ఆంధ్రప్రదేశ్‌

ఆర్టీపిపికి ముంచుకొస్తున్న నీటి గండం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఏప్రిల్ 13: ఆర్టీపిపి (రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు)ని నీటి సమస్య వెంటాడుతోంది. తెలుగుగంగలో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్, మైలవరం ప్రాజెక్టుల నీటి వినియోగానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఆ ప్రాజెక్టుల సమీపంలోని ప్రజలకు సాగునీరు మాటలావుంచి తాగునీరే గగనంగా మారింది. గతంలో ఆర్టీపిపికి బొగ్గుకష్టాలు ఉండగా, బొగ్గు కొరత పరిష్కారమై ఇప్పుడు నీటి కష్టాలు మొదలయ్యాయి. బ్రహ్మంసాగర్ ప్రాజెక్టు నుంచి ఆర్టీపిపికి ప్రతినిత్యం 47 క్యూసెక్కులు విడుదల కావాల్సివుండగా అక్కడ ప్రస్తుతం 40 క్యూసెక్కుల నీటినే విడుదల చేస్తున్నారు. బ్రహ్మంసాగర్ ప్రాజెక్టు 17.730 టిఎంసిల నీటి సామర్థ్యంతో నిర్మించగా ప్రస్తుతం 1.50 టిఎంసిల నీరు మాత్రమే ఉంది. ఆర్టీపిపికి పైపుల ద్వారా నీరు విడుదలవుతుండగా ఇటీవల పైపులకు రంధ్రాలు పడి పెద్దఎత్తున నీరు వృథా అయ్యింది. 2011 జూలై నుంచి ఆర్టిపిపికి నీరు సరఫరా చేస్తున్నారు. బ్రహ్మంసాగర్‌లో నీరు రోజురోజుకు అడుగంటుతుండటంతో రాబోయే రోజుల్లో నీరు అందడం అనుమానంగా ఉంది. ఇదిలాఉండగా ఆర్టీపిపికి అత్యంత సమీపంలో 22 కి.మీ.దూరంలోని మైలవరం ప్రాజెక్టు ద్వారా 38 క్యూసెక్కుల నీరు నాలుగు మాసాల పాటు సరఫరాకు ప్రభుత్వం అనుమతించింది. మైలవరం ప్రాజెక్టు 9.965 టిఎంసిల నీటి సామర్థ్యంతో నిర్మించారు. ప్రస్తుతం 0.590 టిఎంసిల నీరు మాత్రమే ఈ ప్రాజెక్టులో ఉంది. ప్రాజెక్టు నీటిని నమ్ముకుని ఉన్న జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో ప్రజలకు అరకొరగా మాత్రమే నీరందుతోంది. ఒకవేళ ఆర్టీపిపికి నీరు సరఫరా చేసినట్లయితే పలు గ్రామాలకు తాగునీటి సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్టీపిపికి నీరు వదిలినట్లయితే తమకు నీటి కొరత తీవ్రంగా ఏర్పడుతుందని 70 వేల మంది జనాభా ఆందోళన చెందుతున్నారు. ఈమేరకు మైలవరం ప్రాజెక్టు పరిధిలోని జమ్మలమడుగు, మైలవరం , పెద్దముడియం మండలాల్లో 21 గ్రామాలకు నీటి సరఫరా కావాల్సివుంది. ఈ మారు వేసవి తీవ్రత అధికం కావడం, అధిక ఉష్ణోగ్రతలతో ప్రాజెక్టుల్లో నీరు కూడా ఆవిరవుతుతోంది. ఆర్టీపిపిలో 5 యూనిట్లలో 1050 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కావాల్సి ఉంది. నీటి కష్టాలు మొదలుకావడంతో విద్యుత్ ఉత్పత్తి తగ్గుముఖం పట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. నీటి సమస్య తీరితే తప్ప ఆర్టీపిపిలో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశాలు కన్పించడం లేదు.