రాష్ట్రీయం

ఏపీతో సత్సంబంధాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అధ్యక్షతన మంగళవారం ప్రగతిభవన్‌లో జరిగిన మంత్రిమండలి సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని కేసీఆర్ స్వయంగా మీడియాకు వెల్లడించారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలను కొనసాగించాలని మంత్రి మండలి అభిప్రాయపడినట్టు తెలిపారు. గోదావరి, కృష్ణా నదులలో ఇరు రాష్ట్రాలు కలిసి 3500 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. వివాదాలు, కోర్టు వ్యాజ్యాలకు వెళ్లకుండా పరస్పరం చర్చించుకుని పరిష్కరించుకుందామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో ఇటీవల భేటీ అయిన సందర్భంగా తీసుకున్న నిర్ణయాల మేరకే ముందుకు సాగాలని మంత్రిమండలిలో నిర్ణయించినట్టు తెలిపారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి, ఆ రాష్ట్ర ఇరిగేషన్ అధికారుల బృందం ఈ నెల 25, 26న హైదరాబాద్‌కు రానుందని తెలిపారు. ఆ తర్వాత తెలంగాణ అధికారుల బృందం అమరావతికి వెళ్తుందన్నారు. ఆ తర్వాత ఇరు రాష్ట్రాల బృందాలు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో నీటిపారుదల ప్రాజెక్టులను సందర్శించి వివాదాలకు ఆస్కారం లేకుండా పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్టు సీఎం కేసీఆర్ వివరించారు. సచివాలయంలో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన భవనాలను అప్పగించే ప్రక్రియ పూర్తి కావడంతో ఈ నెల 25న కొత్త సచివాలయం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనున్నట్టు తెలిపారు. బైసన్ పోలో గ్రౌండ్‌లో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని భావించినప్పటికీ ఆ స్థలాన్ని కేంద్రం ఇవ్వకపోవడంతో పాత సచివాలయం స్థలంలోనే కొత్త భవనాన్ని నిర్మించనున్నట్టు తెలిపారు. పాత సచివాలయం ఆవరణలోనే కొత్త సచివాలయాన్ని నిర్మించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. అలాగే ఎర్రమంజిల్‌లో శాసనసభ, శాసనమండలికి కొత్త భవనాలు నిర్మించాలని నిర్ణయించింది. ఈ రెండు భవనాల నిర్మాణానికి ఈ నెల 25న భూమి పూజ నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. సచివాలయంలో ప్రస్తుతం ఉన్న భవనాలను అన్నింటినీ కూల్చి వేయాలా? కొన్ని భవనాలను అలాగే ఉంచి కొత్త వాటిని నిర్మించాలా? భవన నిర్మాణం ఎలా ఉండాలి తదితర అంశాలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి రోడ్లు, భవనాల శాఖ మంత్రి నేతృత్వంలో సబ్ కటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సబ్ కమిటీ చేసే సిఫారసులపై తుది నిర్ణయాన్ని ముఖ్యమంత్రికి అప్పగిస్తూ మంత్రిమండలి నిర్ణయించినట్టు తెలిపారు. ఎర్రమంజిల్‌లో నిర్మించబోయే శాసనసభ, శాసనమండలి భవనాల నిర్మాణానికి కూడా ఈ నెల 25న భూమి పూజ నిర్వహిస్తామన్నారు. శాసనసభ, శాసనమండలి, సెంట్రల్ హాల్ మూడు భవనాలను వరుసగా పార్లమెంట్ భవన నమూనాలో నిర్మించనున్నట్టు సీఎం కేసీఆర్ వివరించారు. ఇలా ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టుకు ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 21న ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని తెలిపారు. అలాగే ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయాన్ని అందించిన 10 బ్యాంకుల ప్రతినిధులను ఆహ్వానించినట్టు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముందు ఆదే రోజు మేడిగడ్డ వద్ద హోమం నిర్వహించనున్నట్టు తెలిపారు. వచ్చే అతిథుల కోసం ఐదు హెలిప్యాడ్‌లను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మంచి ముహుర్తం ఉండటంతో ఈ నెల 21న ప్రారంభించిన రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోయడం జూలై నుంచి ప్రారంభం అవుతుందని తెలిపారు. ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితిని పెంచుతామని తాము ఇది వరకే ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చామన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి త్వరలోనే నిర్ణయం తీసుకోవడంతో పాటు ఉద్యోగులకు కొత్త వేతన సవరణ సిఫారసుల (పీఆర్‌సీ) ఎంత మేరకు ఇవ్వాలన్న దానిపై త్వరలో ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగులకు మొత్తంగా ఒక ప్యాకేజిగా వయో పరిమితి, పీఆర్‌సీని ప్రకటించబోతున్నట్టు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర నిర్వహించిన దర్శకుడు ఎన్ శంకర్‌కు స్టూడియో నిర్మాణానికి శంకర్‌పల్లి మండలంలో ఐదు ఎకరాలు కేటాయించడానికి కూడా మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు. ఎకరానికి ఐదు లక్షల చొప్పున ధర నిర్ణయించినట్టు తెలిపారు. అలాగే శారదా పీఠానికి వేద పాఠశాల నిర్మాణం కోసం రెండు ఎకరాలు కేటాయించడానికి కూడా మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు. కొత్త పంచాయతీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడంతో పాటు కొత్త మున్సిపల్ చట్టం చేయాలని మంత్రి మండలి నిర్ణయించిందన్నారు. అయితే దీనిని శాసనసభలో చట్టం చేయాలా? లేక ఆర్డినెన్స్ తీసుకవచ్చి అమలు చేయాలా? అనేది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్ష నేతలు కొందరు చేస్తోన్న వ్యాఖ్యల పట్ల సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ప్రపంచంలోనే అతి పొడువైన ఎత్తిపోతల ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు హర్షించాల్సింది పోయి పిచ్చి ప్రేలాపనలు చేసే వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్టు సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.

చిత్రం... కేబినెట్ నిర్ణయాలను వెల్లడిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్