రాష్ట్రీయం

లాబీయంగ్‌పై జగన్ సీరియస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో లాబీయింగ్‌లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్ర శాసనసభ, సచివాలయం వద్ద నెలరోజులుగా కోలాహలం నెలకొంది. శాసనసభ సమావేశాలు జరిగే సమయంలో, సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునేందుకు పలువురు ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, నాయకులు, అనుచరులతో నిత్యం సచివాలయం కిటకిటలాడుతోంది. సచివాలయం క్యాంటీన్‌లో సైతం ఎన్నడూ లేనంత రద్దీ నెలకొంది. దీనిపై ముఖ్యమంత్రి జగన్ ఆరా తీసినట్లు తెలిసింది. ఒక్క రెవెన్యూ శాఖ మినహా మిగిలిన మంత్రులు, ఉన్నతాధికారుల పేషీల వద్ద సిఫార్సుల కోసం పలువురు బారులు తీరుతున్నారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జగన్ ఓ విజన్‌తో ముందుకెళ్లాలని నిర్ణయించారు. ఆరు నెలలు తిరక్కుండానే మంచి సీఎంగా పేరు తెచ్చుకుంటానని ప్రకటించారు. అంతేకాకుండా మంత్రులెవరైనా అవినీతికి పాల్పడితే తక్షణం ఉద్వాసన తప్పదని కూడా హెచ్చరికలు చేశారు. ప్రభుత్వ విధానాల్లో పారదర్శకత గురించి ప్రతి సమీక్ష సమావేశంలో గుర్తుచేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ప్రజావేదికలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ అక్రమాల వేదికను కూల్చాలని సైతం ఆయన ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిన ప్రతి శాఖను ప్రక్షాళన చేయాలని, టెండర్లలో అక్రమాలను నివాచేందుకు రివర్స్ టెండరింగ్, జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు వంటి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. సీనియర్లను కూడా కాదని మంత్రివర్గంలో కొందరు జూనియర్లకు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే కొందరు మంత్రుల కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు అప్పుడే సచివాలయంలో హవా సాగిస్తున్నట్లు ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది. బదిలీలు కావాలన్నా, మరేవైనా పనులు కావాలన్నా మంత్రులతో చెప్పి చేయిస్తామంటూ వారు బాహాటంగానే బేరసారాలకు దిగుతున్నట్లు వేగుల వ్యవస్థ ద్వారా తెలుసుకున్న ముఖ్యమంత్రి దీనిపై సీరియస్‌గా స్పందించినట్లు తెలిసింది. మహిళా మంత్రులతో పాటు ఓ సీనియర్ మంత్రినికూడా ఈ మేరకు ఆయన మందలించారనే ప్రచారం జరుగుతోంది.
మరోవైపు ప్రతిపక్షం ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టటంలోనూ మంత్రులు విఫలమవుతున్నారనే భావన కూడా పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇదే అంశాన్ని సీఎం జగన్ సైతం ఇటీవల తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. మంత్రులు బాధ్యతలు స్వీకరించి పట్టుమని పదిరోజులు కూడా కాకముందే ఓ మంత్రి ఉన్నతాధికారులను పిలిపించుకుని తన శాఖ పరిధిలో ఎంత ఆదాయం వస్తుందని ప్రశ్నించారని, ఈ విషయం సీఎం జగన్‌కు తెలిసి తీవ్రస్థాయిలో మండిపడ్డారని విశ్వసనీయ సమాచారం. ఇది తెలుసుకున్న మంత్రులు సచివాలయంలోని తమ ఛాంబర్ల వద్ద జరిగే ముచ్చట్లు సీఎంకు ఎలా తెలుస్తున్నాయని చర్చించుకుంటున్నట్లు తెలిసింది. బదిలీలకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యేల నుంచి సిఫార్సు లేఖలు అందుతున్నాయని, దీనె్నలా పట్టించుకోలేమని మంత్రులు వాదిస్తున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో తమను ఇబ్బంది పెట్టిన అధికారులను మార్చాలనే విషయంలో ముఖ్యమంత్రి సైతం సానుకూలంగా స్పందిస్తున్నట్లు చెపుతున్నారు. అయితే కొందరు మంత్రుల కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అనుచరులు పనులు చేయిస్తామంటూ ప్రచారం చేసుకోవటం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే విషయమే జగన్ ఆగ్రహానికి కారణమని తెలుస్తోంది. అధికార పగ్గాలు చేపట్టి తొలివిడత సమీక్ష పూర్తికాకుండానే నెలరోజుల్లోనే తమ ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టటంలో మంత్రులు, పార్టీ సీనియర్లు విఫలమవుతున్నారని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. మంత్రి పదవులు పొందలేని ఆశావహులు, గతంలో పార్టీలో ఫైర్‌బ్రాండ్‌గా ఉన్న నేతలు కూడా ప్రతిపక్షం ఆరోపణలకు దీటుగా స్పందించటంలేదని సీఎం అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఇకపై ఎలాంటి సిఫార్సు లేఖలు ఆమోదించవద్దని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం.
ఇదిలావుంటే సీఎం జగన్ ఆరాధిస్తున్న ఓ స్వామీజీకి ఇటీవల రాష్ట్రంలోని రేషన్ డీలర్లు, మధ్యాహ్న భోజన ఏజెన్సీల నిర్వాహకులు వినతిపత్రాలు అందించటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో పాలనా వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని నివారించే విషయంపై కూడా ముఖ్యమంత్రి జగన్ దృష్టి కేంద్రీకరించినట్లు సమాచారం.