రాష్ట్రీయం

మాటల యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 13: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రెండో రోజే అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారామ్ ఎన్నిక అనంతరం అభినందనలు తెలిపే సందర్భంగా ఇరు పక్షాలు పరస్పర దూషణలకు దిగాయి. పార్టీ ఫిరాయింపులు, సభా సంప్రదాయాలు తదితర అంశాలపై విమర్శలు చేసుకున్నాయి. వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో వేడి పుట్టించాయి. ఒక దశలో ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తాము ఎమ్మెల్యేలమా బంట్రోతులమా చెప్పాలని డిమాండ్ చేశారు. తమ్మినేనిని అభినందిస్తూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో తమ ఎమ్మెల్యేలను సంతల్లో పశువుల్లా కొనుగోలు చేశారని ఆరోపించారు. దీనిపై స్పీకర్ చర్య తీసుకోలేదని, పైగా వారికి 4 మంత్రి పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. సభ్యులు అంబటి రాంబాబు, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన స్పీకర్‌ను ఆ స్థానంలో కూర్చోపెట్టేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు రాలేదని, ఇదెక్కడి సంప్రదాయమని ప్రశ్నించారు. గతంలో కోడెల స్పీకర్‌గా ఎన్నికైనప్పుడు తమ నేత జగన్ కూడా వెళ్లారని గుర్తు చేశారు. ఈ విమర్శలపై చంద్రబాబు స్పందిస్తూ.. తొలి ప్రసంగంలోనే జగన్ ఇలా మాట్లాడటం మంచి పద్ధతి కాదన్నారు. ప్రతిపక్షాన్ని కించపరిచేలా ముఖ్యమంత్రి ప్రసంగం ఉన్నదని అన్నారు. 1978లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన నాలుగు రోజుల్లోనే పార్టీ మారారని గుర్తు చేశారు. అప్పట్లో భాట్టం శ్రీరామ్మూర్తి జగన్ కంటే ఎక్కువ ఘాటుగా విమర్శించారని.. ఆ చరిత్రను ఒక్కసారి చూసుకోవాలని, తండ్రికి వారసులనేవారు ఈ సంగతి గుర్తు పెట్టుకోవాలన్నారు. మీ తండ్రి చేసింది తప్పు అని ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. అధికార పక్షం సంప్రదాయాలు పాటించకపోయినా, తాము పాటిస్తామన్నారు. సభాపతిగా తమ్మినేని పేరు ప్రకటిస్తున్నారని తెలిసి, బుధవారం రాత్రి వరకూ వేచి ఉన్నామన్నారు. ప్రతిపక్ష నేతను కూడా ఆహ్వానిస్తే బాగుండేదన్నారు. గతంలో స్పీకర్‌ను ఎంపిక చేశాక అభ్యర్థిత్వాన్ని బలపరిచేందుకు మంత్రులను జగన్ వద్దకు పంపించామని గుర్తుచేశారు. కోడెల అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ జగన్ సంతకం కూడా చేశారన్నారు. దీనిపై జగన్ స్పందిస్తూ, హత్యలు చేసేవాడిని హత్య చేయడం తప్పు కాదని చెప్పేలా చంద్రబాబు మాటలు ఉన్నాయన్నారు. గతంలో విపక్ష ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుని, ఆ తప్పు ఒప్పుకోకుండా అనవసర విషయాలు చెప్పడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. అవకాశం ఇస్తే, చంద్రబాబు గురించి పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ అన్న మాటలను సభలో వినిపిస్తానంటూ బదులిచ్చారు. ప్రొటెం స్పీకర్ చిన అప్పలనాయుడు స్పీకర్‌ను ఆ స్థానంలో కూర్చోపెట్టేందుకు అన్ని పార్టీల నాయకులను ఆహ్వానించారని గుర్తు చేశారు. అందరి ముందు జరిగిన ఈ సంఘటనను చంద్రబాబు వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష నేత సంప్రదాయాలను పాటించకుండా తమ బంట్రోతును పంపారని ఆరోపించారు. దీంతో సభలో వేడి పెరిగింది. ఇరుపక్షాలు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు.
పిలవని పేరంటానికి వెళ్లాలా?: చంద్రబాబు
చంద్రబాబు తన బంట్రోతును పంపారంటూ చెవిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ ఎన్నికకు సంబంధించి తమకు ఎటువంటి సమాచారం చెప్పలేదన్నారు. అయినప్పటికీ గౌరవంతో తమ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అచ్చెన్నాయుడిని పంపానన్నారు. ఇప్పుడు కూడా విపక్ష నేతను పిలువలేదన్నారు. తనను పిలువకుండా స్పీకర్ స్థానం వరకూ ఎలా వస్తానని, పిలవని పేరంటానికి వెళ్లాలా అని ప్రశ్నించారు. తనను పిలవలేదని రికార్డులు చూడాలన్నారు. బంట్రోతు అంటూ అహంభావంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
దీనిపై మరోసారి జగన్ స్పందిస్తూ, ప్రొటెం స్పీకర్ ఆహ్వానాన్ని మన్నించాల్సింది పోయి తనకు బొట్టూ, చీర పెట్టలేదు, శాలువా కప్పలేదు అంటూ చంద్రబాబు మాట్లాడటం తనకు ఆశ్చర్యాన్ని కల్గిస్తోందన్నారు. తప్పును కప్పిపుచ్చుకునేందుకు వాళ్ల సభ్యులతో ఏవేవో చెప్పిస్తున్నారన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉందన్న చంద్రబాబు ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. ఈ విషయాన్ని ఇంతకన్నా సాగదీయనని, వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు.

ఎమ్మెల్యేలమా.. బంట్రోతులమా?
తాము ఎమ్మెల్యేలమా.. బంట్రోతులమా చెప్పాలంటూ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సభలో ప్రశ్నించారు. తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అచ్చెన్నాయుడికి మద్దతుగా మిగిలిన టీడీపీ సభ్యులు కూడా లేచి తమ నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ వారిస్తున్నా, తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బంట్రోతు అని అనలేదని, బంట్రోతులాగా అన్నారని వైకాపా నేతలు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. స్పీకర్ జోక్యం చేసుకుని, రికార్డులు పరిశీలించి, ఆ పదం వాడి ఉంటే తొలగిస్తామని ప్రకటించారు. స్పీకర్ ప్రకటనకు చంద్రబాబు కూడా మద్దతు పలకడంతో వివాదం సద్దుమణిగింది. అంతకుముందు ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గతంలో స్పీకర్ ఎన్నిక సమయంలో కోడెల అభ్యర్థిత్వాన్ని జగన్ బలపరిచిన వైనాన్ని అసెంబ్లీ రికార్డుల్లో ఉన్న వివరాలను చదివి వినిపించారు.

చిత్రాలు.. స్పీకర్ స్థానంలో ఆశీనులయ్యే ముందు ముఖ్యమంత్రికి అభివాదం చేస్తున్న తమ్మినేని సీతారాం
*టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు *వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి