రాష్ట్రీయం

20న ముఖ్యమంత్రి ‘పోలవరం’ పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి మొట్టమొదటిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ మేరకు ఆయన ఈ నెల 20న పోలవరం పనులను క్షేత్ర స్థాయిలో సందర్శించి అధికారులతో సమీక్షించనున్నారు. పోలవరం హెడ్‌వర్క్సు పనులు జరుగుతున్న పోలవరం ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. దీనితో అధికారులు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. ముఖ్యమంత్రి సమీక్షకు ముందుగానే రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి పి అనిల్‌కుమార్ పోలవరం చేరుకోనున్నారు. 18వ తేదీ రాత్రికి పోలవరం చేరుకుని, 19వ తేదీ ఉదయం నుంచి క్షేత్ర స్థాయిలో సందర్శించి, అనంతరం అధికారులతో సమీక్షించి ముఖ్యమంత్రి వచ్చే సమయానికి నివేదికతో సిద్ధంగా ఉండేవిధంగా ఏర్పాట్లుచేసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ తన పర్యటనలో ప్రధానంగా పోలవరం పనుల పురోగతి, ఎవరెవరు అధికారులు పనిచేస్తున్నారు, ఇప్పటివరకు చేపట్టిన పునరావాసం, చేయాల్సిన పునరావాసం తదితర అంశాలపై దృష్టిసారించనున్నట్టు సమాచారం. పోలవరం కాఫర్ డ్యామ్ నిర్మాణం వల్ల ముంపునకు గురయ్యే గ్రామాలకు
తక్షణం అందించాల్సిన పునరావాస చర్యలపై ప్రధాన దృష్టి కేంద్రీకరించనున్నారు. పునరావాసం కల్పించడంలో లోపాలు, నష్టపరిహారం పంపిణీలో కొంతమంది అధికారుల చేతివాటం తదితర అంశాలపై ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి పలు ఫిర్యాదులు వెళ్లినట్టు సమాచారం. వీటన్నింటిపై కూడా ప్రధానంగా దృష్టిసారించనున్నట్టు సమాచారం. పోలవరం పనులు, నిధుల రీయింబర్స్‌మెంట్, పునరావాస నిధులు, భూముల నష్టపరిహారం తదితర అంశాలపై దృష్టికేంద్రీకరించనున్నట్టు సమాచారం. కాఫర్ డ్యామ్ నిర్మాణంవల్ల నష్టపోతున్న గ్రామాల్లో తక్షణం చేపట్టాల్సిన పునరావాస చర్యలపై కూడా చర్చించనున్నట్టు తెలిసింది.
తూర్పు గోదావరి జిల్లాలో 35 గ్రామాలు ఇటు కాఫర్ డ్యామ్ వల్ల, అటు వరదల వల్ల ముంపునకు గురవుతున్నట్టు తేలింది. ముఖ్యమంత్రి జగన్ పర్యటన నేపధ్యంలో అధికారులు ఇప్పటికే దీనిపై ఒక నివేదిక రూపొందించారు. ప్రధానంగా పునరావాస కాలనీల నిర్మాణం, 39 మీటర్ల కాంటూరులో ముంపునకు గురయ్యే గ్రామాల పరిస్థితిపై నివేదిక సిద్ధంచేశారు. దేవీపట్నం మండలంలో మొత్తం 42 గ్రామాలు ముంపునకు గురవుతుంటే, అందులో 7 గ్రామాలు హెడ్‌వర్క్సులో ఇప్పటికే ఖాళీ చేయించారు. 24.50 మీటర్ల కాంటూరులో వున్న నేలకోట గ్రామానికి నేలకోటలో ఆర్ అండ్ ఆర్ కాలనీ నిర్మించి పునరావాసం కల్పించారు. 38.34 కాంటూరు పరిధిలో డి రావిలంక, 38.40 మీటర్ల కాంటూరు పరిధిలో పరగసానిపాడు, 29.77 మీటర్ల కాంటూరు పరిధిలో అంగుళూరు, 26.30 మీటర్ల కాంటూరు పరిధిలో వీరవరంలంక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. డి రావిలంక, పరగసానిపాడు గ్రామాలకు పెదభీమునిపల్లి మోడల్ కాలనీ 1లోను, అంగుళూరు గ్రామానికి అంగుళూరు వద్ద, వీరవరం లంక గ్రామానికి 38.40 కాంటూరు పరిధిలో ముంపునకు గురవుతున్న డి రావిలంక, పరగసానిపాడు గ్రామాలకు పునరావాస కాలనీలు నిర్మించారు. ఇప్పటి వరకు నేలకోట, డి రావిలంక, పరగసానిపాడు, అంగుళూరు, వీరవరం లంక గ్రామాలకు పునరావాసం పూర్తిస్థాయిలో అయింది. 24.95 కాంటూరు పరిధిలో మునుగుతున్న తొయ్యేరుకు ముసళ్లకుంట, 27.59 కాంటూరులో మునుగుతున్న పెనికెలపాడుకు, 34.58 మీటర్ల కాంటూరులో మునుగుతున్న మడిపల్లి గ్రామాలకు పెద్ద్భీమనపల్లి కాలనీ 2లోనూ పునరావాస కాలనీలు నిర్మిస్తున్నారు. 38.50 మీటర్ల కాంటూరు పరిధిలో అగ్రహారం, ఏనుగులగూడెం, మంటూరు, మూలమెట్ట, మెట్టువీధి తదితర గ్రామాలకు పునరావాస కాలనీల నిర్మాణం జరుగుతోంది. కాలనీలు పూర్తిచేసి నిర్వాసితులందరికీ శాశ్వత పునరావాసం కల్పించాల్సి వుంది.