగ్‌కు 3067 మంది, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్‌కు 2153 మంది హాజరయ్యారు. కానీ ఇంటర్ మార్కులు అందచేయకపోవడం వల్ల వారికి ర్యాంక్‌లు కేటాయించలేదు. ఫలితాలు విడుదలైన తరువాత దరఖాస్తులో పేర్కొన్న మొబైల్, ఈమెయిల్‌కు ర్యాంక్‌ల వివరాలు పంపామని తెలిపారు. జూన్ 10 నుంచి ర్యాంక్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. విద్యార్థుల ఆన్‌లైన్ జవాబుపత్రాలను ఆయా అభ్యర్థుల మెయిల్‌కు పంపామని తెలిపారు. త్వరలోనే ప్రవేశాలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపారు.
261 అభ్యంతరాలు
ఎంసెట్‌లో వివిధ సబ్జెక్టుల ప్రశ్నలు, సమాధానాలపై 261 అభ్యంతరాలు వచ్చాయి. గణితంలో 82, ఫిజిక్స్‌లో 66, కెమిస్ట్రీలో 59, బాటనీలో 38, జువాలజీలో 16 అభ్యంతరాలు వచ్చాయి. ఇంజనీరింగ్ విభాగంలో ఏడు సెషన్స్‌కు సంబంధించి 139 ప్రశ్నలకు నిపుణుల సలహా మేరకు 10 ప్రశ్నలకు ఆప్షన్ మార్పు చేయగా, 10 ప్రశ్నలకు మల్టిపుల్ ఆప్షన్ ఇచ్చారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో మూడు సెషన్స్‌కు సంబంధించి 41 ప్రశ్నలకు నిపుణుల సూచన మేరకు 3 ప్రశ్నలకు ఆప్షన్లు మార్పు చేయగా, ఒక ప్రశ్నకు మల్టిపుల్ ఆప్షన్ ఇచ్చారు.
చిత్రం... ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల చేస్తున్న ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కే దమయంతి తదితరులు