రాష్ట్రీయం

కొలిక్కిరానున్న నీటి వాటాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 22: కృష్ణా, గోదావరి జలాల పంపకంలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలు జరపనున్నారు. ఈ చర్చలకు అమరావతి వేదికగా మారనుంది. ఈ నెల 27వ తేదీ గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమరావతికి వెళ్లి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చర్చలు జరపనున్నారని సమాచారం. ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ చర్చలను ఇరు రాష్ట్రాల రైతాంగం ఆహ్వానిస్తున్నారు. కేంద్రంపై ఆధారపడకుండా వివాదాలు పరిష్కరించుకోవాలన్న కేసీఆర్ మనోగతాన్ని ఆంధ్రప్రజలు స్వాగతించిన విషయం విదితమే. ముందుగా అధికారుల స్థాయిలో చర్చలు జరిగితే ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య చర్చలు కొద్ది రోజుల పాటు వాయిదా పడే అవకాశం ఉంది. త్వరలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జూలై నెలఖరులోపల తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి. ఆ లోగానే నదీ జలాల పంపిణీపై చర్చలు ఒక కొలిక్కిరావచ్చు. ఒక సమావేశంలోనే అన్ని అంశాలకు పరిష్కారం లభించకపోవచ్చు. ఏపీకి చెందిన భవనాలు తెలంగాణకు అడిగిన వెంటనే ఇచ్చేటంతటి సులభమైన అంశం కాదని రాజకీయ విశే్లషకులంటున్నారు. ఆంధ్రాలో అధికారంలోకి వచ్చిన జగన్ ఈ విషయంలో ఆచితూచి అడుగువేస్తున్నట్లు సమాచారం. 2021లోగా పోలవరం నిర్మాణం, పోతిరెడ్డి పాడు ద్వారా రాయలసీమకు సమృద్ధిగా నీటి సరఫరా అంశాలే అజెండాగా జగన్ అడుగులు వేస్తున్నారు. నాగార్జునసాగర్‌లో వరద నీరు గత కొన్ని సంవత్సరాలుగా తగ్గిపోవడంతో ఇరు రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా గోదావరి జలాల మళ్లింపైకూడా ఇరురాష్ట్రాల సీఎంలు చర్చించవచ్చు. గోదావరి జలాలను కృష్ణా నదిలోకి మళ్లిస్తున్న నేపథ్యంలో ఎగువున ఉన్న రాష్ట్రాలు 80 టీఎంసీ కృష్ణా జలాలను వాడుకోవచ్చు. ఇందులో తమకు 40 టీఎంసీ జలాల వాటా ఉంటుందని, ఈ మేరకు నీటి జలాలను వినియోగించుకునే హక్కును కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ అంశంపై రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరగనున్నాయి. కృష్ణా నదిలో నీటి ప్రవాహం తగ్గిపోవడం, శ్రీశైలం నీటిని రాయలసీమ అవసరాల నిమిత్తం పోతిరెడ్డిపాడుకు మళ్లించడం తదితర కారణాలవల్ల ఇరు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తుతోంది. ఈ వివాదాలకు చెక్ పెట్టే విధంగా ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించనున్నారు. కృష్ణా జలాల్లో ఆంధ్రాకు 513 టీఎంసీ, తెలంగాణకు 299 టీఎంసీ నీటి కేటాయింపులు ఉన్నాయి. కాని కృష్ణా నదిలో నీటి లభ్యత తగ్గడంతో రెండురాష్ట్రాలు ఆ మేరకు నీటిని వినియోగించుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలం రిజర్వాయర్‌పై వత్తిడి పెరుగుతోంది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఎదురయ్యే చిక్కులపై తెలంగాణ ప్రభుత్వం న్యాయపరంగా దాఖలు చేసిన కేసు విషయమై కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. భద్రాచలం నీటి ముంపునకు గురవుతుందనుకుంటే, పునరావాసం, నిర్వాసితలయ్యే గిరిజనులకు ఉత్తమ ప్యాకేజీ ఇచ్చే విషయం చర్చకు వచ్చే అవకాశం ఉంది.
రాజోలిబండ ప్రాజెక్టు ఆధునీకరణకు సహకరించాలని తెలంగాణ ప్రభుత్వం ఏపీని కోరనుంది. పాత మహబూబ్‌నగర్ జిల్లాలో 87వేల ఎకరాలకు తుంగభద్రపై నిర్మించిన రాజోలిబండ వల్ల సాగునీరు అందుతోంది. ఈ విషయంలో రాయలసీమలో కర్నూలు జిల్లా రైతులు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. అలాగే కర్నూలు జిల్లాలో తుంగభద్రపై మంత్రాలయం-గూడూరు మధ్య ఒక ప్రాజెక్టును నిర్మించాలనే ప్రతిపాదనను ఆంధ్ర ప్రభుత్వం చాలా సంవత్సరాలుగా పరిశీలిస్తోంది. ఇటీవల విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజీకి ఎగువున వైకుంఠాపురం బ్యారేజీకి చంద్రబాబు ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. దీనివల్ల పది టీఎంసీ నీటిని నిల్వ చేయవచ్చు. ఈ ప్రాజెక్టుకు రూ.2112 కోట్ల ఖర్చవుతుంది. ఈ పథకాన్ని తెలంగాణ వ్యతిరేకిస్తోంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల గోదావరి జలాలను కృష్ణా పరివాహక ప్రాంతానికి మళ్లిస్తున్నారని ఏపీ ప్రభుత్వం గోదావరి బోర్డుకు దృష్టికి తీసుకెళ్లింది. ఈ అంశం కూడా చర్చకు రావచ్చని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కృష్ణా బోర్డును ఆంధ్రాలో, గోదావరి బోర్డును తెలంగాణలో ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. ప్రస్తుతం కృష్ణా బోర్డు ఆంధ్రాకు తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఈ బోర్డును హైదరాబాద్‌లోనే ఉండాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. దీనిపై కూడా ఇరువురు సీఎంలు చర్చించి ఒక నిర్ణయం తీసుకోవచ్చును.