రాష్ట్రీయం

చంద్రబాబు ‘సెల్ఫ్’గోల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 20: ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయ వ్యూహంలో భాగంగానే తెలుగుదేశం పార్టీ చిత్తు అయ్యిందని రాజకీయ విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. సిద్దాంతాలు నమ్ముకుంటే రాజకీయాల్లో ఉండలేం, రాజకీయ నిర్ణయాలే ముఖ్యమన్న చంద్రబాబు సూత్రం టీడీపీని చావుదెబ్బ తీసింది. సెంటిమెంట్‌గా ఆగస్టులో టీడీపీలో సంక్షోభం వస్తుందన్న వాదన ఉండేది. అయితే, ఇప్పుడు జూన్ నెలలోనే పార్టీలో గందరగోళం ఏర్పడింది. టీడీపీ రాజ్యసభ, లోక్‌సభ సభ్యులపై అనేక ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులు నమోదు అయ్యాయి. వీటిని నుంచి తప్పుకోవడానికి బీజేపీలోకి జంప్ అవుతున్నారని విమర్శలు బలంగా ఉన్నాయి. గురువారం టీడీపీ రాజ్యసభ సభ్యులు ఏకంగా నలుగురు బీజేపీ కండువా కప్పుకోవడంతో పాటు ఇటీవల గెలిచిన లోక్‌సభ సభ్యులు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధం అయ్యారు. ఏపీలో టీడీపీ ఆధ్వర్యంలో గెలిచిన ఎమ్మెల్యేలు సైతం బీజేపీలోకి వెళ్లడానికి మార్గం సుగమం అయ్యిందని పార్టీల పరిశీలకులు చెబుతున్నారు. టీడీపీ ఎంపీలు పార్టీ మారడానికి బీజేపీ రాజకీయ ఎత్తుగడలో భాగమేనని కొందరు చెబుతుండగా.. కాదు చంద్రబాబు తన రాజకీయ వ్యూహంలో భాగమేనని పార్టీల నేతలు చెబుతున్నారు. ఏదిఏమైనా టీడీపీ రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా ఉందంటున్నారు. చంద్రబాబు ఓడినా జాతీయ రాజకీయాల్లో పరోక్షంగా చక్రం తిప్పడానికి వ్యూహంలో భాగమేనని అంటున్నారు. చంద్రబాబు రాజకీయ చతురతతో టీడీపీ ఇక ఖాళీ కావడం ఖాయమని రాజకీయ విశే్లషకులు పేర్కొంటున్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై న్యాయశాఖ కమిటీ విచారిస్తుందని ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి ప్రకటనలు టీడీపీ నేతలను భయాందోళనలోకి నెట్టాయ. రానున్న రోజుల్లో ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో విలీనం కావడానికి ప్రస్తుత వలసలు నాంది పలికాయని చెప్పొచ్చు. గురువారం రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, సీఎం రమేష్. టీజీ వెంకటేశ్, గరికపాటి మోహనరావును బీజేపీ సీనియర్ మంత్రి, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా ఆహ్వానిస్తూ కండువాలు కప్పారు. నిన్నటి వరకు పసుపు కండువాతో ఉన్న టీడీపీ నేతలు నేటితో కాషాయం కండువాలతో కన్పిస్తారు. గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌నాయుడు, విజయవాడ ఎంపీ కేశినేని నాని, శ్రీకాకుళం ఎంపీ నాయుడు నేడోరేపో బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సన్నాహలు చేసుకుంటున్నారని పార్టీ వర్గాలు బహిరంగంగా చెబుతున్నాయి. బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యులు తాము బీజేపీలో విలీనం అవుతున్నామని ప్రకటించారు. తాము పార్టీ ఫిరాయింపులకు అవకాశం లేకుండా రాజ్యాంగం 10వ షెడ్యూల్‌లోని 10వ పేరాలోని నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. తాము ప్రతిపాదించిన తీర్మానాన్ని త్వరగా అమలు చేయాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును కోరారు. చంద్రబాబు రాజకీయ అస్తస్రన్యాసం చేస్తూ తెలుగుదేశం పార్టీ బోర్డును తిప్పేశారని పార్టీ వర్గాలు ఘాటుగా స్పందించాయి. ఎన్నికల ఫలితాలు వచ్చి నెల గడవక ముందే పార్టీ నేతలు ఇలా బీజేపీలోకి జారి పోవడం ఏమిటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వర్గీయ ఎన్టీఆర్ సిద్దాంతాలతో పార్టీని స్థాపిస్తే అదే చంద్రబాబు ఏ సిద్దాంతాలు లేకుండా సొంత రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంతో పార్టీ పరిస్థితి నేడు మట్టికొట్టకు పోయిందని పార్టీ సీనియర్ నేతలు కనె్నర్ర చేస్తున్నారు. ఏపీలో అధికారం ఉన్న సమయంలో అనేక కుంభకోణాలు, అవినీతి చర్యలే చంద్రబాబును ఘోరంగా దెబ్బతీశాయని ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. అటు కేంద్రం, ఇటు ఏపీలో చంద్రబాబుకు వ్యతిరేకంగా పాలక ప్రభుత్వాలు ఏర్పాటు కావడం చంద్రబాబు జీర్ణించుకోలేక పోయారు. ఏక్షణమైనా తనపై కేసులు నమోదు చేయవచ్చునన్న బెంగ చంద్రబాబులో రోజురోజుకు అధికం అవుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తనతో పాటు తన కోటరీని కాపాడుకోవడానికి పార్టీ నేతల్ని బీజేపీలోకి పంపుతున్నారని సమాచారం. చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్నా తన ధ్యాసంతా ఏపీపైనే ఉందని విమర్శకులు చెబుతున్నారు. చంద్రబాబు ఒంటెద్దు పోకడలతో టీడీపీ నామరూపాలు లేకుండా పోయందని పార్టీని నమ్ముకున్న నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టించిన తెలుగుదేశం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు పార్టీ ఒక్కసారిగా తీవ్ర సంక్షోభానికి గురి చేశాయి. పార్టీని ఎంతమంది వీడినా నష్టం లేదనీ.. కేడర్ బలంగా ఉందని అమెరికా పర్యటనలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొనడం గమనార్హం.