ఆంధ్రప్రదేశ్‌

రాజధాని ప్రాంతంలో మళ్లీ భూముల వర్గీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 12: అమరావతి రాజధాని ప్రాంతంలోని భూములను భూసమీకరణ, భూసేకరణ చట్టం కింద మళ్లీ వర్గీకరించాలని నిర్ణయించినట్లు, రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అమరావతి రాజధాని ప్రాంతంలో ఎత్తిపోతల పథకం కింద సాగవుతున్న భూములను కూడా జరీబు భూముల కేటగిరీలో చేర్చాలని కోరుతూ కృష్ణాయపాలెంకు చెందిన కె అనిల్ కుమార్ అనే రైతు వేరువేరుగా దాఖలు చేసిన రెండు పిటిషన్లను హైకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ఏపి ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ భూములను మళ్లీ వర్గీకరించాలని నిర్ణయించిందని, గతంలో వర్గీకరించిన భూముల వివరాల మేరకు విధానాన్ని అమలు చేయమని హైకోర్టుకు తెలిపారు. తన వాదనలు రికార్డు చేస్తూ పిటిషన్లను కొట్టివేయాలని ఆయన హైకోర్టును అభ్యర్ధించారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ఇ మనోహర్ వాదనలు వినిపిస్తూ, ఇంతవరకు భూముల పునఃవర్గీకరణపై రాష్ట్రప్రభుత్వం ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదన్నారు. భూములను మళ్లీ వర్గీకరించేంత వరకు పిటిషన్లను కొట్టివేయవద్దని హైకోర్టును అభ్యర్ధించారు. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు రైతులకు ప్లాట్లు కేటాయించబోమన్నారు. కొత్త వర్గీకరణ ప్రకారమే రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. అనతరం ఈ కేసు విచారణను జూన్ 14వ తేదీకి వాయిదా వేశారు.
పరీక్ష పేపర్ తారుమారులో
ఇద్దరు లెక్చరర్ల సస్పెన్షన్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 12: ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా విజయనగరం జిల్లా కొమరాడలో ఒక సెట్‌కు బదులు మరో సెట్ ఇచ్చిన ఇద్దరు అధికారులను ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు సస్పెండ్ చేశారు. వారిద్దరి వ్యవహారంపై బోర్డు కార్యదర్శి విచారణకు ఆదేశించారు. గత నెల 15వ తేదీన ఫస్టియర్ పరీక్షల్లో సెట్-2ను రాష్టవ్య్రాప్తంగా పంచగా, కొమరాడ కేంద్రంలో మాత్రం సెట్-3 విద్యార్ధులకు పంచారు. పరీక్ష కేంద్రంలో 168 మంది కెమిస్ట్రీ పేపర్‌ను, 42 కామర్స్ పేపర్‌ను రాశారు. దీంతో లెక్చరర్లు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావడంతో వ్యవహారం కాస్తా బట్టబయలైంది. దీనిపై విచారణ జరిపించిన ఆర్‌ఐఓ తన నివేదికలో చీఫ్ సూపరింటెండెంట్ ఎ రాజు, డిపార్టుమెంటల్ ఆఫీసర్ ఎం.తాత బాబులు తప్పు చేసినట్టు తేల్చారు. దీంతో పరీక్ష రాసిన విద్యార్ధులకు న్యాయం చేస్తామని చెప్పిన బోర్డు కార్యదర్శి, తప్పు చేసిన అధికారులపై చర్యలకు ఆదేశాలు ఇచ్చారు.
బినామీ రుణాలపై విచారణ
ఆర్‌సిఎస్‌కు బాధ్యత
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 12 : ఎపిలోని 19 బ్యాంకులు/ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా బినామీ పేర్లతో వ్యవసాయ రుణాలు ఇచ్చారన్న ఆరోపణపై ప్రాథమిక ఆధారాలు లభించడంతో పూర్తి వివరాలు సేకరించేందుకు విచారణ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బాధ్యతను రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ (ఆర్‌సిఎస్) కు అప్పగిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. విచారణను మూడు నెలలలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి కె. సునీత సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. బినామీ రుణాలకు సంబంధించిన సమాచారాన్ని అందించాలని రైతు సాధికార సంస్థ సిఇఓను కోరారు.

