రాష్ట్రీయం

ఇక జాప్యం తగదు..హోదా ఇవ్వాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 18: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మెజారిటీ ప్రజల అభిప్రాయాలను ఏమాత్రం ఖాతరు చేయకుండా రాష్ట్రాన్ని దుర్మార్గంగా విభజించారు.. దీనివల్ల నవ్యాంధ్రప్రదేశ్ ఆర్థికంగా నిప్పుల మీద నడవాల్సి వస్తోంది.. ఉద్యోగాల విషయంలో పూర్తిగా నష్టపోతామని.. అన్ని రంగాలు దెబ్బతింటాయని తెలిసి కూడా విభజన విషయంలో మొండిగా వ్యవహరించారు.. ఈ పరిస్థితుల్లో ప్రత్యేక హోదానే రాష్ట్రానికి జీవనాడి.. ఇక జాప్యం లేకుండా హోదా ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శాసనసభలో 338వ నిబంధన కింద మంగళవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభలో ఏకగ్రీవంగా ఆమోదించిన ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నారు. తీర్మాన సారాంశం పూర్తిస్థాయిలో ఇలా ఉంది. విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రానికి ఆర్థికంగా, ద్రవ్యపరంగా వచ్చిన ఇబ్బందుల్ని భర్తీ చేయటానికి ప్రత్యేక హోదా ఇస్తామని ముందస్తు షరతుతో భారత పార్లమెంటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌ను విభజించారనేది శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు తెలుసు. అన్ని రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం ఉన్న పార్లమెంట్‌లో అటు పాలకపార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీలు అప్పట్లో రాష్ట్ర విభజనకు మద్దతు పలికాయని సీఎం జగన్ గుర్తు చేశారు. విభజన కోరుతున్న రాష్ట్రానికి అత్యధిక ఆదాయాన్ని అందించే రాజధానిని కేటాయించటం చరిత్రలో ఇదే తొలిసారన్నారు. అదే సందర్భంలో అత్యధిక జనాభా, తక్కువ ఆదాయం ఉన్న రాష్ట్రం కనుకే ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించారు. హోదా ఇస్తామనే ముందస్తు హామీతో విడకొట్టి, హామీని నిలబెట్టుకోలేని పార్లమెంట్‌కు అసలు రాష్ట్రాన్ని విభజించే హక్కు ఉందనటం న్యాయమేనా అని నిలదీశారు. ఒక రాష్ట్రంగా మనం ఎంతటి అన్యాయానికి గురయ్యామో ఈ ప్రకటన ద్వారా సభ దృష్టికి తీసుకురాదలచానని చెప్తూ రాష్ట్ర విభజన నష్టాలను ప్రత్యేక హోదా సాధన ద్వారానే అంతో ఇంతో పూడ్చుకోగలుగుతామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం హోదా ఇవ్వాలంటూ అసెంబ్లీ సాక్షిగా మరోసారి ఈ తీర్మానం ఎందుకు చేయాల్సి వస్తోందో వివరించారు. గతంలో ఇదే శాసనసభలో ప్రత్యేక ప్యాకేజీకి ధన్యవాదాలు తెలుపుతూ సభలో గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల తిరిగి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టామన్నారు. అయ్యా.. మాకు ప్యాకేజీ వద్దు.. హోదాయే కావాలంటూ మరోసారి అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపాలనేదే తమ ఉద్దేశమన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని గత ప్రభుత్వం సరిదిద్దకపోగా, అన్యాయాలు మరింత పెరగటానికి కారణమైందని ధ్వజమెత్తారు. ఈ కారణంగానే పోరాటం చేయాల్సి వస్తోందన్నారు. విభజన ఫలితంగా ఉమ్మడి రాష్ట్రానికి చెందిన దాదాపు 59 శాతం జనాభాను, అప్పు- చెల్లింపు బాధ్యతలను వారసత్వంగా పొందామని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభాను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం 47 శాతం ఆదాయం మాత్రమే అప్పగించారని, ఆదాయాన్ని, ఉద్యోగాలను ఇచ్చే రాజధాని నగరం లేకుండా అతి తక్కువ వౌలిక సదుపాయాలతో మానవ, ఆర్థిక అభివృద్ధి సూచికల్లో వెనుకబడిన వ్యవసాయ రాష్ట్రంగా మిగిలామన్నారు. 2015-20 సంవత్సరాల మధ్య కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాను పరిగణనలోకి తీసుకుంటే ఏపీకి రెవెన్యూలోటు రూ. 22,113 కోట్లు ఉంటుందని, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి డివల్యూషన్ తరువాత రెవెన్యూ మిగులు 1,18,678 కోట్లు ఉన్నట్లు 14వ ఆర్థిక సంఘం అంచనా వేసిందన్నారు. వాస్తవానికి గత ఐదేళ్లలో రెవెన్యూలోటు రూ. 66,362 కోట్లకు పెరిగిందని, ఇది ఆర్థికసంఘం అంచనాల కంటే మూడు రెట్లు అధికంగా ఉందన్నారు.
హైదరాబాద్ గత అనేక దశాబ్దాలలో దేశంలోని అనేక ఇతర రాజధాని నగరాల మాదిరిగానే అత్యుత్తమ ఆర్థిక కేంద్రంగా ఆవిర్భవించిందన్నారు. 2013-14 సంవత్సరంలో ఏపీ నుంటి రూ 57వేల కోట్ల సాఫ్ట్‌వేర్ ఎగుమతులు ఉంటే హైదరాబాద్ నగరం నుంచే రూ 56,500 కోట్లు ఉన్నాయన్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ తలసరి ఆదాయం రూ. 14,411 కాగా ఏపీలో కేవలం రూ. 8397 మాత్రమే ఉందన్నారు.
