రాష్ట్రీయం

యాసంగి రైతుబంధు బకాయిలు హుళక్కేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం అధికారుల నిర్లక్ష్యం వల్ల పూర్తిగా అమలుకు నోచుకోవడం లేదు. 2018-19 యాసంగి పంటకు సంబంధించి దాదాపు 10 లక్షల మంది రైతులకు సుమారు వెయ్యికోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. 2018 ఖరీఫ్ సీజన్‌లో రైతుబంధు డబ్బు అందుకున్న రైతుల్లో చాలా మందికి 2018-19 యాసంగిలో డబ్బు రాలేదు. వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓ), వ్యవసాయ అధికారులు పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు పంపించినప్పటికీ, ఉన్నతస్థాయిలో నిధుల చెల్లింపు జరగడం లేదు. రైతులందరికీ రైతుబంధు పథకం ద్వారా పంటలకోసం పెట్టుబడి సాయం అందిస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్, వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రకటిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. 2018 యాసంగికి సంబంధించిన రైతుబంధు పథకం కింద రావాల్సిన బకాయిల కోసం రైతులు చెప్పులరిగేలా వ్యవసాయ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఏఈఓలు, ఏఓలు ఈ విషయంలో ఏమీ చేయలేకపోతున్నారు. రైతుల వత్తిడి వీరు తట్టుకోలేకపోతున్నారు. బ్యాంక్ అకౌంట్‌నెంబర్లు సరిగ్గా లేవని ఒకసారి, ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని మరోసారి అధికారులు సమాధానం చెబుతున్నారు. 2018-19 యాసంగి సీజన్‌కు దాదాపు వెయ్యికోట్ల రూపాయలు రైతులకు చెల్లించాల్సి ఉందని తెలిసింది. ఆర్థిక శాఖ రైతుబంధు డబ్బు పూర్తిగా విడుదల చేయడం లేదని తెలిసింది. రైతులెవరికైనా 2018-19 యాసంగిలో డబ్బురాకపోతే వారికి బకాయిలు చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తామంటూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కే. రామకృష్ణారావు స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఈ అంశం ఆయన దృష్టికి తీసుకురాగా, బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇలా ఉండగా 2018 ఖరీఫ్, 2018-19 రబీ సీజన్లకు సంబంధించి రైతుబంధు పథకం అమలు విజ్ఞప్తులను పరిశీలించడం కుదరదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి పేరుతో ఒక ప్రకటన తాజాగా జారీ అయింది. రైతుబంధు అమలు అంశంపై ఆయన సోమవారం ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. ఆ తర్వాత విడుదల చేసిన అధికారిక ప్రకటనలో రైతుబంధు బకాయిలను చెల్లించేది లేదని ఖరాఖండిగా తెలిపారు. 2018-19 రైతుబంధు పూర్తి చేయకుండానే 2019 వానాకాలం (ఖరీఫ్) రైతుబంధు పథకం అమలు చేయడం ప్రారంభించారు. యాసంగిలో డబ్బురాని రైతులు అసంతృప్తితో ఆందోళనకు గురవుతున్నారు.