టిడిపిలోకి సుజయకృష్ణ రంగారావు?
చంద్రబాబును కలిసిన సోదరులు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఏప్రిల్ 12: విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైనట్టు విశ్వసనీయంగా తెలిసింది. సుజయకృష్ణ రంగారావు, ఆయన సోదరుడు బేబీనాయన మంగళవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. వైసిపి నుంచి టిడిపిలో చేరడానికి ఈ నెల 15 లేదా 17 తేదీల్లోని ఒక తేదీని ఖరారు చేయాల్సిందిగా ముఖ్యమంత్రిని రంగారావు కోరినట్టు తెలిసింది. రంగారావుతోపాటు నియోజకవర్గంలోని ఆయన క్యాడర్ మొత్తం టిడిపిలో చేరబోతోంది.
2014 ఎన్నికల్లో వైసిపి నుంచి బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికయ్యారు. కొంత కాలం పార్టీలో బాగానే పనిచేశారు. కొద్ది కాలం కిందట బొత్స సత్యనారాయణ వైసిపిలో చేరారు. ఆయన చేరికను రంగారావు వ్యతిరేకించారు. దీంతో పార్టీలో విభేదాలు ఆరంభమయ్యాయి.

అప్పట్లోనే రంగారావు పార్టీ వీడి వెళ్లిపోతారని ప్రచారం జరిగింది. అయితే ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రరావు రంగారావును బుజ్జగించారు. అప్పటి నుంచి మళ్లీ జగన్‌తో కలిసి పనిచేస్తున్నారు. ఇటీవల వైసిపి ఎమ్మెల్యేలంతా టిడిపిలోకి క్యూ కడుతున్నారు. అటువంటి సమయంలో కూడా రంగారావు పార్టీని వీడి వెళ్లకపోవచ్చని భావించారు. కానీ రంగారావు తన క్యాడర్ మొత్తంతో టిడిపిలో చేరనున్నారు.

ఫిరాయింపుదారులపై
వేటు తప్పదు : వైకాపా
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 12: వైకాపా నుంచి టిడిపిలోకి పార్టీని ఫిరాయించిన అందరు ఎమ్మెల్యేలకు చట్టప్రకారం అనర్హత వేటు తప్పదని మాజీ మంత్రి, వైకాపా సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు తెలిపారు. మంగళవారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ తాత్కాలికంగా చర్యలు తీసుకోవాల్సిన స్పీకర్ వౌనంగా ఉన్నా, పట్టించుకోకపోయినా, చట్టం తన పనితానుచేసుకుని పోతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నిరకాలుగా దిగజారి, రాజకీయ దివాళాకోరుతనంతో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం సిగ్గుచేటన్నారు. 2003లో అప్పటి బిజెపి ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు రాజ్యాంగ సవరణ తెచ్చిందని, అందులో అనర్హత వేటుపై స్పష్టత ఉందన్నారు. కాగా ఇప్పటికీ ఈ చట్టాన్ని అమలు చేసేందుకు ఆచరణలో ఎదురవుతున్న అవరోధాలను తొలగించేందుకు మరింత కట్టుదిట్టమైన చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కేశవరెడ్డి విద్యా సంస్ధలను చైతన్య అనే మరో సంస్ధలకు అప్పచెప్పడంపై ధ్వజమెత్తారు. కేశవరెడ్డి సంస్ధ రూ. 740 కోట్ల డిపాజిట్లను ప్రజల నుంచి వసూలు చేసిందని, దీనికి కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఈ అంశంపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన కోరారు.
మోడల్ ఎంసెట్‌కు
అద్భుత స్పందన
54 వేల మంది హాజరు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 12: భారత విద్యార్ధి ఫెడరేషన్ నిర్వహించిన నమూనా ఎంసెట్‌కు అద్భుత స్పందన వచ్చింది. దాదాపు 54వేల మంది దీనికి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్టవ్య్రాప్తంగా 150 కేంద్రాల్లో ఇంజనీరింగ్‌కు 38 వేల మంది, మెడికల్ విభాగానికి 16వేల మంది హాజరయ్యారని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు టి ప్రవీణ్‌కుమార్, ఎం మహేష్, కోటబాబు, వసంత్‌లు హాజరయ్యారు. మంగళవారం ప్రశ్నాపత్రాలను విజయవాడ ఎంబివికెలో స్థానిక ఆర్‌ఐఓ ఎం రాజారావు, రాష్టక్రార్యదర్శి ఎస్ నూర్ మహమ్మద్‌తో కలిసి ఆవిష్కరించారని వారు చెప్పారు. ఈ సందర్భంగా నూర్ మహమ్మద్ మాట్లాడుతూ 15 ఏళ్లుగా నిర్వహిస్తున్న నమూనా ఎంసెట్‌కు రాష్ట్రంలో మంచి ఆదరణ ఉందని అన్నారు. అతి తక్కువ నామమాత్రపు ఫీజుతో ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్‌కు ధీటుగా దీనిని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ఏడాది ప్రముఖ విద్యావేత్త మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య కన్వీనర్‌గా వ్యవహరించారని చెప్పారు. ఎస్‌ఎఫ్‌ఐలో నమూనా ఎంసెట్‌లో టాపర్లుగా నిలిచిన విద్యార్ధులు ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్‌లోనూ టాపర్లుగా నిలుస్తున్నారని అన్నారు. మెడికల్ సీట్ల భర్తీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో అక్రమాలు జరుగుతున్నాయని ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఈవ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలన్నారు.

యాజమాన్యాల కోటాలో సీట్లు వచ్చినా విద్యార్ధులకు కూడా డొనేషన్లు కూడా వసూలు చేయకూడదని, కాని ప్రైవేటు యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఒకొక్క సీటును ఇప్పటికే కోటి నుండి కోటి యాభై లక్షల రూపాయిల వరకూ బేరాలు ఆడుతున్నాయని ఈ అక్రమాలకు అడ్డుకట్టవేయాలని అన్నారు.

ఆర్థిక సాయానికి వయోపరిమితి పెంపు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 12 : ఎస్‌సి, ఎస్‌టి లకు చెందిన వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వీలుగా వ్యాపారం తదితర అవసరాల కోసం అందచేసే ఆర్థిక సాయం కోసం వయోఃపరిమితిని ప్రభుత్వం పెంచింది. ఇప్పటి వరకు 21 ఏళ్ల నుండి 45 ఏళ్ల వరకు వయస్సు ఉన్న వారికి ఆర్థిక సాయం అందచేసేవారు. ఇప్పుడు గరిష్ట వయోఃపరిమితిని 50 సంవత్సరాలకు పెంచారు. అంటే ఇక నుండి 21-50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారికి ఆర్థిక సాయం అందిస్తారు. ఈ కారణంగా ఇప్పటి వరకు ఉన్న నియమావళిని మార్పు చేసి అమలు చేయాలంటూ ఎపి షెడ్యూల్డ్‌కులాల సహకార పరపతి ఆర్థిక సంస్థతో పాటు, ఎపి షెడ్యూల్డ్ ట్రైబ్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పోరేషన్ లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టు జడ్జిగా
సురేష్ కైత్ ప్రమాణం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 3: హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సురేష్ కైత్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఢిల్లీ హైకోర్టు నుంచి ఇక్కడికి బదిలీ అయ్యారు. ఈ కార్యక్రమాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి బోసలే నిర్వహించారు. జస్టిస్ సురేష్ కైత్ 1963 మే 24వ తేదీన హర్యానాలో కకౌత్ గ్రామంలో జన్మించారు. కురుక్షేత్ర వర్శిటీ నుంచి డిగ్రీ, పిజి కోర్సులను పూర్తి చేశారు. అనంతరం యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి లా డిగ్రీ పట్టా తీసకున్నారు. 1989లో న్యాయవాదిగా బార్ అసోసియేషన్‌లో పేరు నమోదు చేసుకున్నారు. 2008 సెప్టెంబర్ 5వ తేదీన ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం 2013లో పర్మినెంట్ జడ్జిగా నియమితులయ్యారు.
బయటి వ్యక్తుల జోక్యం నివారించండి
సెంట్రల్ వర్శిటీ అధికారులకు,
పోలీసులకు హైకోర్టు ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 12: యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ వ్యవహారాల్లో వర్శిటీకి సంబంధం లేని బయటివారు, ఇతరులు జోక్యం చేసుకోకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, వర్శిటీలో శాంతికి భంగం కలుగకుండా చర్యలు తీసుకోవాలని వర్శిటీ అధికారులు, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌కు హైకోర్టు మంగళవారం ఆదేశించింది. రాజకీయ పార్టీలు, ఇతర సంస్ధలు వర్శిటీలో ఎటువంటి సమావేశాలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని కోర్టు పేర్కొంది. వర్శిటీలో శాంతిని పునరుద్ధరించేటట్లు చర్యలు తీసుకోవాలంటూ ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు జడ్జి జస్టిస్ చల్లా కోదండరామ్ విచారించారు. అనంతరం హైకోర్టు పై విధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వర్శిటీలో పరీక్షలను దృష్టిలో పెట్టుకుని విశ్వవిద్యాలయంలో ప్రశాంత వాతావరణం నెలకొనేటట్లు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.
ఆర్టీసి సిబ్బందికి సాఫ్ట్‌వేర్‌పై శిక్షణ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 12: తెలంగాణలోని ప్రతి ఆర్టీసి డిపో ఒక ప్రాఫిట్ కేంద్రంగా మార్చేందుకు, డిపో మేనేజర్ల పర్‌ఫార్మెన్స్ పెంపొందించేందుకు సర్వీసు/షెడ్యూల్/రూట్/ప్రాడక్టు వంటి ముఖ్య కార్యాచరణ, వాటి పర్యవేక్షణపై ఆర్టీసి ఒక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. సిఇఅండ్‌ఐటి ఆర్‌వి జయంత్ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌పై ఆర్టీసిలోని డిప్యూటీ సిటిఎం, డివిఎంలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సోమవారం హకీంపేట్‌లోని ట్రాన్స్‌పోర్ట్ అకాడమిలో ఇడి పురుషోత్తం నాయక్ ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సిటిఎం/డివిఎంలకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని తద్వారా ఆర్టీసి లాభాల బాటలో నడుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డిప్యూటీ సిటిఎం/హెచ్‌ఓ సుదర్శన్ మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు చేసిన సాఫ్ట్‌వేర్ ద్వారా ఖర్చు, ఆదాయం ఎలా లెక్క కట్టాలి, సాఫ్ట్‌వేర్ ఒక యూనిట్‌లో కట్టే లెక్క ప్రాముఖ్యతను డిపో మేనేజర్లకు వివరించారు.
జ్యుడీషియరీలో రిజర్వేషన్లు ఇవ్వాలి
16న దీక్ష చేయనున్న విహెచ్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 12: జ్యుడీషియరీలో, ప్రభుత్వ రంగ సంస్ధల ఉద్యోగ నియమాకాల్లోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఈ నెల 16న ఎఐసిసి నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావు దీక్ష చేయనున్నారు. ఇందిరా పార్కు వద్ద ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేయనున్నట్లు ఆయన మంగళవారం తెలిపారు.

వీడియో చూసి
పోస్టుమార్టమ్ విశే్లషణ కష్టం
హైకోర్టుకు తెలిపిన ఎయిమ్స్
జూన్ 20వ తేదీకి విచారణ వాయిదా
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 12: వరంగల్ జిల్లాలో ఇద్దరు మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఘటనలో వారి పోస్టుమార్టమ్‌ను వీడియోఫుటేజి ద్వారా చూసి విశే్లషించలేమని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్ధ (ఎయిమ్స్) హైకోర్టుకు మంగళవారం తెలిపింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసలే, జస్టిస్ పి నవీన్ రావుతో కూడిన ధర్మాసనం ఈ కేసులో పౌర హక్కుల నేత చిల్కా చంద్రశేఖర్ దాఖలు చేసిన పిల్‌ను విచారించింది. ఈ కేసులో ఎయిమ్స్ తన అభిప్రాయాన్ని తెలియచేయాలని, పోస్టుమార్టమ్ వీడియోఫుటేజిని దిల్లీకి పంపాలని హైకోర్టు ఆదేశించింది. అనంతరం ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణులు హైకోర్టుకు లేఖ రాశారు. పోస్టుమార్టమ్ నివేదికను చూడకుండా, కేవలం వీడియోఫుటేజి ద్వారా ఒక నిర్ణయానికి రావడం కష్టమని వారు తెలిపారు. ఈ లేఖను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది ఎస్ శరత్ కుమార్ వెంటనే పోస్టుమార్టమ్ నివేదికను ఎయిమ్స్‌కు పంపాలని ఆదేశించింది. పోస్టుమార్టమ్ చేసిన డాక్టర్ల ఫోన్ నంబర్లను కూడా ఎయిమ్స్‌కు పంపే నివేదికలో పేర్కొనాలని ఆదేశించారు. జూన్ 15వ తేదీలోగా ఎయిమ్స్ వైద్యులు తమమ అభిప్రాయాలని చెప్పాలని బెంచ్ ఆదేశించింది. పోలీసులతో సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు కోరింది. అనంతరం ఈ కేసు విచారణను జూన్ 20 తేదీకి వాయిదా వేశారు.