రాష్ట్రీయం

సమస్యలపై పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 11: అధికారం ముఖ్యం కాదు.. అభివృద్ధి, పేదల సంక్షేమమే లక్ష్యం.. శాసనసభ వేదికగా ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై పోరాడి, ప్రజల్లోకి తీసుకువెళదామని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. మంగళవారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయన అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో పార్టీ కార్యకర్తలు, నాయకులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలను ఖండిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది. కార్యకర్తల రక్షణ కోసం టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దాడులు, అక్రమ కేసులను నిలిపివేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, ఈనెల 15వ తేదీన జరిగే పార్టీ వర్క్‌షాప్‌లో ఇందుకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలని తీర్మానించింది. శాసనసభ సమావేశాల సందర్భంగా బుధవారం పార్టీ ఎమ్మెల్యేలంతా పచ్చచొక్కాలతో పార్టీ అధినేత చంద్రబాబు నివాసం నుంచి బయల్దేరి వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం శాసనసభ ప్రాంగణానికి చేరుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకత్వ సామర్థ్యం తేటతెల్లమవుతుందన్నారు. పార్టీ, ప్రజల పట్ల బాధ్యతను తప్పక నెరవేర్చాల్సి ఉందన్నారు. కార్యకర్తలు, నాయకుల్లో ఆత్మవిశ్వాసం పెంచి మనోధైర్యం కల్పించాలన్నారు. సమస్యల పరిష్కారంపై పోరాట పటిమను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్దేశించారు. గత 15 రోజుల్లో అనంతపురం, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం, గుంటూరు జిల్లా గురజాల, నరసరావుపేట, వినుకొండ నియోజకవర్గాలు, ఇతర ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేస్తున్నారని, వీటిని ప్రతిఘటించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో పార్టీ తరుపున ఏం చేయాలనే దానిపై సమాచారం నేరుగా తెలిసే వీలు కలుగుతుందన్నారు. రాష్ట్రం, ప్రజల కోసం పట్టుదలతో పోరాడదాం.. హక్కుల సాధనే తెలుగుదేశం పార్టీ లక్ష్యం.. గత 37 ఏళ్లలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నాం.. తరువాత అనేక అవమానాలు భరించాం.. రాజీవ్‌గాంధీ హత్య దరిమిలా విశాఖ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఎన్టీఆర్‌కు ఎదురైన అవమానాలను గుర్తుంచుకోవాలన్నారు. అన్నిటినీ తట్టుకుని నిలబడగలిగామంటే అది రాష్ట్రం, ప్రజల కోసం పట్టుదలతో పోరాడటం వల్లనే అన్నారు. పేదల సంక్షేమం కోసం, హక్కుల సాధన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. శాసనసభకు ఎన్నికైన 23 మంది కలసికట్టుగా, పట్టుదలతో పనిచేయాలన్నారు. పార్టీ చరిత్రలో కొన్ని సందర్భాలలో గెలిచాం..మరికొన్ని సందర్భాల్లో ఓటమి చవి చూశాం.. అయితే ఎన్నడూ లేనిది ఈ సారి ఓటమిని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారని స్పష్టం చేశారు. అందరిలో సానుభూతి, స్పందన, ఆవేదన కనిపిస్తోందన్నారు. రుణమాఫీ 4,5 కిస్తీల కింద రూ. 10 వేల కోట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రస్తుత ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. తనను కలిసే రైతులు, రైతు కుటుంబాల మహిళలు ఇదే విషయమై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రైతు భరోసా రబీకి ఇవ్వడం వల్ల ఖరీఫ్ కష్టాల నుంచి రైతులెలా గట్టెక్కుతారని ప్రశ్నించారు. భవిష్యత్ ఉందంటేనే రాష్ట్రానికి ఎవరైనా పెట్టుబడులకు వస్తారని అభద్రత పెంచి శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తే ఎలా వస్తారన్నారు. సాగునీటి కొరత లేకుండా చేసేందుకు అన్ని ప్రాంతాల్లో ప్రాజెక్టులు చేపట్టామని, వైఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్ట్‌లను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేశామని, కొన్ని చివరి దశకు చేరుకున్నాయని వివరించారు. దీనివల్ల రాయలసీమ, ఉత్తరాంధ్ర సాగు, తాగునీటి అవసరాలు తీరాయన్నారు. అవగాహన లేకపోవటం, తప్పుడు మాటలు వినడం, టీడీపీపై బురదచల్లటమే వైసీపీ త్రిసూత్రాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనులైనా, రాజధాని అభివృద్ధి అంశమైనా ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ఇదే విధంగా వ్యవహరించటం వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందన్నారు. దీన్ని శాసనసభ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, గంటా శ్రీనివాసరావు, రామానాయుడు, నారా లోకేష్, కరణం బలరాం, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, వీరాంజనేయులు, నందమూరి బాలకృష్ణ, మద్దాళి గిరి, సాంబశివరావు, వల్లభనేని వంశీ, ఆదిరెడ్డి భవానీ, గణబాబు, గద్దె రామ్మోహన్‌రావు, జోగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... టీడీఎల్పీ సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు