రాష్ట్రీయం

టెన్త్‌లో ఇంటర్నల్ అసెస్‌మెంట్ ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 20: గుణాత్మక విద్యకు ప్రాధాన్యత కల్పించేందుకు వీలుగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురానున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. టెన్త్‌లో 20 శాతం మార్కుల ఇంటర్నల్ అసెస్‌మెంట్‌ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. వెలగపూడి సచివాలయంలో తన చాంబర్‌లోకి గురువారం లాంఛనంగా ప్రవేశించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ వచ్చే ఐదేళ్లలో విద్యా వ్యవస్థను సంస్కరించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడం సహా వసతులు, మధ్యాహ్న భోజనం పథకాన్ని మెరుగుపరుస్తామన్నారు. తెలుగు భాషతో పాటు ఇంగ్లీషుకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులను నియంత్రిస్తామని స్పష్టం చేశారు. వీటన్నింటినీ అధ్యయనం చేసేందుకు వీలుగా కమిటీని నియమించామని, ఆ ఫైల్‌పై మొదటి సంతకం చేశానని వెల్లడించారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల పదోన్నతుల ఫైల్‌పై రెండో సంతకం చేశానని తెలిపారు. ఉపాధ్యాయుల స్థితిగతులను పరిశీలించి, పదోన్నతులకు మోక్షం కల్పిస్తామన్నారు. స్కూల్ అసిస్టెంట్ల నుంచి ప్రధానోపాధ్యాయుల వరకూ పదోన్నతులు ఇస్తామన్నారు. దీని వల్ల 19 వేల మందికి లబ్ధి కలుగుతుందని వెల్లడించారు. టెన్త్‌లో 20 శాతం మార్కుల ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కుల విధానాన్ని ఎత్తివేస్తూ 3వ సంతకం చేశానని తెలిపారు. ఈ విధానం వల్ల ప్రైవేట్ పాఠశాలలు లబ్ధిపొందుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. బడిబయట పిల్లలు రాజన్న బాట పట్టేలా చేస్తామని, ప్రభుత్వ పాఠశాలలను దేశానికే తలమానికంగా తీర్చిదిద్దుతానన్నారు.
తొలుత ప్రభుత్వ పాఠశాలల్లోనే అమ్మఒడి
అమ్మఒడి కార్యక్రమాన్ని వచ్చే ఏడాది జనవరి 26 నుంచి ప్రారంభిస్తామన్నారు. తొలుత ఈ పథకాన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే అమలు చేస్తామన్నారు. మేధోమథనం తరువాత ప్రైవేట్ పాఠశాలలకు వర్తింపు అంశంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. విద్యార్థుల డ్రాపౌట్‌లను తగ్గించేందుకు ఈ పథకం దోహదపడుతుందన్నారు. విద్యా వ్యవస్థలో మార్పులకు ఇదో పెద్ద అడుగుగా అభివర్ణించారు. ఈ పథకానికి విధి విధానాలు రూపొందించాల్సి ఉందన్నారు. ఈ పథకం పేరు చెప్పి ప్రవేశాలు జరిపే పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తన సమయంలో సగ భాగాన్ని కేటాయిస్తానని తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఫిర్యాదులు స్వీకరించేందుకు నెలలో ఒక రోజు కేటాయిస్తానన్నారు. వర్సిటీ నియామకాల్లో అవకతవకలకు తావు లేకుండా ప్రతిభకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. యూనివర్శిటీలకు మేధావులు, నిపుణులను వీసీలుగా నియమిస్తామన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న బీ.ఎడ్ కళాశాలలపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాణాలు పాటించని ఇంజనీరింగ్ కళాశాలలు, ప్రైవేట్ వర్సిటీలపై కూడా చర్యలు తీసుకుంటానని తెలిపారు.
చిత్రం...బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతున్న మంత్రి ఆదిమూలపు సురేష్