రాష్ట్రీయం

పేదల సంకెళ్లు తెంచుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ప్రజలు, దేవుడు మెచ్చిన తమ ప్రభుత్వం పేదల సంకెళ్లు తెంచి వారి జీవితాలకు ఓ భరోసా కల్పిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ తమకు 40 ఏళ్ల అనుభవంలేదని, విజన్-2050 అని ప్రజల్ని నమ్మించబోమని టీడీపీ అధినేత చంద్రబాబుకు చురకలంటించారు. తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలు కళ్లారా చూసి చెడిపోయిన వ్యవస్థను బాగుచేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో ఇసుక, మట్టి, రేషన్, పింఛన్, ఇలా ఏది కావాలన్నా లంచం ఇవ్వందే పనులు జరగలేదని విమర్శించారు. ప్రకృతి వనరులను పూర్తిగా దోచేశారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందించే క్రమంలో జ్యుడీషియల్ కమిషన్, రివర్స్ టెండరింగ్ విధానాలను ప్రవేశపెట్టిందని పునరుద్ఘాటించారు. నీతివంతమైన పాలనతోనే పెట్టుబడులు, అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ఉందన్నారు. ప్రత్యేక హోదా విభజన గాయాలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజల రక్తాన్ని గత తెలుగుదేశం ప్రభుత్వం పీల్చేసిందని మండిపడ్డారు. ఇసుక, మైనింగ్, సాగునీటి ప్రాజెక్ట్‌లు, రాజధాని నిర్మాణం, ఇలా అన్ని విభాగాల్లో జరిగిన అవినీతిపై త్వరలో శే్వతపత్రాలు ప్రకటిస్తామని, అవినీతిపై చర్యలు, శిక్ష తప్పవని హెచ్చరించారు. సువిశాలమైన సముద్రతీరం ఉన్న రాష్ట్రంలో వనరుల దోపిడీని అరికట్టి వినియోగంలోకి తెస్తామన్నారు. ప్రజలకిచ్చిన హామీ మేరకు హోదాతో పాటు పెట్టుబడులకు ప్రయత్నిస్తామని ప్రకటించారు. నవరత్నాల అమలుతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతామని స్పష్టం చేశారు. సామాజిక న్యాయంలో తమ ప్రభుత్వం ముందుందని చెప్తూ సొంత సామాజికవర్గాన్ని కాదని మంత్రివర్గంలో 60 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రాతినిధ్యం కల్పించిన ఘనత తమకే దక్కుతుందన్నారు. రాజ్యాధికారంలో అణగారిన వర్గాల ప్రాతినిధ్యం పెంచాలనేదే తమ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వం కార్పొరేట్ విద్యను ప్రోత్సహించి పేద విద్యార్థులకు విద్యను దూరం చేసిందని ఆరోపించారు. తాము ఓటు బ్యాంక్ రాజకీయాలు నడపబోమని చెప్తూ వైఎస్సార్ ఆరోగ్యశ్రీతో కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ సేవలను విస్తృతం చేయటంతో పాటు 350 కొత్త అంబులెన్స్‌లు, మండలానికో 104 వాహనాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత విద్యా ప్రమాణాలు పెంచటంతో పాటు ప్రైవేట్ విద్యా సంస్థల్లో 25 శాతం పేదలకు ఉచితంగా సీట్లు కేటాయించే విధంగా ప్రణాళిక రూపొందించామన్నారు. రైతుల ఆత్మహత్యలను నిలువరించేందుకు అక్టోబర్ 15 నుంచి రూ 12వేల 500 ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఉచితంగా బోర్లు వేయించేందుకు నియోజకవర్గానికి ఒకటి చొప్పున బోర్ రిగ్‌లను అందుబాటులోకి తెస్తామన్నారు. రైతులు, మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తామన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ. 2వేల కోట్లు కేటాయించామని ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటు చేస్తున్నామని ధరల స్థిరీకరణ నిధి కింద రూ 3వేల కోట్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత నాణ్యతా ప్రమాణాలతో అమలు చేస్తామని తెలిపారు. నిరక్షరాస్యతా శాతాన్ని జీరోకు తగ్గించటంలో భాగంగా వచ్చే జనవరి నుంచి అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. అంగన్‌వాడీ, హోంగార్డుల వేతనాలు తెలంగాణలో కంటే వెయ్యి రూపాయలు పెంచుతూ జీవో జారీచేశామన్నారు. డ్వాక్రా యానిమేటర్లు, ఆశా వర్కర్లకు రూ 10వేల వేతనాన్ని ఇప్పటికే ప్రకటించామని పారిశుద్ధ్య కార్మికులకు రూ 18వేల జీతం అందించేందుకు ఆదేశాలు జారీచేశామన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం, ఉద్యోగులకు 27 శాతం ఐఆర్, సీపీఎస్ విధానం రద్దుకు విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నామని కాంట్రాక్ట్ ఉద్యోగాలను క్రమబద్ధీకరించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించామని తెలిపారు. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు నిరుద్యోగులను దగా చేస్తున్నందున వాటిని రద్దుచేసి నేరుగా వారికే వేతనాలు అందేలా కార్యాచరణ చేపట్టామన్నారు. పేదల ఆరోగ్య పరిరక్షణకు ఆరోగ్యశ్రీని విస్తృతం చేస్తున్నామని ఇందులో భాగంగా మెడికల్ అడ్వయిజరీ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఉగాది నుంచి 25 లక్షల పేద కుటుంబాలకు గృహనిర్మాణాన్ని చేపడతామన్నారు. గ్రామ వాలంటీర్లను నియమించటం ద్వారా ప్రభుత్వ పథకాలను రాజకీయాల కతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటికే అందిస్తామన్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా గ్రామ సచివాలయ వ్యవస్థ అమలులోకి వస్తుందని చెప్పారు. ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేస్తామని నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాల్సిందిగా అధికారులను ఆదేశించామని తెలిపారు.