కొత్త రాష్ట్రానికి ఉన్న సవాళ్లను, ఆర్థిక దుస్థితిని దృష్టిలో ఉంచుకుని ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా ప్రకటించారని, దీంతో పాటు రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని నేరుగా ఆర్థిక సహాయం చేయటం ద్వారా అభివృద్ధిపరమైన ప్రోత్సాహకాలు ఇవ్వటం, రాయితీలతో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయితే రాష్ట్రాన్ని విభజించే సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్‌లో చేసిన వాగ్దానాలను విస్మరించాయని ఆరోపించారు. దీనివల్ల రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక, సామాజిక దుస్థితి ఏర్పడిందన్నారు. విభజన సమయంలో 97వేల కోట్లు ఉన్న రుణం 2018-19 నాటికి ఐదేళ్లలో అత్యధికంగా 2లక్షల 58వేల 928 కోట్లకు చేరిందని, రుణంపై వడ్డీనే ఏడాదికి రూ. 20వేల కోట్ల పైచిలుకు చెల్లించాల్సి వస్తోందని వివరించారు. దీనికి అదనంగా అసలు రూపంలో చెల్లించాల్సిన మొత్తం రూ. 20వేల కోట్ల మేరకు ఉందని, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు వినియోగించుకునే రుణాల కోసం ఇచ్చిన హామీల రూపంలో భారీ కంటింజెన్సీ చెల్లింపు బాధ్యతలు ఉన్నాయన్నారు. మరోవైపు ఉపాధికల్పన సామర్థ్యం గణనీయంగా పడిపోయిందని, ఇక్కడి నిరుద్యోగులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయన్నారు.
ఈ నిరుత్సాహ పరిస్థితిని పరిశీలిస్తే రాష్ట్రం ఆర్థికంగా, ద్రవ్యపరంగా కోల్పోయిన వాటిని పూరించేందుకు, రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపేందుకు ప్రత్యేక హోదా తప్పని సరన్నారు. హోదా వస్తే రాష్ట్రానికి గ్రాంటులు అధికంగా వస్తాయని, కేంద్రం నుంచి ఇస్తున్న గ్రాంట్ల తలసరి రూ. 3428 మాత్రమే ఉందన్నారు. పైగా ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక ఆదాయపు పన్ను మినహాయింపు వర్తిస్తుందని చెప్పారు. జీఎస్టీకి సంబంధించిన మినహాయింపులు, ఇతర రాయితీలు, ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాలు హోదాతోనే సాధ్యమవుతాయన్నారు. యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభించాలన్నా, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దారితీసే పారిశ్రామిక ప్రగతికైనా హోదా ద్వారా సంక్రమించే ప్రత్యేక రాయితీలే కీలకమన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, స్టార్ హోటళ్లు, తయారీ రంగ పరిశ్రమలు, ఐటీ సేవలు, అత్యుత్తమ విద్యా సంస్థలు ఏర్పాటవుతాయని తెలిపారు.
వాస్తవాలు ఇలా ఉంటే ప్రత్యేక హోదా ఇవ్వకపోవటానికి రకరకాల సాకులు, వదంతులు ప్రచారంలోకి తెస్తున్నారని ఆక్షేపించారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే ప్రత్యేక హోదా ఇవ్వటం లేదనే వాదన సరైంది కాదన్నారు. ఆర్థిక సంఘం సభ్యులు ప్రొఫెసర్ అభిజిత్‌సేన్ రాసిన లేఖను ఈ సందర్భంగా సభ ముందుంచారు. ప్రత్యేక హోదా రద్దుకు ఆర్థిక సంఘం సిఫార్సు చేయలేదని ఆయన ఆ లేఖలో స్పష్టం చేశారని తెలిపారు. ఏపీకి ప్రత్యేక కేటగిరీ హోదాను మంజూరు చేస్తూ 2014 మార్చి 2వ తేదీన నాటి కేంద్ర మంత్రిమండలి చేసిన తీర్మానాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ గుర్తుచేశారు. కేబినెట్ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని కూడా నాటి కేబినెట్ ప్రణాళికా సంఘాన్ని ఆదేశించిందని వివరించారు. అయితే ఈ దిశగా గత రాష్ట్ర ప్రభుత్వం ప్లానింగ్ కమిషన్‌తో సంప్రతింపులు జరపనందునే హోదా అమలు కాలేదని ఇంతలో 2015 జనవరి ఒకటో తేదీన ప్రణాళికా సంఘం రద్దయి నీతి ఆయోగ్ ఏర్పడిందన్నారు. అనేక ఇతర రాష్ట్రాలు ప్రత్యేక హోదాను కోరుతున్నాయనే వాదనలు, అభిప్రాయాలు కూడా అప్పట్లో ప్రచారంలోకి వచ్చాయన్నారు. ముందస్తు షరతులతో విభజన జరిపిన ఏకైక రాష్ట్రం ఏపీ అని షరతులను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని స్పష్టం చేశారు.
మండలిలో ఆమోదం
శాసనమండలిలో ప్రత్యేక హోదాపై తీర్మానాన్ని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌చంద్రబోస్ ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
చిత్రం...రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి